Share News

KTR: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మడత పెట్టి కొట్టే రోజులు త్వరలో: కేటీఆర్

ABN , Publish Date - Aug 24 , 2025 | 02:12 PM

రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి నిప్పులు చెరిగారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మడత పెట్టి కొట్టే రోజులు దగ్గరల్లోనే ఉన్నాయన్నారు.

KTR: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మడత పెట్టి కొట్టే రోజులు త్వరలో: కేటీఆర్
BRS Working President KTR

హైదరాబాద్, ఆగస్టు 24: ఉప ఎన్నిక వస్తుందని పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు భయపడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తే.. ఉప ఎన్నికలు అంటే భయం ఎందుకని పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేయాలని.. ఎవరు గెలుస్తారో చూసుకుందమంటూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు ఆయన సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డినా?.. కేసీఆరా? అనేది ప్రజలే తేలుస్తారని స్పష్టం చేశారు.

ఆదివారం హైదరాబాద్ మియాపూర్‌లోని ఒక ఫంక్షన్ హాల్ వేదికగా శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. దీనికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ కాంగ్రెస్ పార్టీ 20 నెలల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేసీఆర్, కేటీఆర్‌లపై కేసులు నమోదు చేయడం తప్పా అంతకు మించి చేసిందేమి లేదని వ్యంగ్యంగా అన్నారు. సొంత ఆస్తులు, భూములు పెంచుకోవటానికే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని ఆరోపించారు.


కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మడత పెట్టి కొట్టే రోజులు త్వరలోనే వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పార్టీని వీడినా.. శేరిలింగంపల్లిలోని కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్ వైపే నిలబడ్డారని హర్షం వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో అరాచకం చేస్తుందని మండిపడ్డారు. దుర్గం చెరువులోని సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు కూల్చే దమ్ము ఉందా? అంటూ హైడ్రాకు కేటీఆర్ సవాల్ విసిరారు.


గ్రేటర్ హైదరాబాద్ నగరం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ విషయం అనేక ఎన్నికల్లో రుజువైందని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్‌ను అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. హైదరాబాద్ నగరాన్ని తెలంగాణకు గుండెకాయగా కేసీఆర్ చేశారని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సన్నాసి పనుల వలన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా.. కాంగ్రెస్ నాయకుల దందాలకే పని కొస్తుందని విమర్శించారు. బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద ఆర్ ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారంటూ స్వయంగా ప్రధాని మోదీ ఆరోపించిన విషయాన్ని ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. రైతు బంధు, ఆసరా పెన్షన్లు సమర్థవంతంగా అమలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతోందని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

రంగంలోకి ఎన్టీఆర్ ఫ్యాన్స్.. అనంతపురంలో ఉద్రిక్తం

రాహుల్‌కి ముద్దు పెట్టిన యువకుడు.. చితక్కొట్టిన సిబ్బంది

For More Telangana News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 02:19 PM