Delhi: 100 మందిని మొసళ్లకు వేసి.. హింస మహాపాపం అని ప్రచారం..
ABN , Publish Date - May 22 , 2025 | 08:27 AM
Delhi Serial Killer Arrested: 100 మందిని అతిక్రూరంగా చంపి హింస మహాపాపమంటూ ప్రచారం చేస్తున్నాడు ఓ హంతకుడు. రెండేళ్లుగా పరారీలో ఉన్న ఆ సీరియల్ కిల్లర్ ఎట్టకేలకు సినీఫక్కీలో పోలీసుల చేతికి చిక్కాడు. 'డాక్టర్ డెత్' గా పేరుగాంచిన..

Doctor Devendra Sharma Serial Killer Arrested: పవిత్రమైన వైద్య వృత్తి చేపట్టి ప్రజల పాలిట మృత్యువులా మారాడు ఓ వ్యక్తి. కనిపించిన వారినల్లా చంపుకుంటూ పోతూ 'డాక్టర్ డెత్' గా ప్రసిద్ధి గాంచాడు. పోలీసుల చేతికి చిక్కినట్టే చిక్కి పదే పదే తప్పించుకు తిరుగుతున్న ఈ సీరియల్ కిల్లర్ ఈసారి విచిత్రమైన స్థితిలో పట్టుబడ్డాడు. సుమారు 100 మందికి పైనే చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 'డాక్టర్ డెత్'.. రెండేళ్లుగా ఏ జీవినైనా హింసించడం ఘెరమైన పాపమని.. దానికి ప్రాయశ్చిత్తమే లేదంటూ నీతి సూక్తులు వల్లిస్తున్నాడు. ఏ కారణం లేకుండానే పరమ కిరాకతంగా మనుషుల్ని హతమార్చే'డాక్టర్ డెత్' సడన్‌గా ఎందుకు మారిపోయాడు.. ఏ స్థితిలో పోలీసులకు పట్టుబడ్డాడు..
పూజారి అవతారమెత్తి..
'డాక్టర్ డెత్' గా పేరుగాంచిన సీరియల్ కిల్లర్ 67 ఏళ్ల దేవేంద్ర శర్మ రెండేళ్లుగా పరారీలో ఉన్నాడు. తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దేవేంద్ర.. 2023 ఆగస్టులో పెరోల్‌పై విడుదలయ్యాడు. అప్పటినుంచీ పోలీసుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. ఢిల్లీ, జైపూర్, అలీఘర్, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్ ఇలా దాక్కునేందుకు ప్రదేశాలను మారుస్తూనే ఉన్నాడు. ఇటీవల తన ఐడెంటిటీ బయటపడకుండా ఉండేందుకు రాజస్థాన్‌లో దౌసాలోని ఒక ఆశ్రమంలో పూజారిగా అవతారమెత్తాడు. ప్రజలకు జీవహింస మహాపాపమంటూ ఉపదేశాలు ఇస్తూ నమ్మిస్తున్నాడు. అయితే, పోలీసులకు సీరియల్ కిల్లర్ ఆచూకీ తెలియడంతో వారు కూడా భక్తులమంటూ ఆశ్రమానికి వెళ్లారు. సినీఫక్కీలో దొంగ పూజారిని అరెస్టు చేశారు. దీంతో ఇన్నాళ్లూ అతడు దైవస్వరూపుడని నమ్మిన భక్తులు ఒక్కసారిగా షాకయ్యారు. ఏడు హత్య కేసుల్లో జీవిత ఖైదు, ఒక కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న 'డాక్టర్ డెత్' నిజస్వరూపం తెలిసి భయబ్రాంతులకు గురవుతున్నారు.
కిడ్నీ రాకెట్‌తో వెలుగులోకి..
BAMS (బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ) డిగ్రీ పొందిన దేవేంద్ర శర్మ ఆయుర్వేద వైద్యుడిగా పనిచేసేవాడు. ఇతడిపై 27 హత్య, కిడ్నాప్, దోపిడీ కేసులు ఉన్నాయి. ఢిల్లీ, రాజస్థాన్, హర్యానాలలో ఏడు వేర్వేరు కేసుల్లో దేవేంద్రకు జీవిత ఖైదు విధించింది కోర్టు. మరో కేసులో గుర్గావ్ కోర్టు మరణశిక్ష విధించింది. 1994లో గ్యాస్ డీలర్‌షిప్ ఒప్పందంలో భారీ ఆర్థిక నష్టాలు రావడం శర్మ ఈ నేరాలకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. 1998- 2004 మధ్య కిడ్నీ రాకెట్‌ను నిర్వహించడం ద్వారా అపఖ్యాతి పాలయ్యాడు. అనేక రాష్ట్రాల్లో వైద్యులు, మధ్యవర్తుల సహాయంతో 125 కి పైగా అక్రమ కిడ్నీ మార్పిడికి సహకరించాడు.
మృతదేహాలను మొసళ్లకు ఆహారంగా..
2002- 2004 మధ్య అనేకమంది టాక్సీ, ట్రక్ డ్రైవర్లను దారుణంగా హత్య చేయడంతో దేవేంద్ర పేరు వెలుగులోకి వచ్చింది. టాక్సీ డ్రైవర్లను చంపి వారి వాహనాలను గ్రే మార్కెట్‌లో విక్రయించేవాడు. మృతి చెందిన వారి ఆధారాలు బయటకు రాకుండా ఉండేందుకు ఉత్తరప్రదేశ్ కాస్‌గంజ్‌లో మొసళ్లతో నిండిన హజారా కాలువలో మృతదేహాలను వేసేవాడు. వరస హత్యలు, కిడ్నీ రాకెట్ కేసులో తొలిసారి 2024లో పోలీసులు అరెస్టు చేయడంతో.. ఈ సీరియల్ కిల్లర్ కు 'డాక్టర్ డెత్' అనే పేరొచ్చింది.
పెరోల్ పై విడుదలైన తర్వాత శర్మ పరారీలో ఉండటం ఇదే మొదటిసారి కాదు . 2020లో అతడు 20 రోజుల పెరోల్ తర్వాత తిరిగి రాలేదు. ఏడు నెలల గాలింపు చర్యల అనంతరం ఢిల్లీలో పోలీసులకు పట్టుబడ్డాడు.మళ్లీ జూన్ 2023లో సరితా విహార్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో శర్మకు రెండు నెలల పెరోల్ లభించింది. కానీ, ఆగస్టు 3, 2023 తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత రాజస్థాన్ ఆశ్రమంలో పోలీసులకు దొరికిపోయాడు.
Operation Sindoor: జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కీలక ప్రకటన
Viral Video: విమానంపై వడగళ్ల వాన.. 227 మంది ఉన్న ఫ్లైట్‌కు తప్పిన ఘోర ప్రమాదం..