Share News

Viral Video: విమానంపై వడగళ్ల వాన.. 227 మంది ఉన్న ఫ్లైట్‎కు తప్పిన ఘోర ప్రమాదం..

ABN , Publish Date - May 22 , 2025 | 08:10 AM

ఓ విమానం ఆకాశంలో హఠాత్తుగా వడగండ్ల వానలో చిక్కుకుంది. ఒక్కసారిగా భారీ వడగండ్లు విమానంపై పడటంతో క్యాబిన్‌లో ఆందోళన వాతావరణం నెలకొంది. దీంతో అందులో ఉన్న 227 మంది ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Viral Video: విమానంపై వడగళ్ల వాన.. 227 మంది ఉన్న ఫ్లైట్‎కు తప్పిన ఘోర ప్రమాదం..

ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు (Delhi to Srinagar) ప్రయాణించిన ఇండిగో విమానం 6E2142 ఘోర ప్రమాదం నుంచి కొంచెంలో తప్పించుకుంది. 227 మంది ప్రయాణికులతో గమ్యస్థానం వైపు వెళ్లిన ఈ విమానం, హఠాత్తుగా వడగండ్ల తుఫానులో చిక్కుకుంది. ఆ క్రమంలో విమానం ముందు భాగంలో నష్టం జరిగినప్పటికీ, పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించి శ్రీనగర్ విమానాశ్రయంలో సాయంత్రం 6:30 గంటలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు. అయితే దీనికి ముందు ఫ్లైట్ కుదుపులకు లోను కావడంతో అందులో ప్రయాణిస్తున్న వారు తీవ్ర భయాందోళన చెందారు. ఈ సంఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.


ప్రయాణికులు మాత్రం..

వీడియోలో ప్రయాణికులు సీట్లను గట్టిగా పట్టుకుని కుర్చున్నట్లుగా కనిపిస్తుంది. ఆ సమయంలో అనేక మంది కూడా భయాందోళనతో కూర్చున్నారు. మరికొంత మంది భయంతో కేకలు వేశారు. ఇంకెంత మంది కాపాడాలని ప్రార్థనలు చేశారు. పైలట్‌ ఈ క్లిష్ట పరిస్థితిని అద్భుతంగా నిర్వహించారని చెప్పవచ్చు. ఈ క్రమంలో పైలెట్ వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించి, శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించారు. ఆయన నైపుణ్యం, నిర్ణయాల వల్ల విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ క్రమంలో ఒక ప్రయాణికుడు తన అనుభవాన్ని వివరించాడు. ఆ క్షణాలు మరచిపోలేని భయానక అనుభవాన్ని అందించాయని వెల్లడించాడు.


ఘటన వివరాలు

ఈ విమానం మే 21న ఢిల్లీ నుంచి సాయంత్రం 5:00 గంటలకు బయలుదేరింది. సుమారు 6:30 గంటలకు శ్రీనగర్ విమానాశ్రయం చేరుకునే సమయంలో, విమానం తీవ్రమైన తుఫానును ఎదుర్కొంది. ఆ సమయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి, శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు పైలెట్. చివరకు ఫ్లైట్ సురక్షితంగా శ్రీనగర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. కానీ విమాన ముందు భాగంలో కొంచెం దెబ్బతింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత, శ్రీనగర్ విమానాశ్రయం సిబ్బంది ప్రయాణికుల సంక్షేమం గురించి ఆరా తీశారు. వారికి అవసరమైన సహాయం అందించారు. ఇండిగో సంస్థ కూడా ఈ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ప్రయాణికుల సూచనలు

ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో ప్రయాణాలు చేయడం నివారించాలని నిపుణులు చెబుతున్నారు. ప్రయాణానికి ముందు వాతావరణ పరిస్థితులను పరిశీలించడం, విమాన సంస్థల సూచనలను పాటించడం చాలా ముఖ్యమని అంటున్నారు.


ఇవీ చదవండి:

Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..

Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు


Bengaluru Roads: రోడ్ల అధ్వాన స్థితిపై రూ.50 లక్షల పరిహారం కోరుతూ లీగల్ నోటీస్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 22 , 2025 | 08:13 AM