Share News

Bengaluru Roads: రోడ్ల అధ్వాన స్థితిపై రూ.50 లక్షల పరిహారం కోరుతూ లీగల్ నోటీస్..

ABN , Publish Date - May 20 , 2025 | 09:54 AM

బెంగళూరులో అధ్వాన రోడ్ల కారణంగా తనకు వెన్ను నొప్పి రావడంతోపాటు అనేక ఇబ్బందులు పడున్నట్లు ఓ వ్యక్తి పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే బృహత్ బెంగళూరు మహానగర పాలికపై రూ. 50 లక్షల పరిహారం కోసం లీగల్ నోటీసు పంపించాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

Bengaluru Roads: రోడ్ల అధ్వాన స్థితిపై రూ.50 లక్షల పరిహారం కోరుతూ లీగల్ నోటీస్..
Bengaluru roads compensation

బెంగళూరు: భారతదేశ ఐటీ రాజధాని బెంగళూరు. లక్షలాది మంది కలలను నిజం చేసే నగరం. కానీ, ఈ నగరంలోని రోడ్లు (Bengaluru Roads) ప్రస్తుతం హాట్ టాపిక్‎గా మారాయి. గుంతలు, గతుకులు, వర్షం నీటితో నిండిన రోడ్లు.. బెంగళూరు వాసులకు సర్వసాధారణమైన సమస్యలు. కానీ, ఈ సమస్యల గురించి దివ్య కిరణ్(43) అనే వ్యక్తి ఏకంగా బృహత్ బెంగళూరు మహానగరపాలిక (BBMP)కు నోటీసులు పంపించాడు. రూ. 50 లక్షల పరిహారం కోరుతూ లీగల్ నోటీసు అందించాడు. కారణం ఏంటంటే నగరంలోని గతుకుల రోడ్ల వల్ల తనకు కలిగిన శారీరక బాధలు, మానసిక ఆందోళన అని పేర్కొన్నాడు.


శారీరక, మానసిక బాధలు

దివ్య కిరణ్ ఒక సామాన్య పౌరుడు. పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి తన వంతు సహకారం అందించే వ్యక్తి. కానీ, BBMP తన పనితీరులో విఫలమవడం వల్ల అతను రోజూ శారీరక బాధలు, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. గతుకుల రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు ఏర్పడే ఇబ్బందులు, కదలికల వల్ల అతనికి తీవ్రమైన మెడ, వీపు నొప్పులు వచ్చాయి. ఈ నొప్పులు అంత సామాన్యమైనవి కావు. ఆ క్రమంలో ఐదు సార్లు ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్‌లను సంప్రదించాల్సి వచ్చింది.

నాలుగు సార్లు సెయింట్ ఫిలోమినా హాస్పిటల్‌కు అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చిందన్నాడు. ఇంజక్షన్లు, చికిత్సలు, నొప్పి నివారణ మందులు.. ఇవన్నీ అతని రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. ఆ క్రమంలో నా క్లయింట్ తీవ్రమైన నొప్పితో బాధపడ్డారని, నొప్పి వల్ల అనేక రాత్రుళ్లు నిద్రపోలేక, ఆందోళనతో కన్నీళ్లు పెట్టుకున్నారని, ఈ బాధలు అతని రోజువారీ జీవితాన్ని, పనిని దెబ్బతీశాయని దివ్య కిరణ్ తరఫు నోటీసు పంపిన అడ్వకేట్ కేవీ లవీన్ తెలిపారు.


క్యాబ్‌ల్లోనూ బాధ

ప్రస్తుత పరిస్థితుల్లో దివ్య కిరణ్‌ ఆటోలు, టూ-వీలర్‌లలో ప్రయాణించడం అసాధ్యమని అంటున్నారు. గతుకుల రోడ్లు అతని వెన్నెముక, మెడ సమస్యలను మరింత తీవ్రతరం చేశాయి. క్యాబ్‌లలో ప్రయాణించడం కూడా పెద్ద సవాలేనని చెబుతున్నారు. క్యాబ్‌లు కొంచెం సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, రోడ్ల స్థితి వల్ల అవి కూడా అతని బాధను తప్పించలేకపోతున్నాయని అతని లాయర్ అన్నారు. ఈ పరిస్థితి అతని స్వతంత్రతను, వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని దెబ్బతీసిందన్నారు.


సామాన్యుడి పోరాటం

ఈ సమస్యలన్నీ BBMP తీవ్ర నిర్లక్ష్యం, ప్రజా బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలం వల్లనే జరిగాయని దివ్య కిరణ్ ఆరోపించారు. అందుకు గాను రూ. 50 లక్షల పరిహారం, వైద్య ఖర్చులు, రూ. 10,000 లీగల్ నోటీసు ఖర్చులను 15 రోజుల్లో చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ BBMP స్పందించకపోతే, లీగల్ చర్యలు తీసుకుంటామని నోటీసులో స్పష్టం చేశారు. గతంలో కూడా అధికారులకు ఈ సమస్య గురించి చెప్పినా పట్టించుకోలేదన్నారు. అందుకే నోటీసు పంపినట్లు వెల్లడించారు. అవసరమైతే, పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL) కూడా దాఖలు చేస్తానన్నారు. మంచి రోడ్లు అందించడం రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యత కాదా? అని ప్రశ్నించారు.


ఇవీ చదవండి:

Trump Putin Call: రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణ చర్చలపై ట్రంప్ కీలక ప్రకటన..


IPL 2025: ప్లేఆఫ్ సినారియోను మార్చేసిన హైదరాబాద్ జట్టు..కానీ చివరకు..


Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..

SBI: ఎఫ్‌డీ ఆశలకు బ్రేక్.. రెండోసారి కోత పెట్టిన ఎస్‌బీఐ


మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 20 , 2025 | 10:42 AM