Operation Sindoor: జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కీలక ప్రకటన
ABN , Publish Date - May 22 , 2025 | 08:31 AM
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ ప్రతీకార దాడుల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో బాధిత కుటుంబాలను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పరామర్శించారు.

శ్రీనగర్, మే 22: ఆపరేషన్ సింధూర్ అనంతరం పాకిస్థాన్ ప్రతీకార చర్యల కారణంగా జమ్మూ కాశ్మీర్‌లో బాధిత కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. అలాగే బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి తాము అధిక ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. బుధవారం పూంచ్ జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. అలాగే ఈ దాడుల్లో జరిగిన ఆస్తి నష్టాన్ని ఆయన స్వయంగా అంచనా వేశారు. వీటికి సైతం పరిహారం అందించేందుకు సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. సైన్యం, పోలీసులతో పాటు ఇతర భద్రతా దళాలు ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఉగ్రవాద వ్యతిరేకంగా జరుగుతోన్న ప్రచారంలో మన దళాలకు మద్దతు ఇవ్వాలంటూ ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఆయన పిలుపు నిచ్చారు. అలాగే అత్యవసర సేవలను సైతం వెంటే పునరుద్ధరించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 26 మంది మరణించారు. ఈ ఘటనలో పాకిస్థాన్ హస్తం ఉందని భారత్ సాక్ష్యాలు సంపాదించింది. దీంతో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ సైతం అదే రీతిలో నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత్‌పై పాకిస్థాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఆ క్రమంలో భారత్ సరిహద్దులుగా ఉన్న రాష్ట్రాలపైకి డ్రోనులు, క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడుల్లో 27 మంది మరణించారు. మరో 70 మంది గాయపడ్డారు. మరోవైపు ఈ దాడుల్లో మరణించిన వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read:
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి