BJP: దుర్యోధనుడు, దుశ్శాసనుడు కూడా మీరే.. మమతపై బీజేపీ ఫైర్
ABN , Publish Date - Dec 31 , 2025 | 04:27 PM
ఎన్నికల సన్నాహకాలను సమీక్షించేందుకు మూడు రోజుల పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రిని టీఎంసీ బాస్ బెదిరించారని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర తప్పుపట్టారు. తాము తలుచుకుని ఉంటే మమతా బెనర్జీని ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన చోటు నుంచి బయటకు అడుగు పెట్టకుండా చేసేవాళ్లమని అన్నారు.
కోల్‌కతా: కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను దుశ్శాసనుడితో పోలుస్తూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. దేశ హోం మంత్రిని బెదిరించడం ఏమిటని నిలదీసింది. పశ్చిమబెంగాల్‌కు దుర్యోధనుడు, దుశ్శాసనుడు కూడా మమతా బెనర్జీయేనని అభివర్ణించింది.
ఎన్నికల సన్నాహకాలను సమీక్షించేందుకు మూడు రోజుల పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రిని టీఎంసీ బాస్ బెదిరించారని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర తప్పుపట్టారు. తాము తలుచుకుని ఉంటే మమతా బెనర్జీని ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన చోటు నుంచి బయటకు అడుగు పెట్టకుండా చేసేవాళ్లమని అన్నారు. 'ఆ పని చేయకపోవడం మీ అదృష్టం' అని మమతను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీరు బెదిరించినది ఆమిత్‌షాను కాదని, ఇండియాను బెదిరించారని అన్నారు. వరుసగా మూడు కీలక ఎన్నికలను తృణమూల్‌కు అప్పగించి ఓటమిపాలైనా ఈసారి మాత్రం బీజేపీ మూడింట రెండు వంతుల మెజారిటీతో బెంగాల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సంబిత్ పాత్ర ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ రాజు బిస్తా మాట్లాడుతూ, హోం మంత్రి అమిత్‌షాపై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం గౌరవం లేకుండా ఉన్నాయని, ఒక ముఖ్యమంత్రి ఈ తరహాలో మాట్లాడటం సరికాదని అన్నారు. బీజేపీ కూడా ఇదే తరహా మాటలు మాట్లాడగలదని, కానీ అది తమ సిద్ధాంతం కాదని పేర్కొన్నారు. కాగా, మమతా బెనర్జీ వ్యాఖ్యలపై అమిత్‌షా ఇంతవరకూ స్పందించలేదు.
అమిత్‌షా వర్సెస్ మమత
బంగ్లా సరిహద్దుల నుంచి దేశంలోనికి అక్రమ చొరబాట్లకు మమతా బెనర్జీనే కారణమంటూ అమిత్‌షా మంగళవారంనాడు తప్పుపట్టారు. చొరబాట్లదార్లను తమ ఓటు బ్యాంకుగా ఆమె మార్చుకున్నారని ఆరోపించారు. సరిహద్దు ఫెన్సింగ్‌కు భూములు అడుగుతూ తాము ఏడు లేఖలు రాసినా సీఎం స్పందించలేదన్నారు. టీఎంసీ పాలనలో హింస, అవినీతి రాజ్యమేలాయని ఆరోపించారు. చొరబాట్ల సమస్య కేవలం రాష్ట్ర సమస్య కాదని, జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని అన్నారు. అమిత్‌షా వ్యాఖ్యలపై మమత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'బెంగాల్‌కు ఒక దుశ్శాసనుడు వచ్చారు. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ దుశ్శాసన, దుర్యోధనులు కనిపించడం మొదలవుతుంది. సమాచార సేకరణ కోసం దుశ్శాసనుడు వచ్చారు. పెన్సింగ్ కోసం మమతా బెనర్జీ భూములివ్వలేదని ఇవాళ వాళ్లు చెబుతున్నారు. నేను భూములు ఇవ్వకపోతే ఏమి జరిగి ఉండేది? పేట్రాపోల్‌లో భూములు ఇచ్చింది ఎవరు? ఆండాల్‌లో భూములు ఎవరిచ్చారు?' అని మమతాబెనర్జీ ప్రశ్నించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఎస్ఐఆర్ పేరుతో ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారని బీజేపీని తప్పుపట్టారు.
ఇవి కూడా చదవండి..
వొడాఫోన్ ఐడియా ఎజీఆర్ బకాయిల ఫ్రీజ్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
దుశ్శాసనుడు వచ్చారు.. అమిత్‌షాపై విరుచుకుపడిన మమత
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి