Bengaluru: డీకే, మజుందార్ షా మధ్య ముదురుతున్న వివాదం
ABN , Publish Date - Oct 19 , 2025 | 09:16 PM
చెత్త కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని, దేశలోని ప్రధాన నగరాల్లోని ఏ మున్సిపాలిటీ దీనిని పరిష్కరించడం లేదని, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఈ చెత్త సమస్య దయనీయంగా ఉందని మజుందార్ ఇటీవల ట్వీట్ చేశారు.
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో రోడ్ల అస్తవ్యస్థ పరిస్థితులపై బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా (Kiran Mazumdar-shaw) చేసిన వ్యాఖ్యల వివాదం ముదురుతోంది. దీనిపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) ఆదివారంనాడు మరోసారి స్పందించారు. మున్సిపల్ సమస్యలపై కొంత మంది అతి చేస్తున్నారనీ, ఇక్కడ వ్యాపారాలు ప్రారంభించిన కొంతమంది నేడు ఉన్నత స్థాయికి ఎదిగి తమ మూలాలనే మరిచిపోతున్నారని కౌంటర్ ఇచ్చారు. ఇదే వ్యక్తులు బీజేపీలో ఉన్నప్పుడు ఎందుకు నోరువిప్పలేదని ప్రశ్నించారు. అయితే డీకే వ్యాఖ్యల్లో నిజం లేదంటూ కిరణ్ మజుందార్ వెంటనే స్పందిచారు.
వివాదం ఇలా..
చెత్త కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని, దేశలోని ప్రధాన నగరాల్లోని ఏ మున్సిపాలిటీ దీనిని పరిష్కరించడం లేదని, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఈ చెత్త సమస్య దయనీయంగా ఉందని మజుందార్ ఇటీవల ట్వీట్ చేశారు. దీనిపై డీకే వెంటనే స్పందించారు. సవాళ్లనేవి ఉన్నాయని, వాటిని సమర్ధవంతంగా పరిష్కరిస్తుున్నామని చెప్పారు. మజుందార్ రోడ్లను అభివృద్ధి చేయాలనుకుంటే చేయవచ్చని, ఆమె అడిగితే గుంతలు పూడ్చేందుకు రోడ్లు, నిధులు కేటాయిస్తామన్నారు. ఇదే అంశంపై డీకే మరోసారి స్పందిస్తూ, విమర్శలు స్వీకరించేందుకు తాను సిద్ధమేనని, కొందరు అతి చేస్తున్నారని, ఇటువంటి వాటికి తాను భయపడేది లేదని అన్నారు. ఇదే వ్యక్తులు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయారని నిలదీశారు. దీని వెనుక వ్యక్తిగత ఎజెండా ఉన్నట్టు కనిపిస్తోందని మజుందూర్‌పై విమర్శలు గుప్పించారు.
మజుందార్ వివరణ
డీకే వ్యాఖ్యలపై తాజాగా కిరణ్ మజుందార్ వివరణ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి మాటల్లో నిజం లేదన్నారు. బెంగళూరు సిటీలో మౌలిక వసతుల క్షీణతపై గతంలో తాను, మోహన్‌దాయ్ పాయ్ అప్పటి బీజేపీ, జేడీఎస్ ప్రభుత్వాలను కూడా విమర్శించినట్టు చెప్పారు. స్వచ్ఛత, రోడ్ల పునరుద్ధరణ అనేవే తమ ఎజెండా అని ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
26 లక్షల దీపాలతో అయోధ్య ప్రపంచ రికార్డు
దీపావళి వేళ.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి