Ayodya Deepotsav World Record: 26 లక్షల దీపాలతో అయోధ్య ప్రపంచ రికార్డు
ABN , Publish Date - Oct 19 , 2025 | 07:10 PM
అయోధ్యకు రాముడు తిరిగి వచ్చినప్పటి సంబరాలను గుర్తుచేసుకుంటూ శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణ వేషధారులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హారతి ఇచ్చారు. సంప్రదాయకంగా పుష్పక విమాన్ రథాన్ని లాగారు.
అయోధ్య: రామజన్మభూమి అయోధ్య (Ayodhya) మరోసారి వెలిగిపోయింది. 9వ దీపోత్సవం అంగరంగ వైభవంగా ఆదివారం నాడు నిర్వహించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా 56 ఘాట్‌లలో 26 లక్షలకు పైగా దీపాలను వెలిగించారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక, సాంకేతికతల మేళవింపుతో నిర్వహించిన ఈ ఉత్సవంలో వేలాది మంది భక్తులు, వలంటీర్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఈ దీపోత్సవ్ (Deepotsav)ను ప్రారంభించడంతో ఒక్కసారిగా అయోధ్యలో సంబరాలు మిన్నంటాయి.

హారతి, రథం ఊరేగింపు
అయోధ్యకు రాముడు తిరిగి వచ్చినప్పటి సంబరాలను గుర్తుచేసుకుంటూ శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణ వేషధారులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హారతి ఇచ్చారు. సంప్రదాయకంగా పుష్పక విమాన్ రథాన్ని లాగారు. ఈ సందర్భంగా 2,100 మంది కళాకారులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. ప్రత్యేక రామ్‌లీలా ప్రదర్శనకు ఐదు దేశాల నుంచి కళాకారులు విచ్చేశారు. ఈ ఉత్సవాలు రాత్రంతా ఎంతో కోలాహలంగా సాగనున్నాయి.
33,000 మంది వలంటీర్లు
డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవథ్ యూనివర్శిటీ సారథ్యంలో వేలాది మంది వలంటీర్లు సరయూ నది ఒడ్డున ఉన్న ఘాట్ల వెంబడి దీపాలను ఏర్పాటు చేశారు. ఏకకాలంలో దీపాలు వెలిగించేందుకు 33,000 మంది వలంటీర్లు ఇందులో పాల్గొన్నారు. 56 ఘాట్లకు దీపాలను పంపిణీ చేసినట్టు దీపోత్సవ్ నోడల్ అధికారి ప్రొఫెసర్ సంత్ శరణ్ మిశ్రా తెలిపారు. భారతీయుల విశ్వాసాలు, సంప్రదాయాలు, అంకితభావానికి దీపోత్సవ్ సంకేతమని, అయోధ్య వారసత్వాన్ని ప్రపంచానికి చాటేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రతి వలంటీర్‌కు గర్వకారణమని యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ బిజేంద్ర సింగ్ తెలిపారు.
నిషాద్ బస్తీ, దేవ్కలి స్లమ్స్‌లో పర్యటించిన యోగి
దీనికి ముందు, అయోధ్యలోని నిషాద్ బస్తీ, దేవ్కాలి స్లమ్ సెటిల్‌మెంట్స్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యటించారు. అక్కడి నివాసులతో సంభాషించారు. దీపాలు వెలిగించి స్వీట్లు పంచారు. పిల్లలకు ట్రోఫీలు అందజేశారు. సామాజిక సామరస్యం అనే థీమ్‌తో ఈ ఏడాది దీపోత్సవ్ నిర్వహించడం విశేషం. దీపోత్సవ్ సందర్భంగా ఉదయం హనుమాన్‌గర్హి మందిరాన్ని ముఖ్యమంత్రి దర్శించి.. రాష్ట్రం శాంతి, సౌభాగ్యాలతో వెల్లివిరియాలని కోరుకుంటూ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
దీపాలు, కొవ్వొత్తులకు ఖర్చు దండుగ.. అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
దీపావళి వేళ.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి