Vande Bharat Ticket: వందే భారత్ టికెట్లకు లాస్ట్ మినిట్ ఛాన్స్! 15 నిమిషాల ముందుగా ఎలా బుక్ చేయాలి?
ABN , Publish Date - Aug 09 , 2025 | 05:38 PM
భారతీయ రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ ప్రకటించింది. రైల్వేల కొత్త నియమం ప్రకారం, ఇకపై ఎవరూ టికెట్ బుకింగ్ కాలేదని చింతించాల్సిన పనిలేదు. ఇకపై ప్రయాణికులు రైల్వే స్టేషన్ చేరుకోవడానికి 15 నిమిషాల ముందే టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
దూర ప్రయాణాలు చేసే చాలామంది ప్రజలు రైళ్లలో ప్రయాణం చేసేందుకు ఇష్టపడతారు. దేశంలో ఎక్కడికైనా తక్కువ ఖర్చుతో వెళ్లగలిగే సౌలభ్యం ఉండటమే ప్రధాన కారణం. కానీ, రైల్లో ప్రయాణం చేసేందుకు టికెట్ పొందడం చాలా కష్టం. తత్కాల్ కోసం ప్రయత్నించినప్పటికీ చివరి నిమిషంలో బుకింగ్ కాదు. అప్పుడు గమ్యస్థానానికి సమయానికి చేరుకోలేని పరిస్థితి తలెత్తుంది. ఈ అసౌకర్యాన్ని అరికట్టేందుకు భారతీయ రైల్వే శాఖ కొత్త సదుపాయం ప్రవేశపెట్టింది. ప్రయాణికులు రైలు బయలుదేరే 15 నిమిషాల ముందుగా టిక్కెట్లు కొనుగోలు చేసే సౌకర్యాన్ని కల్పించింది. అత్యవసరంగా ప్రయాణించాల్సిన వారికి ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. అయితే, ప్రస్తుతం ఈ సేవలు వందే భారత్ రైళ్లకు మాత్రమే వర్తిస్తాయి.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు15 నిమిషాల ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకునే సౌకర్యాన్ని దక్షిణ రైల్వే జోన్ కల్పిస్తోంది. అయితే, ఈ రియల్ టైమ్ టికెట్ బుకింగ్ సౌకర్యం ప్రస్తుతం 8 రైళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ రైళ్లన్నీ దక్షిణ రైల్వే జోన్‌కు చెందినవి. దక్షిణ రైల్వే (SR) జోన్‌లో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.
15 నిమిషాల ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా?
ముందుగా మీరు IRCTC వెబ్‌సైట్ లేదా IRCTC యాప్‌లోకి లాగిన్ అవ్వాలి.
ఇప్పుడు మీ ట్రిప్ వివరాలను అందించాలి. బోర్డింగ్ స్టేషన్, గమ్యస్థానం, తేదీ. దీనితో పాటు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఎంచుకోవాలి.
తదుపరి పేజీలో అందుబాటులో ఉన్న సీట్లను చూస్తారు. మీకు ఇష్టమైన క్లాస్, ఎగ్జిక్యూటివ్ లేదా చైర్ కార్‌ను ఎంచుకుని కన్ఫర్మ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు టికెట్ కోసం ఆన్‌లైన్ పేమెంట్ చేయాలి. SMS, ఇమెయిల్, WhatsApp ద్వారా టికెట్ అందుతుంది.
ఏ రైళ్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉందంటే?
20631 మంగళూరు సెంట్రల్ - తిరువనంతపురం సెంట్రల్
20632 తిరువనంతపురం సెంట్రల్ - మంగళూరు సెంట్రల్
20627 చెన్నై ఎగ్మోర్ - నాగర్‌కోయిల్
20628 నాగర్‌కోయిల్ - చెన్నై ఎగ్మోర్
20642 కోయంబత్తూర్ - బెంగళూరు కంటోన్మెంట్
20646 మంగళూరు సెంట్రల్ - మడ్గావ్
20671 మధురై - బెంగళూరు కంటోన్మెంట్
20677 డాక్టర్ MGR చెన్నై సెంట్రల్ - విజయవాడ
రిజర్వేషన్ వ్యవస్థ (PRS)లో నవీకరణ తర్వాత ఈ సౌకర్యం ప్రారంభించినట్లు రైల్వేలు చెబుతున్నాయి. వందే భారత్ రైళ్లు ప్రారంభమైన తర్వాత సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ ఇంటర్మీడియట్ స్టేషన్లలో టికెట్ బుకింగ్ అనుమతించలేదు. కానీ ఇప్పుడు ఆ రూల్ తొలగించారు. దీంతో ప్రయాణీకులు రైళ్లో ఏ ఇంటర్మీడియట్ స్టేషన్ నుంచి అయినా వందే భారత్ రైలు బయలుదేరే 15 నిమిషాల ముందు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఇతర రైళ్లలో కూడా ఇటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తుందని రైల్వే వర్గాయి చెబుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
వర్షాకాలంలో తడి బట్టల టెన్షన్‌కు గుడ్ బై చెప్పండిలా!
ప్రతి ఒక్క విద్యార్థి తప్పక చదవాల్సిన కలాం సూక్తులు!
For More Latest News