Flight- Powerbank Fire: షాకింగ్.. విమానం గాల్లో ఉండగా పవర్ బ్యాంక్‌లో మంటలు రేగడంతో..
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:01 PM
విమానం గాల్లో ఉండగా పవర్ బ్యాంక్‌కు మంటలు అంటుకుని క్యాబిన్ అంతటా పొగలు వ్యాపించిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: కేఎల్ఎమ్ రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానంలో మంగళవారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగా ఓ పవర్ బ్యాంక్‌లో మంటలు రేగడంతో విమానమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. ప్రయాణికులు భయంతో వణికిపోయారు. పొగను పీల్చకుండా తమ ముఖాలకు కర్చీఫ్‌లను అడ్డు పెట్టుకున్నారు. బ్రెజిల్‌లోని శావో పావొలో నుంచి ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన ఫ్లైట్ అటెండెంట్ ఫైర్ ఎక్స్‌టింగ్యూషర్‌తో మంటలను ఆర్పేశారు. దీంతో, అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత విమానం యథాప్రకారం సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంది.
ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్ సంస్థ స్పందించింది. పవర్ బ్యాంకుకు మంటల అంటుకోవడంతో విమానంలో పొగలు వ్యాపించాయని తెలిపింది. ఫ్లైట్ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పేశారని వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది.
పవర్ బ్యాంక్స్ లేదా పోర్టబుల్ చార్జర్స్‌లో లిథియమ్ అయాన్ బ్యాటరీలు ఉంటాయన్న విషయం తెలిసిందే. పవర్ బ్యాంక్స్‌ను విమానాల్లో తీసుకెళ్లేందుకు అనుమతి ఉన్నా ప్యాసింజర్లు వాటిని తమ వద్దే పెట్టుకోవాల్సి ఉంటుంది. చెక్డ్ లగేజీలో వీటిని అనుమతించరు. మార్గమధ్యంలో బ్యాటరీ వేడెక్కి అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో ఎయిర్ లైన్స్ సంస్థలు ఈ నిబంధనను పాటిస్తాయి.
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ గణాంకాల ప్రకారం, విమానాల్లో లీథియమ్ అయాన్ బ్యాటరీల్లో మంటలు చెలరేగిన ఉదంతాలు 2015తో పోలిస్తే 388 శాతం మేర పెరిగాయి. వారానికి సగటు రెండు మార్లు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ బ్యాటరీల విషయంలో ఫ్లైట్ అటెండెంట్స్ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నట్టు ఓ సర్వేలో తేలింది. ఈ బ్యాటరీతో ముప్పు ఉందని సర్వేలో పాల్గొన్న 87 శాతం మంది అంగీకరించారు. ప్రతి నలుగురు ప్యాసింజర్‌లలో ఒకరు తమ చెక్డ్ బ్యాగేజీలో ఈ బ్యాటరీలను కూడా పెట్టినట్టు వెల్లడించారు. ఇక గత నెలలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానంలో పవర్ బ్యాంకుకు మంటలు అంటుకోవడంతో ఫ్లోరిడాలో అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది.
ఇప్పటికే కొన్ని ఎయిర్‌లైన్స్ పవర్ బ్యాంక్స్ విషయంలో నిబంధనలు కఠినతరం చేశాయి. ఆగస్టు 1 నుంచి తమ విమానాల్లో పవర్ బ్యాంక్స్‌ను వినియోగించేందుకు అనుమతి ఉండదని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఇటీవలే ప్రకటించింది. ప్యాసింజర్‌లు వీటిని తమ వెంట తెచ్చుకునేందుకు ఎప్పటిలాగే అనుమతి ఉన్నప్పటికీ విమానంలో మాత్రం వినియోగించరాదు.
ఇవి కూడా చదవండి:
అప్పటివరకూ భారత్‌తో చర్చలు ఉండవు.. ట్రంప్ మరో సంచలన ప్రకటన
ట్రంప్ ఆర్థిక విధానాలు త్వరలోనే కూలిపోతాయ్.. అమెరికా ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి