Mosquito Drone: దోమ సైజులో డ్రోన్.. చైనా నయా అద్భుతం.. ప్రపంచంలో అతిచిన్న మిలిటరీ వెపన్ ఇదే..
ABN , Publish Date - Jun 24 , 2025 | 02:48 PM
China Mosquito Drone: సాంకేతిక రంగంలో సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికింది చైనా. సైనిక కార్యకలాపాల కోసం దోమను పోలి ఉండే అతి చిన్న డ్రోన్‌ను రూపొందించింది. ఇది సైజులో చిన్నదైనా పనితీరులో మాత్రమే ఘనమేనని అంటున్నారు రక్షణరంగ నిపుణులు. ఈ పవర్‌ఫుల్ మైక్రో మిలిటరీ డ్రోన్ గురించి ప్రత్యేక విశేషాలు..
China's Micro Sized Mosquito Drone: రోజురోజుకీ డ్రోన్ వినియోగం అన్ని రంగాల్లోకి వేగంగా విస్తరిస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, రక్షణ, చిత్రీకరణలు, పర్యావరణ విపత్తుల్లో సాయానికి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా డ్రోన్ కీలక సేవలు అందిస్తోంది. ఇలాంటి సమయంలోనే చైనా సరికొత్త డ్రోన్ ఆవిష్కరించింది. సైనిక కార్యకలాపాల కోసం చిన్న దోమల పరిమాణంలో అతి సూక్ష్మ డ్రోన్‌ను రూపొందించి ప్రపంచ దేశాలను నివ్వెరపరుస్తోంది. ఈ మైక్రో డ్రోన్‌ను సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో ఉన్న నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీకి చెందిన రోబోటిక్స్ లాబొరేటరీ అభివృద్ధి చేసింది.
చైనా ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతికతతో తన రక్షణరంగాన్ని బలోపేతం చేసుకుంటోంది. ఈ దిశగా డ్రాగన్ మరో ముందడుగు వేసింది. తాజాగా చైనా శాస్త్రవేత్తలు ఒక సైనిక డ్రోన్‌ను సృష్టించారు. ఈ డ్రోన్ పరిమాణం, ఆకారం అచ్చం దోమనే పోలి ఉంటాయి. ఇది ఆకారంలో చిన్నదైనా యుద్ధభూమిలో విధ్వంసం సృష్టించగల అద్భుత సత్తా దీనికుంది. మరో ప్రత్యేకత ఏమిటంటే దీనిని నిఘా కోసం మాత్రమే కాదు. ఎన్నో కార్యకలాపాల కోసం ఉపయోగించవచ్చు.
చైనా నయా అద్భుతం..!
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) నివేదిక ప్రకారం, చైనా శాస్త్రవేత్తలు సైనిక కార్యకలాపాల కోసం చాలా సూక్ష్మ ఉండే మస్క్యుటో డ్రోన్‌ను ఆవిష్కరించారు. ఈ మైక్రో డ్రోన్‌ను మధ్య చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో ఉన్న నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ (NUDT) రోబోటిక్స్ లేబొరేటరీ అభివృద్ధి చేసింది. కాంపాక్ట్ డ్రోన్లు అయిన వీటిని సైనిక అవసరాలు, నిఘాతో పాటుగా వివిధ యాప్‌ల కోసమూ వినియోగించవచ్చు.
ఉపయోగాలేంటి?
దోమ ఆకారంలో ఉన్న డ్రోన్‌కు ఇరువైపులా ఆకులాంటి నిర్మాణాలు కలిగిన రెండు చిన్న రెక్కలు ఉన్నాయి. దీనికి మూడు వెంట్రుకలలాంటి సన్నని కాళ్ళు కూడా ఉన్నాయి. సుమారు 1.3 సెంటీమీటర్ల పొడవుండే ఈ డ్రోన్‌ను స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆపరేట్ చెయ్యవచ్చు. ఇంకా, ఇదొక చిన్న బయోనిక్ రోబో అని.. యుద్ధభూమిలో సమాచార నిఘా, ప్రత్యేక కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది' అని NUDT విద్యార్థి లియాంగ్ హెక్సియాంగ్ దీని గురించి వివరించారు.
మైక్రో మస్క్యూటో డ్రోన్‌లు రానున్న రోజుల్లో రహస్య సైనిక కార్యకలాపాల్లో కీలకపాత్ర వహించే అవకాశముంది. దీంతో నిఘా వ్యవస్థల కళ్లు కప్పి ఇది ఎలాంటి సమాచారం సేకరిస్తోందనే ఆందోళన ప్రపంచ దేశాలను కంగారుపెడుతోంది. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా దీన్ని అంత ఈజీగా పసిగట్టలేవు. ఇదిలా ఉంటే, అత్యవసర పరిస్థితుల్లో శిథిలాల మధ్య ప్రాణాలతో బయటపడిన వారిని కూడా ఈ దోమ డ్రోన్లు గుర్తించగలవు. అంతేగాక, వీటి బ్యాటరీ లైఫ్, సెన్సార్ టెక్నాలజీ, AI ఈ మైక్రోడ్రోన్‌ల సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తాయి.
ఇవి కూడా చదవండి:
సింగయ్య మృతి.. రంగంలోకి వైసీపీ నేత
For More International News and Telugu News