Health: క్షతగాత్రుల తరలిస్తున్నారా.. జర పైలం మరి..
ABN , Publish Date - Oct 17 , 2025 | 08:25 AM
రోడ్డు ప్రమాదాల బారినపడి గాయాల పాలవడం, చనిపోవడం వంటి ఘటనలు ఏటేటా పెరుగుతున్నాయి. ప్రమాదమెటువంటిదైనా గాయపడ్డ బాధితులను సకాలంలో తరలించడం, వారికి అందించే చికిత్సలపై అవగాహన కలిగి ఉండడం అవసరం.
ప్రమాదానికి గురరైన వారి తరలింపులో జాగ్రత్తలు అవసరం
నేడు వరల్డ్ ట్రామా డే
హైదరాబాద్ సిటీ: రోడ్డు ప్రమాదాల బారినపడి గాయాల పాలవడం, చనిపోవడం వంటి ఘటనలు ఏటేటా పెరుగుతున్నాయి. ప్రమాదమెటువంటిదైనా గాయపడ్డ బాధితులను సకాలంలో తరలించడం, వారికి అందించే చికిత్సలపై అవగాహన కలిగి ఉండడం అవసరం. శుక్రవారం ప్రపంచ ట్రామా డే(World Trauma Day)ను పురస్కరించుకుని ప్రమాద ఘటనలు, క్షతగాత్రుల తరలింపు, ప్రాణాపాయం నుంచి రక్షించడం వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.
- గ్రేటర్ పరిధిలో ప్రతి ఏటా దాదాపు మూడువేలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 2023-24 కంటే 2024-25లో ప్రమాదాల సంఖ్య దాదాపు 50 శాతానికి పైగా పెరిగిందని వైద్యులు పేర్కొంటున్నారు. ట్రౌమా కేసుల్లో ప్రతి ఏటా దాదాపు రెండు లక్షల మంది భారతీయులు చనిపోతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు.
ఇలా తరలించవద్దు..
ప్రమాదంలో గాయపడి వారిన వెంటనే భుజంపై ఎత్తుకుని హడావుడిగా ఆస్పత్రికి తీసుకుపోతాం. అదేవిధంగా ఇద్దరు ముగ్గురు కలిసి బాధితుని చేతులు, కాళ్లు పట్టుకుని తీసుకుపోతుంటారు. ఇలా తరలించడం వల్ల బాధితుని ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం తరలిస్తే బాధితుని రక్షించడానికి అవకాశముందని పేర్కొంటున్నారు.

ఇలా జాగ్రత్త పడితే..
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి వెంటనే నీళ్లు ఇవ్వరాదు. నీళ్లు ఇస్తే ఊపిరితిత్తులకు ప్రమాదం వాటిల్లే అవకాశముంది. శ్వాస ఆడేలా గాలి తగిలే విధంగా ఉంచాలి. తలకు దెబ్బతగిలిందేమో గమనించాలి. రక్తం కారుతుంటే ఆపడానికి గుడ్డతో కట్టుకట్టాలి. ముక్కు నుంచి నీరు కారుతుందో గమనించాలి. దీని వల్ల బ్యాక్టీరియా వెనకు వెళ్లి మెదడుకు ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదముంది. గుండె పనితీరును గమనించాలి. ఆగినట్లు అనుమానం వస్తే రోగికి పీసీఆర్ చేయాలి. శ్వాస అడే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
స్పృహ తప్పి లేచిన వ్యక్తిని..
స్పృహతప్పి లేచిన వ్యక్తిని తప్పని సరిగ్గా వైద్యుడి వద్దకు తీసుకుపోవాలి. చెవి వెనుక నల్లటి చారలు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. తలనొప్పి ఉన్నా, వాంతులు అవుతున్నా, ఫిట్స్ వచ్చినా వెంటనే ఆస్పత్రికి తీసుకుపోవాలి. ప్రమాదంలో గాయపడిన అడ్డం దిడ్డంగా కదిలించవద్దు. బాధితుడిని తమ చేతులు, భుజాలపై వేసుకుని ఆస్పత్రికి తీసుకురావద్దు. బాధితుడి తలను వెళ్లాడే విధంగా ఉంచవద్దు. ప్రమాదంతో గాయపడిన వారికి ఎముకలు విరిగే అవకాశముంటుంది, కాబట్టి జాగ్రత్తగా, అటుఇటు కదలించకుండా స్ర్టెచర్‌పైకి చేర్చాలి. స్ర్టెచర్‌పై నిటారుగా పడుకోబెట్టి తలను ఎత్తుగా ఉంచి ఆస్పత్రికి తరలించాలి.
గంటలోగా చికిత్స అందిస్తే..
ఏదైనా ప్రమాదం సంభవిస్తే వీలైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లడం చాలా ముఖ్యం. బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి వచ్చినప్పుడు నాలుగున్నర గంటల్లోగా అత్యవసర ఇంజెక్షన్లు చేయించాలి. రోడ్డు ప్రమాద ఘటనల్లో ఈ గోల్డెన్ అవర్ అనేది కేవలం 30- 60 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆలోపు బాధితులను దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లి అత్యవసర వైద్యం అందించాలి. ఈలోపు కూడా ప్రాథమిక చికిత్స చేయాలి. అందుకోసం అంబులెన్సు డ్రైవర్లకు తగిన శిక్షణ ఇవ్వాలి. అవసరమైన పక్షంలో సీపీఆర్ కూడా చేస్తారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాల నుంచి చాలావరకు ప్రాణాలను కాపాడగలం.
- డాక్టర్ వెంకటరమణ, క్రిటికల్ కేర్ మెడిసిన్, కామినేని ఆస్పత్రి
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
Read Latest Telangana News and National News