Telangana Cabinet: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
ABN , Publish Date - Oct 17 , 2025 | 03:10 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోటీకి ఇద్దరు కంటే ఎక్కువ సంతానమున్నవారు అనర్హులన్న నిబంధనను ఎత్తివేసింది...
క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోటీకి ఇద్దరు కంటే ఎక్కువ సంతానమున్నవారు అనర్హులన్న నిబంధనను ఎత్తివేసింది. గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరిగింది. గురువారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ప్రారంభమైన సమావేశం.. నాలుగు గంటలకుపైగా కొనసాగింది. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ బలరాం నాయక్‌తో కలిసి రెవెన్యూ, సమాచార-పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాబినెట్ వివరాలను విలేకరులకు వెల్లడించారు. ‘‘ప్రస్తుతం ఇద్దరికి మించి పిల్లలున్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులనే నిబంధన ఉంది. దీనిని మంత్రి వాకిటి శ్రీహరి మంత్రివర్గ భేటీలో ప్రస్తావించారు. ఈ అంశంపై మంత్రివర్గం పునరాలోచన చేసింది. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్న తరుణంలో ఈ గరిష్ఠ పిల్లల నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పైగా పలు వర్గాల నుంచి సీఎం, మంత్రులకు విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో, ఈ నిబంధనను ఎత్తివేయాలని క్యాబినెట్ నిర్ణయించింది’’ అని వివరించారు.
80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
రాష్ట్రంలో ఈ వానాకాలపు సీజన్‌కు సంబంధించి 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. రైతును రాజును చేయాలన్న ఉద్దేశంతో, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. ‘‘ఈ వానాకాలంలో మొత్తం 1.48 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. దేశంలోనే ఇది రికార్డు స్థాయి ఉత్పత్తి. ఇందులో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌర సరఫరాల విభాగం అంచనా వేసింది. ఇందులో 50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. మరో 15 లక్షల మెట్రిక్ టన్నులను కూడా సేకరించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది’’ అని వివరించారు. ఇక, ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలని, వ్యవసాయ, రెవెన్యూ, పౌర సరఫరాలు, రవాణా శాఖల సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ధాన్యానికి చెల్లించే మద్దతు ధరతోపాటు సన్న వడ్లకు ఇచ్చే రూ.500 బోనస్ కూడా రైతుల ఖాతాల్లో వెంట వెంటనే జమ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని, ప్రతి కొనుగోలు కేంద్రం పర్యవేక్షణ, సమన్వయానికి ఒక్కో అధికారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని మంత్రివర్గం ఆదేశించిందని చెప్పారు.
మెట్రో రైలుపై అధికారుల కమిటీ
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి వివరించారు. మెట్రో పార్ట్-2ఏ, పార్ట్-2బీ విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను.. పీపీపీ మోడల్‌లో నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయమై చర్చించామని, దీని సాధ్యాసాధ్యాలపై లోతుగా అధ్యయనం చేసేందుకు ఉన్నత అధికారుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. సీఎస్ చైర్మన్‌గా ఏర్పాటు చేసే ఈ కమిటీలో ఆర్థిక, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులు, న్యాయ శాఖ కార్యదర్శి, మెట్రో ఎండీ, పట్టణ రవాణా ప్రభుత్వ సలహాదారు సభ్యులుగా ఉంటారన్నారు. అధికారుల కమిటీ తన రిపోర్టును ఆర్థిక వనరుల సమీకరణ క్యాబినెట్ సబ్ కమిటీకి అందిస్తుందని, కమిటీ సిఫారసుల ఆధారంగా మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించిందని చెప్పారు.
మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు ఇవే!
హుజూర్‌నగర్, కొడంగల్, నిజామాబాద్‌లలో 3 వ్యవసాయ కాలేజీలు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి డిసెంబరు 9 నాటికి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబరు 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని నిర్ణయం.
భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులోని ఏన్కూర్ మార్కెట్ యార్డ్‌కు పది ఎకరాల భూమిని కేటాయిస్తూ క్యాబినెట్ తీర్మానం.
నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయానికి మరో 7 ఎకరాల భూమి కేటాయింపు.
నల్సార్ యూనివర్సిటీ అడ్మిషన్లలో ఇప్పుడు తెలంగాణ స్థానికులకు కేటాయించిన 25 శాతం సీట్ల కోటాను 50 శాతానికి పెంచాలని తీర్మానం.
రాష్ట్రంలో హ్యామ్ మోడ్‌లో మొదటి దశలో రూ.10,547 కోట్లతో 5,566 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణ టెండర్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జాతీయ రహదారులు, జిల్లా, మండల కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానమయ్యే రహదారులకు సంబంధించి అభివృద్ధి, విస్తరణ పనులు చేపడతారు. కొన్నిటిని రెండు, మరికొన్నిటిని నాలుగు లేన్లుగా విస్తరిస్తారు. ఈ నిర్ణయంపై సంబంధిత శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రోడ్లు దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తాయంటూ ఈ అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి, సహచర మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్‌అండ్‌బీ సర్కిళ్ల వారీగా మొత్తం 32 ప్యాకేజీల్లో పనులు చేపడతామని, మొదటి దశలో 10 ప్యాకేజీ పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. రాబోయే రెండున్నరేళ్లలో అన్ని రోడ్లు పూర్తి చేస్తామని చెప్పారు.
ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట ఓఆర్‌ఆర్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూములను వినియోగించుకుంటున్నందున... ప్రత్యామ్నాయంగా 435.08 ఎకరాలను ఆ శాఖకు అప్పగిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది.
కృష్ణా-వికారాబాద్ బ్రాడ్ గేజ్ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి 845 హెక్టార్ల భూ సేకరణకు అయ్యే రూ.438 కోట్ల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరించింది.
మన్ననూర్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మొత్తం వ్యయంలో మూడో వంతు నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ తీర్మానం.