Health Tips: శీతాకాలంలో ఇవి తప్పకుండా తీసుకోండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి
ABN , Publish Date - Dec 23 , 2025 | 03:32 PM
తెలుగు రాష్ట్రాల్లో గతంతో పోలిస్తే ఈసారి చలి తీవ్రత చాలా ఎక్కువగానే ఉంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో చాలా మంది ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు..
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో గతంతో పోలిస్తే ఈసారి చలి తీవ్రత చాలా ఎక్కువగానే ఉంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో చాలా మంది ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు.. చలికాలంలో మరింత అనారోగ్యానికి గురవుతున్నారు. ఆరోగ్యవంతులు సైతం.. అధిక చలి కారణంగా జలుబు, దగ్గు వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇలాంటి సమయంలో సరైన పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా సమతుల్య పరిమాణంలో పోషకాహారం తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, శీతాకాలంలో అనారోగ్యానికి గురికాకుండా ఉంటారని చెబుతున్నారు.
గుడ్లు తినాలి..
కోడిగుడ్లలో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. వాటిలో విటమిన్లు ఏ, డీ, బీ12, ఐరన్, జింక్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. శీతాకాలంలో గుడ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన వెచ్చదనం లభిస్తుంది. కండరాలు బలంగా ఉంటాయి. గుడ్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి. శారీరక శక్తి కూడా పెరుగుతుంది. పిల్లలు, వృద్ధులు, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు ఈ సీజన్‌లో గుడ్లు క్రమం తప్పకుండా తింటే మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చెరకు రసం..
శీతాకాలంలో జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. ఈ సీజన్‌లో చాలా మంది అజీర్తి, మలబద్ధకం సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి సమయాల్లో చెరకు సహజ నివారణగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చెరకులో సహజ చక్కెర, ఫైబర్, కాల్షియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. చెరకు తినడం వలన జీర్ణక్రియ మెరుగవుతుంది. శరీరానికి త్వరిత శక్తిని అందిస్తుంది. దీని కారణంగానే శీతాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో చెరకు వినియోగం భారీగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం ప్రకారం.. చెరకు, చెరకు రసం కాలేయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శీతాకాలంలో పరిమిత పరిమాణంలో చెరకు తీసుకోవడం వల్ల శరీరం నుండి టాక్సిన్స్/విష పదార్థాలు/వ్యర్థాలు బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. శరీర బలహీనతను తగ్గిస్తుంది. అయితే, మధుమేహ వ్యాధిగ్రస్తులు చెరకు, చెరకు రసం తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
మొత్తంగా చూసుకుంటే.. శీతాకాలంలో సరైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం వల్ల అనేక వ్యాధుల బారి నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుడ్లు, చెరకు రెండూ అత్యధిక పోషక విలువలు కలిగి ఉన్నాయి. సమతుల్య ఆహారంలో భాగంగా వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే, ఏ ఆహారాన్ని కూడా అతిగా తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ఆరోగ్యానికి అనుగుణంగా ఆహారం తినాలని సూచిస్తున్నారు.
(గమనిక: ఈ వార్త ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న ఆరోగ్య నివేదికలు, సమాచారం ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. చలికాలంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయితే వైద్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించడం ఉత్తమం.)
Also Read:
మూకదాడి ఘటనపై నిరసన.. ఢిల్లీలో బంగ్లా హైకమిషన్ వద్ద ఉద్రిక్తత
డిసెంబర్‌లో సందర్శించాల్సిన అందమైన ప్రదేశాలు ఇవే..
‘చిన్నస్వామి’ నుంచి మ్యాచ్‌లు తరలింపు!