Health Alert: చలి తీవ్రతతో విజృంభిస్తున్న విష జ్వరాలు
ABN , Publish Date - Dec 20 , 2025 | 09:15 AM
వాతావరణంలో మార్పులు, చలి తీవ్రతతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. విష జ్వరాలు విజృంభిస్తుండడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.
బాబోయ్ జ్వరాలు
వణికిస్తున్న చలి
రోగాల బారిన ప్రజలు
కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
ఆలూరు, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): వాతావరణంలో మార్పులు, చలి తీవ్రతతో ప్రజలు జ్వరాల (Seasonal Fevers) బారిన పడుతున్నారు. విష జ్వరాలు విజృంభిస్తుండడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. చలికాలం ప్రభావంతో ఉష్ణోగ్రతల సమతుల్యంలో తేడాలు రావడంతో సాధారణంగా వచ్చే జలుబు, తల నొప్పి, దగ్గు, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలతో కూడిన జ్వరాలు వ్యాపిస్తున్నాయి. దీంతో ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి రోజుకి 250కు పైగా సీజనల్ వ్యాధులతో రోగులు వస్తున్నారు.
డెంగీ లక్షణాలు
డెంగ్యూ జ్వరం సోకినప్పుడు ఆకస్మికంగా అధిక జ్వరం వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, కళ్లు, కండరాలు నొప్పి, అలసట, వికారం, వాంతులు, అతిసారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం వచ్చిన 2 నుంచి 5రోజుల తర్వాత చర్మంపై దద్దుర్లు, కొందరిలో చిగుళ్లు, ముక్కు నుంచి చిన్నపాటి రక్తస్రావం కూడా జరగవచ్చు. డెంగీ జ్వరం ఉన్నవారు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. ద్రవ పదార్థాలు అధికంగా సేవిం చాలి. మూత్ర విసర్జన తగ్గడం, నోరు, పెదవులు పొడిబారడం, నీరసం, చేతులు, కాళ్లు చల్లబడడం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి.
స్క్రబ్ టైఫస్
స్క్రబ్ టైఫస్ అనేది ఒక రకమైన కీటకం కుట్టడంతో జ్వరం వస్తుంది. కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చ లేదా దద్దురు ఏర్పడి, ఆతర్వాత జ్వరం, ఒళ్లు నొప్పులు వస్తుంటే స్క్రబ్ టైఫస్‌గా అనుమానించాలి. చలికాలంలో వాడే దుప్పట్లు, అపరి శుభ్రంగా ఉండే వాటిద్వారా ఈ కీటకాలు ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. సకాలంలో వైద్యం తీసుకుంటే ప్రమాదం ఉండదని, ఐదు నుంచి ఆరు నెలల పాటు ఈకీటకం ద్వారా జ్వరంవచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఈ జ్వరం లక్షణాలలో తీవ్రమైన జ్వరం, నల్లటి మచ్చలతో కూడిన దద్దుర్లు, కండ రాల, తలనొప్పి ఉంటాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కాచి చల్లార్చిన నీటిని, గోరువెచ్చని నీటిని తాగాలి. రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ ఉన్న నీటిని తాగకూడదు. వీలైనంత వరకు బయట ఫుడ్ తినడం మానుకోవాలి. ఎందుకంటే అవి ఆరోగ్య సమస్యలకు దారి తీయొచ్చు. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే పోషకాహారం తీసుకోవడంతో వ్యాధి నిరోధక శక్తి పెరు గుతుంది. దోమలు కుట్టకుండా ఉండేందుకు దోమతెరలు వాడడం మంచిది. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే వెంటనే తొలగించాలి.
రోజుకు 300 మంది రోగులు..
చలి తీవ్రత పెరగడంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఆసుపత్రికి జ్వరాలు, దగ్గు, జలుబులతో రోజుకు 250 నుంచి 300 మంది దాకా రోగులు వస్తున్నారు. అధికంగా చిన్నారులు వ్యాధుల బారిన పడుతున్నారు.
-రామకృష్ణ, వైద్యుడు, ప్రభుత్వాస్పత్రి, ఆలూరు
ఈ వార్తలు కూడా చదవండి..
సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ
పోలీసుల కస్డడీకి కీలక మావోయిస్టులు..
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 20 , 2025 | 08:26 AM