Chandrababu Meet CR Patil: సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ
ABN , Publish Date - Dec 19 , 2025 | 10:26 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో శుక్రవారం పర్యటిస్తున్నారు. పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది.
ఢిల్లీ, డిసెంబరు19 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఢిల్లీలో ఇవాళ(శుక్రవారం) పర్యటిస్తున్నారు. పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో (CR Patil) చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.
ఏపీకి సంబంధించిన పలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించారు. పోలవరం, బనకచర్ల నిర్మాణంతో సహా కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో చర్చించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
ప్రత్యేకించి విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. ఏపీకి నీటి భద్రత అత్యంత కీలక అంశమని... రాష్ట్రంలో సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.
జల్ జీవన్ మిషన్
2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలు కోసం ఏపీకి అదనంగా రూ.1,000 కోట్లు కేటాయించాలని విన్నవించారు.
జల్ జీవన్ మిషన్ కోసం ఏపీ ప్రభుత్వ వాటాగా రూ.524.41 కోట్లు ఖర్చు చేశామని, అలాగే దీనికి సంబంధించిన కేంద్ర వాటా నిధులను కూడా విడుదల చేయాలని సీఎం చంద్రబాబు కోరారు.
PMKSY – RRR పథకం:
ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (PMKSY) – RRR పథకం కింద చెరువులు, కాలువల పునరుద్ధరణకు రాష్ట్రం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని పాటిల్ దృష్టికి సీఎం తీసుకువచ్చారు.
ఈ పథకానికి సంబంధించి కేంద్రం వాటా నిధులు వెంటనే విడుదల చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి సామర్థ్యం గణనీయంగా పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ :
పోలవరం జాతీయ ప్రాజెక్టులో వివిధ పనులకు సంబంధించి పెండింగులో ఉన్న అనుమతులు వెంటనే వచ్చేలా చూడాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు.
రెండో దశ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులపై త్వరలోనే పూర్తి నివేదిక కేంద్రానికి సమర్పిస్తామని చెప్పకొచ్చారు.
వంశధార నది వివాద ట్రిబ్యునల్ (VWDT):
వంశధార నది వివాదానికి సంబంధించి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుల అమలు ఇంకా పూర్తిగా జరగడం లేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం శ్రీకాకుళం జిల్లాలోని కరువు ప్రాంతాల నీటి అవసరాలకు అత్యంత అవసరమని తెలిపారు. దీనికి అనుమతులు మంజూరు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ హక్కులకు భంగం కలగకుండా, ట్రిబ్యునల్ నిర్ణయాల అమలుకు కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై తక్షణమే కేంద్ర జోక్యం చేసుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు.
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు అంశం :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించేలా కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచాలని భావిస్తోందని, దీనికి సంబంధించి భూసేకరణకు కూడా సిద్ధమైందని ప్రస్తావించారు.
అయితే ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున కర్నాటక ప్రభుత్వం ఈ విషయంపై ముందుకు వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం నిలువరించాలని సీఆర్ పాటిల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసిన యువకుడు అరెస్ట్
పోలీసుల కస్డడీకి కీలక మావోయిస్టులు..
Read Latest AP News And Telugu News