Heart Attack Risk: ఉదయం గుండెపోటు ప్రమాదాలు ఎక్కువ..ఎందుకో తెలుసా?
ABN , Publish Date - Aug 24 , 2025 | 10:00 PM
మీరు ఉదయం చేసే పనులు చిన్నవైనా కావచ్చు. కానీ అవి మీ గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఉదయం ప్రారంభించే అలవాట్లు మాత్రమే కాదు, మీ ఆలోచనలూ, కదలికలూ కూడా గుండె విషయంలో కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించింది.
మనం ఉదయం లేవగానే రోజుని ఎలా మొదలు పెడతామో, అది మన గుండె ఆరోగ్యాన్ని అంతగా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సంచలన విషయాలను ప్రకటించింది. దీని ప్రకారం 2022లో దాదాపు 19.8 మిలియన్ల మంది గుండె సంబంధిత వ్యాధుల (Heart Attack Risk) కారణంగా మరణించారు.
ఇది ప్రపంచవ్యాప్తంగా మరణాలలో దాదాపు 32% వాటా. వీటిలో 85% మరణాలు గుండెపోటు, స్ట్రోక్ వల్ల సంభవించాయి. అంటే గుండెకు రక్తం, ఆక్సిజన్‌ను సరఫరా చేసే ధమనిలో అడ్డంకి ఏర్పడినప్పుడు గుండెపోటు వస్తుంది. కానీ, ఈ ప్రమాదం ఉదయం సమయంలో ఎక్కువగా ఉందని తేలింది.
ఉదయం ఎందుకు
దీనికి సంబంధించి ప్రముఖ గుండె వైద్య నిపుణుడు, ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన చెప్పిన ప్రకారం, ఉదయం సమయం మన గుండెకు చాలా సున్నితమైన సమయమన్నారు. ఎందుకంటే, మనం నిద్ర లేవగానే శరీరంలో కొన్ని సహజమైన మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయని చెప్పారు.
ఉదయం లేవగానే, శరీరంలో కార్టిసాల్ (స్ట్రెస్ హార్మోన్) స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. రక్తంలోని ప్లేట్‌లెట్స్ (రక్తం గడ్డకట్టే కణాలు) జిగురుగా మారతాయి. రక్తపోటు కూడా పెరుగుతుంది. ఈ మూడు అంశాలు ఉదయం సమయంలో ఆకస్మిక గుండె వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయన్నారు.
ఉదయం 7 నుంచి 11 గంటల మధ్య
ఓ ప్రముఖ అధ్యయనం ప్రకారం, గుండెపోటు, ఆకస్మిక గుండె ఆగిపోయే సంఘటనలు ఉదయం 7 నుంచి 11 గంటల మధ్య ఎక్కువగా సంభవిస్తాయి. అలాగే, సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య కూడా కొంత ప్రమాదం ఉంటుంది. కానీ ఉదయం సమయం ఎక్కువ ప్రమాదకరం. ఎందుకంటే, మనం నిద్ర లేవగానే శరీరం ఒక్కసారిగా చురుకుగా మారుతుంది. ఒక్కసారిగా శారీరక లేదా మానసిక ఒత్తిడి పెరిగితే, గుండెపై భారం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఇలా చేయడం వల్ల..
మార్నింగ్ లేవగానే కాఫీ తాగడం, నీళ్లు తాగకుండా ఉండటం, మందులు సకాలంలో వేసుకోక పోవడం లేదా పనిలో నిమగ్నం కావడం వంటివి కూడా గుండెపై ఒత్తిడిని పెంచుతాయన్నారు. లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇది రక్తప్రవాహాన్ని సాఫీగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం మానేసి, ప్రోటీన్ ఎక్కువగా ఉండే గుడ్డు, పప్పు గింజలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. చాలామంది గుండెపోటు ఒత్తిడి వల్లే వస్తుందని అనుకుంటారు. కానీ, ఒత్తిడి ఒక కారణం అయినప్పటికీ, ఉదయం మనం ఎలా రోజుని మొదలు పెడతామనే దానిపై గుండె ఆరోగ్యం ఎక్కువగా ఆధారపడుతుందన్నారు నిపుణులు.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి