Share News

Junnu: గర్భిణులకు జున్ను మంచిదేనా..?

ABN , Publish Date - Nov 04 , 2025 | 10:53 AM

జున్ను అధిక పోషక విలువలను కలిగి ఉంటుంది. ఇది గర్భిణీకి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఇమ్యునోగ్లోబులిన్ అధికంగా ఉంటుంది.

Junnu: గర్భిణులకు జున్ను మంచిదేనా..?

ఇంటర్నెట్ డెస్క్: జున్ను అనేది మనం బాగా ప్రాధాన్యం ఇచ్చే ఓ పాల పదార్థం. ఇది పాలు గడ్డకట్టడం ద్వారా తయారయ్యే ఒక పాల ఉత్పత్తి. ఇది ఎముకల బలం కోసం కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. జున్ను రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఆవు లేదా గేదె దూడను కన్న కొద్ది రోజుల తర్వాత ఇచ్చే పాలను ఉపయోగించి జున్ను తయారు చేస్తారు. దీనికి ప్రత్యేకమైన రుచి, సువాసన ఉంటుంది. అయితే ఈ జున్నును గర్భిణులు తీసుకోవడంపై చాలామందికి సందేహాలు ఉంటాయి. నిజానికి, జున్ను పోషకాల నిధి అయినప్పటికీ, కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు.


జున్నుతో లాభాలు..

జున్ను అధిక పోషక విలువలను కలిగి ఉంటుంది. ఇది గర్భిణీకి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఇమ్యునోగ్లోబులిన్ అధికంగా ఉంటుంది. ప్రోటీన్లు, విటమిన్లు A, E, మినరల్స్ పుష్కలంగా ఉండటం వలన తల్లికి, గర్భంలోని శిశువు ఎదుగుదలకు కావాల్సిన అదనపు పోషక మద్దతు లభిస్తుంది. దానితో పాటు తల్లి శరీరంలో రోగనిరోధక శక్తిని అపారంగా పెంచి, అంటువ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


నష్టాలు..

జున్ను వల్ల నష్టాలు అంతగా లేనప్పటికీ సరిగా తీసుకోకపోతే ప్రమాదం పొంచి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జున్ను పాలను సరిగా ఉడికించకుండా తీసుకుంటే, అందులో లిస్టేరియా లేదా ఇతర హానికరమైన బ్యాక్టీరియాలు ఉండే అవకాశం ఉంది. గర్భిణీ సమయంలో ఇవి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ఇది చిక్కగా, కొవ్వు ఎక్కువగా ఉండటం వలన అతిగా తీసుకుంటే కొందరికి అజీర్తి, కడుపు ఉబ్బరం లేదా వికారం కలగవచ్చు. అందుకోసమే.. గర్భిణులు జున్నును మితంగా తీసుకుంటే అది వారి ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.


ఇవి కూడా చదవండి:

Electricity Department: అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్‌స్టేషన్లు

AP Assembly House Committee: వైసీపీ హయాంలో అవినీతిపై 17లోగా నివేదిక

Updated Date - Nov 04 , 2025 | 11:07 AM