Bihar Elections VVPAT Slips: రోడ్లపై వీవీప్యాట్ స్లిప్పులు.. ఇద్దరు అధికారుల సస్పెండ్
ABN , Publish Date - Nov 08 , 2025 | 08:06 PM
సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధి డిస్పాచ్ సెంటర్ సమీపంలో కొన్ని వీవీప్యాట్ స్లిప్పులు కనిపించాయని, అధికారులతో కలిసి తాము అక్కడికి వెళ్లామని డీఎం కుష్వాహ తెలిపారు. అభ్యర్థుల సమక్షంలో ఆ స్లిప్పులను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
సమస్తీపూర్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) తొలి విడత పోలింగ్ పూర్తయిన క్రమంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సమస్తిపూర్ (samastipur) జిల్లాలోని కేఎస్ఆర్ కాలేజీ సమీప రోడ్డుపై పెద్ద సంఖ్యలో వీవీప్యాట్ (VVPAT) స్లిప్‌లు కనిపించడం రాజకీయ దుమారం రేపింది. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల పారదర్శకతపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ఎన్నికల కమిషన్ తక్షణ చర్యలకు దిగింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది. వీవీప్యాట్ స్లిప్పులు డంపింగ్ చేసినట్టు పలు వీడియోలు సోషల్ మీడియాలో రావడం సంచలనమైంది.
సీఈసీ స్పందన
దీనిపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ స్పందించారు. అవి మాక్ పోలింగ్‌కు సంబంధించిన స్లిప్పులు అని వివరణ ఇచ్చారు. వాస్తవ ఓటింగ్ ప్రక్రియపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. ఈ ఘటనపై తక్షణ విచారణకు డీఎంను ఆదేశించామని తెలిపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌కు అటాచ్ చేసి ఉండే వీవీప్యాట్‌ల ద్వారా ఓటర్లు తమ ఓట్లు కరెక్టుగా రికార్డయిందా లేదా తెలుసుకునే వీలుంటుంది.
డీఎం ఏమన్నారంటే..
సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని డిస్పాచ్ సెంటర్ సమీపంలో కొన్ని వీవీప్యాట్ స్లిప్పులు కనిపించాయని, అధికారులతో కలిసి తాము అక్కడికి వెళ్లామని డీఎం కుష్వాహ తెలిపారు. అభ్యర్థుల సమక్షంలో ఆ స్లిప్పులను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని, డిపార్ట్‌మెంట్ ఎంక్వయిరీకి సిఫారసు చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశామని చెప్పారు.
ఆర్జేడీ, కాంగ్రెస్ తీవ్ర ఆక్షేపణ
రోడ్డుపై వీవీప్యాట్ స్లిప్పులు కనిపించడంతో ఎన్నికల ప్రక్రియపై ఆర్జేడీ, కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించాయి. ప్రజాస్వామ్య దోపిడీదారులు ఈ చర్యలకు పాల్పడినట్టు ఆర్జేడీ ఆరోపించింది. ఈ స్లిప్పులు ఎవరు, ఎప్పుడు, ఎవరి ఆదేశాలతో పడేశారని ప్రశ్నించింది. ఈవీఎంలు ఉంచే స్ట్రాంగ్ రూమ్‌లకు భద్రత పెంచాలని డిమాండ్ చేసింది.
ఇవి కూడా చదవండి
డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
వారణాసిలో మోదీ పర్యటన.. నాలుగు వందేభారత్ రైళ్లు ప్రారంభం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి