Parliament Winter Session: డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
ABN , Publish Date - Nov 08 , 2025 | 01:33 PM
భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణ తేదీలు వెల్లడయ్యాయి. డిసెంబర్ 1 నుంచి 19 వరకు సమావేశాలు జరుగుతాయని సంబంధిత శాఖా మంత్రి కిరణ్ రిజిజూ తెలిపారు.
న్యూఢిల్లీ, నవంబర్ 8: భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం 19 రోజులు సమావేశాలు కొనసాగుతాయి. ఈ తేదీలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజూ ఇవాళ (శనివారం) అధికారికంగా ప్రకటించారు.
ప్రభుత్వ సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సమావేశాలకు ఆమోదం తెలిపారని కేంద్రమంత్రి తెలిపారు. దీనికి సంబంధించి రిజిజూ తన X ఖాతాలో వెల్లడించారు. మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగే నిర్మాణాత్మక, అర్థవంతమైన సమావేశాల కోసం తాను ఎదురుచూస్తున్నానని మంత్రి అన్నారు.
ఈ సమావేశంలో కీలక బిల్లులు, ఆర్థికాంశాలపై చర్చలు, ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. ప్రతిపక్షాలు అనేక అంశాలపై కేంద్రానికి లోతైన ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. గత సమావేశాల్లో లాగానే ఈసారీ రాజకీయ వేడి రగిలే అవకాశం ఉంది.
ఈ శీతాకాల సమావేశాలు 18వ లోక్‌సభకు మరింత కీలకమని, ప్రజా సమస్యలు, దేశ అభివృద్ధి అంశాలపై చర్చ జరిగి, కొత్త చట్టాలు రూపొందే అవకాశం ఉందని రిజిజూ చెప్పారు. పార్లమెంట్ సమావేశాలు సఫలం కావాలని, ప్రజలకు మేలు చేకూర్చాలని ఆశిస్తున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఏపీలో పెళ్లి కారు బీభత్సం.. ముగ్గురు స్పాట్‌డెడ్
ఇంట్లో ఎవరూ లేని సమయంలో వివాహిత ఎంత పని చేసిందంటే..
Read Latest AP News And Telugu News