PM Modi: వారణాసిలో మోదీ పర్యటన.. నాలుగు వందేభారత్ రైళ్లు ప్రారంభం
ABN , Publish Date - Nov 08 , 2025 | 09:41 AM
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వందేభారత్ రైళ్లను ఆయన ప్రారంభించారు. ఈ రైళ్లతో కలిపి దేశంలో వందేభారత్ రైళ్ల సంఖ్య 160పైగా చేరింది.
ఉత్తరప్రదేశ్: మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వారణాసిలో ప్రధాని పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా బనారస్-ఖజురహో, లఖ్‌నవూ-సహరన్‌పుర్, ఫిరోజ్‌పుర్-ఢిల్లీ, ఎర్నాకుళం-బెంగళూరు మార్గాల్లో వందే భారత్ రైళ్లను ఆయన ప్రారంభించారు. ఈ నాలుగింటితో కలిపి దేశంలో 160కిపైగా వందే భారత్ రైళ్లు సేవలందిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. వందే భారత్, నమో భారత్ అనేవి భారత రైల్వేకి కొత్త తరమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
రైళ్లు ప్రయాణించే వివరాలు..
బనారస్-ఖజురహో వందే భారత్ రైలు వారణాసి, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్ వంటి ఆధ్యాత్మిక కేంద్రాల మీదుగా ఖజురహోకు చేరుకుంటుంది. దీని ద్వారా దాదాపు 2 గంటల 30 నిమిషాల ప్రయాణ సమయం ఆదా కానుంది. లఖ్‌నవూ-సహరన్‌పుర్ వందే భారత్ రైలు సీతాపూర్, షాజహాన్‌పూర్, బరేలీ, మొరాదాబాద్, బిజ్నోర్ మీదుగా సహారన్‌పుర్ చేరుకుంటుంది. దాదాపు 7 గంటల 45 నిమిషాల్లో ప్రయాణం పూర్తి చేస్తుంది. దీంతో దాదాపు గంటపాటు సమయం ఆదా అవుతుంది.
ఫిరోజ్‌పూర్-ఢిల్లీ వందేభారత్ రైలు కేవలం 6 గంటల 40 నిమిషాల్లో ఢిల్లీ చేరుకోనుంది. ఎర్నాకుళం-బెంగళూరు వందేభారత్ రైలు 8 గంటల 40 నిమిషాల్లో ప్రయాణం పూర్తి చేస్తుంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య సేవలందించనుంది. ఈ రైళ్లు ఆయా నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు పర్యాటకం, వాణిజ్యాన్ని పెంచనున్నాయి.
ఇవి కూడా చదవండి:
షుగర్ వ్యాధి ఉంటే ఇక వీసా రానట్టే.. అమెరికా నిబంధనలు మరింత కఠినతరం
హెబ్-1బీ వీసా.. లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తుల పరిశీలన ప్రారంభం