Share News

Bihar Polls: ముగిసిన తొలి విడత ఎన్నికల ప్రచారం

ABN , Publish Date - Nov 04 , 2025 | 09:10 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు 'నమో యాప్' ద్వారా పార్టీ మహిళా కార్యకర్తలతో మాట్లాడారు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో దగ్గరుండి తాను చూశానని, భారీ మెజారిటీతో ఎన్డీయే గెలుస్తుందని తాను చెప్పగలనని అన్నారు.

Bihar Polls: ముగిసిన తొలి విడత ఎన్నికల ప్రచారం
Bihar election campaing

పాట్నా: బిహార్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడింది. బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్), ఆర్జేడీ, కాంగ్రెస్, జన్ సురాజ్, ఇతర పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల ప్రచారం చివరి రోజు సుడిగాలి పర్యటనలు సాగిస్తూ పోటీపోటీ ర్యాలీలు నిర్వహించారు. 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో నవంబర్ 6 తొలి విడత పోలింగ్ జరుగనుంది. రెండో విడత పోలింగ్ నవంబర్ 11న జరుగుతుంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.


రికార్డు గెలుపు ఖాయం: మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు 'నమో యాప్' ద్వారా పార్టీ మహిళా కార్యకర్తలతో మాట్లాడారు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో దగ్గరుండి తాను చూశానని, భారీ మెజారిటీతో ఎన్డీయే గెలుస్తుందని తాను చెప్పగలనని అన్నారు. 20 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసేందుకు ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. 'జంగిల్ రాజ్' టీమ్ ఘోరంగా ఓడిపోతుందని, ఎన్డీయే హయాంలోనే బిహార్ అభివృద్ధి సాధ్యమని అన్నారు. మహిళలు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు.


అమిత్‌షా, రాహుల్ పోటాపోటీ

తొలి విడత ప్రచారం చివరిరోజున కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దర్బంగాలో ప్రచారం చేశారు. మోతిహారి, బేతియాలో రోడ్ షోలు నిర్వహించారు. లాలూ, రబ్రీ హయాంలో జంగిల్ రాజ్‌ను చూసిన ప్రజలు తిరిగి వారికి అవకాశం ఇవ్వకూడదన్నారు. బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఆర్జేడీ నేత, మహాగఠ్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ఎన్నికల్లో నితీష్ ప్రభుత్వాన్ని మట్టికరిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 'మై-బిహిన్ మాన్ యోజన' ద్వారా జనవరి 14న సంక్రాంతి రోజున రాష్ట్రంలోని మహిళలకు ఏడాదికి రూ.30 వేలు కానుకగా అందజేస్తామని వెల్లడించారు. కనీస మద్దతు ధరతో పాటు బోనస్‌గా రేతులు క్వింటాలు వరికి రూ.300, గోధువులకు రూ.400 చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు.


రాహుల్, ప్రశాంత్ కిషోర్, నితీష్ సైతం..

జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సైతం సందేశ్, ఆరా, షాపూర్ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. రాష్ట్ర పాలనా వ్యవస్థను మార్చే కొత్త ఆప్షన్‌గా తమ పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఔరంగాబాద్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. మహాగఠ్‌బంధన్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నితీష్ కేవలం ప్రభుత్వానికి మాస్క్ అని, ఢిల్లీ నుంచి మోదీ, అమిత్‌షానే బిహార్‌ను నడిపిస్తున్నారని చెప్పారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే నలందా యూనివర్శిటీ తరహాలోనే బిహార్‌ను కూడా వరల్డ్ బెస్ట్ యూనివర్శిటీలలో ఒకటిగా చేస్తామని, ప్రపంచ దేశాల నుంచి ఇక్కడకు చదువుకునేందుకు వస్తారని అన్నారు. కాగా, ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ఖగరియా, బెగుసరాయ్, పాట్నా జిల్లాల్లో నితీష్ కుమార్ ప్రచారం సాగించారు.


ఇవి కూడా చదవండి..

ఎస్ఐఆర్ పేరుతో నిశ్శబ్ద రిగ్గింగ్.. మమత నిరసన ర్యాలీ

రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 04 , 2025 | 09:13 PM