Share News

Mallikarjun Kharge: ఎన్డీయే గెలిచినా నితీష్‌కు సీఎం పదవి హుళక్కే.. బీజేపీపై ఖర్గే విమర్శలు

ABN , Publish Date - Nov 03 , 2025 | 06:52 PM

సోషలిస్టు అగ్రనేతలైన జయప్రకాశ్ నారాయణ్, రామ్‌మనోహర్ లోహియా, కర్పూరి ఠాకూర్ సిద్ధాంతాలకు నీతీష్ కుమార్ తూట్లు పొడిచారని ఖర్గే విమర్శించారు. మను స్మృతిని నమ్మే మహిళా వ్యతిరేకి బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించారు.

Mallikarjun Kharge: ఎన్డీయే గెలిచినా నితీష్‌కు సీఎం పదవి హుళక్కే.. బీజేపీపై ఖర్గే విమర్శలు
Mallikarjun Kharge

రాజాపాకార్: బిహార్‌లో ఎన్డీయే (NDA) గెలిచినా నితీష్ కుమార్ (Nitish Kumar) ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తి లేదని, ఆయనను పక్కకు పెట్టి సొంత పార్టీ నేతకే ఆ పదవిని బీజేపీ కట్టబెడుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తొలిసారి వైశాలి జిల్లా రాజాపాకార్‌లో సోమవారంనాడు జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు.


సోషలిస్టు అగ్రనేతలైన జయప్రకాశ్ నారాయణ్, రామ్‌మనోహర్ లోహియా, కర్పూరి ఠాకూర్ సిద్ధాంతాలకు నీతీష్ కుమార్ తూట్లు పొడిచారని ఖర్గే విమర్శించారు. మను స్మృతిని నమ్మే మహిళా వ్యతిరేకి బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించారు. నితీష్ ఎంతమాత్రం దళితులు, ఓబీసీ, ఈబీసీల ఛాంపియన్ కాదని అన్నారు. నితీష్‌కు ఒక విషయం తెలియడం లేదని, నితీష్‌ను మళ్లీ సీఎం చేయాలని బీజేపీ అనుకోవడం లేదని, ఆయనకు బదులు సొంత పార్టీ విధేయుల్లో ఒకరికి సీఎం పదవి కట్టబెడుతుందని చెప్పారు.


ఎన్నికలప్పుడే కనిపిస్తారు

ప్రధానమంత్రి ప్రపంచాన్ని చుట్టేసేందుకు సమయం ఉంటుందని కానీ, దేశంలో ఏ జరుగుతోందో తెలుకునే సమయం ఉండదని, ఎన్నికల సమయంలోనే ఆయన కనిపిస్తారని ఖర్గే అన్నారు. మున్సిపల్ ఎన్నికలు వచ్చినా రోడ్లపై మోదీ తిరుగుతూ కనిపిస్తారని, తన కొడుకు పెళ్లి అన్నట్టుగా బిహార్ ఎన్నికల్లో ఆయన బిజీబిజీగా ఉన్నారని ఎద్దేవా చేసారు. మోదీ గుజరాత్‌కు 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 12 ఏళ్లుగా ప్రధానిగా ఉన్నప్పటికీ బిహార్‌కు కానీ, దేశానికి కానీ చేసిన అభివృద్ధి ఏమీలేదన్నారు. నితీష్ సీఎంగా రాష్ట్రాన్ని 20 ఏళ్లుగా పాలిస్తున్నా ఉద్యోగాలు ఇవ్వలేకపోయారని, వలసలను ఆపలేకపోయారని విమర్శించారు. బిహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వం రూ.70,000 కోట్ల మేర కుంభకోణాలకు పాల్పడిందని, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్టు కూడా దీనిని ధ్రువీకరించిందని చెప్పారు.


కేంద్రంలోని ప్రభుత్వ శాఖల్లో 50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిపై మోదీకి ఎలాంటి ఖాతరు లేదని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీపై జనం ఆయనను ప్రశ్నించాలని అన్నారు.


ఇవి కూడా చదవండి..

అడగడానికి ఇంకేమీ ప్రశ్నలు లేవా... నాయకత్వ మార్పుపై సిద్ధరామయ్య

ఉద్యోగమిప్పించమని వచ్చి.. ఎమ్మెల్యేని కుళ్లబొడిచేశాడు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 03 , 2025 | 06:59 PM