PM Modi: మీ పిల్లలు డాక్టర్లు కావాలా.. దోపిడీదారులు కావాలా
ABN , Publish Date - Nov 08 , 2025 | 03:08 PM
జంగిల్ రాజ్ అంటే తుపాకులు, క్రూరత్వం, సామాజిక వ్యతిరేకత, అవినీతి అని మోదీ అభివర్ణించారు. హింసను ప్రోత్సహించే ప్రభుత్వం మనకు అవసరం లేదని, ఎన్డీయే ప్రభుత్వానికి తిరిగి పట్టం కడదామని పిలుపునిచ్చారు.
సీతామర్హి: బిహార్ రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీతామర్హి (Sitamarhi)లో శనివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొన్నారు. తొలి విడత పోలింగ్‌లో ఓటర్లు రికార్డు స్థాయిలో పాల్గొనడం ద్వారా జంగిల్ రాజ్‌కు '65 ఓల్టుల షాక్' ఇచ్చారని ప్రధాని ప్రశంసించారు. ఆర్జేడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. యువకులను విద్యావంతులను చేయాలని ఎన్డీయే కోరుకుంటుంటే, ఇందుకు భిన్నంగా లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ యువకులకు తుపాకులు ఇస్తోందని అన్నారు. మీ పిల్లలు డాక్టర్లు కావాలా? దోపిడీదారులు కావాలా? అని బహిరంగ సభకు హాజరైన ప్రజానీకాన్ని ఆయన ప్రశ్నించారు.
'పిల్లల మనసుల్లో ఆర్జేడీ విషం నింపుతోంది. వారిని దోపిడీదారులుగా మార్చాలనుకుంటోంది. ఆర్జేడీ ఎన్నికల ప్రచారం చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. జంగిల్ రాజ్‌ల పాటలు, నినాదాలు వినండి. మీరు షాక్ అవుతారు. ఆర్జేడీ వేదికలపై పిల్లల్ని దోపిడీదారులుగా మారాలనుకుంటున్నట్టు చెప్పిస్తున్నారు. బిహార్ పిల్లలు దోపిడీదారులు కావాలా, డాక్టర్లు కావాలా?' అని మోదీ ప్రశ్నించారు. జంగిల్ రాజ్ అంటే తుపాకులు, క్రూరత్వం, సామాజిక వ్యతిరేకత, అవినీతి అని అభివర్ణించారు. హింసను ప్రోత్సహించే ప్రభుత్వం మనకు అవసరం లేదని, ఎన్డీయే ప్రభుత్వానికి తిరిగి పట్టం కడదామని పిలుపునిచ్చారు.
బిహార్ పిల్లలకు ఇప్పుడు స్టార్టప్స్ డ్రీమ్స్ అవసరమని, హ్యాండప్స్ లీడర్లు అవసరం లేదని ప్రధాని అన్నారు. తాము పిల్లలకు పుస్తకాలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఇస్తుంటే, ఆర్జేడీ నేతలు యువతకు తుపాకులు ఇవ్వడం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. వారు తమ పిల్లలు మంత్రులు కావాలనుకుంటూ ఇతరుల పిల్లలను మాత్రం దోపిడీదారులను చేయాలనుకుంటున్నారని అన్నారు. బిహార్ యువత అభివృద్ధిని కోరుకుంటోందని, వారు ఎన్డీయేను ఎంచుకుంటే బిహార్ అభివృద్ధి తధ్యమని చెప్పారు. రాష్ట్రాభివృద్ధే ఈ ఎన్నికల ఎజెండా అని తెలిపారు. ఇవి పిల్లల భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలని, తుపాకులు ఝలిపించే ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అవసరం లేదని అన్నారు. కాగా, బిహార్ రెండో దశ పోలింగ్ 122 నియోజకవర్గాల్లో ఈనెల 11న జరుగనుంది. దీంతో రెండు విడతల పోలింగ్ ముగుస్తుంది. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
ప్రజాస్వామ్యాన్ని చంపే యత్నమే ‘సర్’...
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి