Share News

Bihar Assembly Elections: తొలి విడత పోలింగ్‌కు కౌంట్‌డౌన్.. అందరి కళ్లూ వారిపైనే

ABN , Publish Date - Nov 05 , 2025 | 08:52 PM

తొలి విడత పోలింగ్ జరుగనున్న నియోజకవర్గాల్లో అందరి దృష్టి ప్రధానంగా వైశాలి జిల్లాలోని రఘోపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంపై ఉంది. ఇక్కడి నుంచి ఆర్జేడీ నుంచి 'మహాగఠ్‌బంధన్' ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్నారు.

Bihar Assembly Elections: తొలి విడత పోలింగ్‌కు కౌంట్‌డౌన్.. అందరి కళ్లూ వారిపైనే
Bihar elections

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly polls) సమరం కీలక ఘట్టానికి చేరుకుంది. రెండు విడతల పోలింగ్‌లో భాగంగా తొలి విడత పోలింగ్ 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో గురువారం జరుగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలతో ముగుస్తుంది. కొన్ని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ముందస్తు జాగ్రత్తగా సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగుస్తుంది.


tejashwi.jpg

రఘోపూర్‌పైనే అందరి దృష్టి

తొలి విడత పోలింగ్ జరుగనున్న నియోజకవర్గాల్లో అందరి దృష్టి ప్రధానంగా వైశాలి జిల్లాలోని రఘోపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంపై ఉంది. ఇక్కడి నుంచి ఆర్జేడీ నుంచి 'మహాగఠ్‌బంధన్' ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్నారు. రెండు సార్లు వరుసగా రఘోపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఆయన హ్యాట్రిక్ విజయం కోసం బరిలో ఉన్నారు. గతంలో ఆ నియోజకర్గానికి తేజస్వి తండ్రి లూలూప్రసాద్ యాదవ్ రెండుసార్లు, తల్లి రబ్రీదేవి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఇద్దరూ రఘోపూర్ నుంచి గెలిచే ముఖ్యమంత్రులయ్యారు.


tej-pratap.jpg

ఆసక్తి కలిగిస్తున్న మహువా

మహూవా నియోజకవర్గం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కొత్తగా ఏర్పాటు చేసిన 'జన్‌శక్తి జనతా దళ్' నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్ బహిష్కరణకు గురయ్యారు.


మొకామా, తారాపూర్‌‌‌లోనూ..

ఇటీవల జన్‌సురాజ్ కార్యకర్త దులార్ చంద్ యాదవ్ హత్యకు గురైన మొకామా నియోజకవర్గంలోనూ ఓటర్లు ఎవరికి పట్టం కడతారనే ఆసక్తి నెలకొంది. ఈ హత్య కేసులో అరెస్టయిన అనంత్ సింగ్ మొకామా నుంచి జేడీయూ టిక్కెట్‌పై పోటీలో ఉన్నారు. ఆయన తరఫున కేంద్ర మంత్రి లలన్ సింగ్ ప్రచారం చేశారు. కాగా, గురువారంనాడు పోలింగ్ జరుగనున్న తారాపూర్ నియోజకవర్గంపైనా ఆసక్తి నెలకొంది. ఇక్కడి నుంచి ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి పోటీలో ఉన్నారు.


polling.jpg

ఎన్నికల బరిలో 1,314 మంది అభ్యర్థులు

గురువారంనాడు పోలింగ్ జరుగనున్న తొలి విడత ఎన్నికల్లో 1,314 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. 3.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 50,000కు పైగా పోలింగ్ స్టేషన్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మహిళల కోసం 1,000కు పైగా ప్రత్యేక బూత్‌లు ఏర్పాటు చేసింది. ఓటర్ ఐడీ కార్డు (ఈపీఐసీ) లేకపోతే ఆధార్, పాన్, పెన్షన్ కార్డు, డ్రైవర్ లైసెన్స్ వంటి 11 పత్రాలు ఉపయోగించుకునే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. భద్రత కోసం పోలీసులు, కేంద్ర బలగాలతో కలిపి 50,000 వేల మందిని మోహరించింది. డ్రోన్లు, సీసీటీవీల పర్యవేక్షణలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి.


ప్రచారంలో ఎవరెవరు ఎన్నిసార్లు?

అసెంబ్లీ ఎన్నికల పోరు ప్రధానంగా ఎన్డీయే, ఇండియా కూటమి మధ్యనే ఉంటుందనే అంచనా ఉండగా, ప్రశాంత్ కిషోర్ జన్‌సురాజ్ పార్టీ కూడా అన్ని స్థానాల్లోనూ పోటీకి దిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 8 సభల్లో పాల్గొనగా, రాహుల్ 14 సభల్లో, నితీష్ 41 సభల్లో, తేజస్వి అత్యధికంగా 96 సభల్లో పాల్గొన్నారు. కాగా, రెండో విడత పోలింగ్ 122 నియోజకవర్గాల్లో నవంబర్ 11న జరుగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. 25 లక్షల దొంగ ఓట్లంటూ..

ఎస్ఐఆర్‌ను మీరు సపోర్ట్ చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా.. రాహుల్ ఆరోపణలపై ఈసీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 05 , 2025 | 09:05 PM