Share News

Colleges: అడ్మిషన్‌ ఇక్కడ.. అటెండెన్స్‌ మరోచోట

ABN , Publish Date - May 02 , 2025 | 01:10 PM

నగరంలోని ఆయా ప్రాంతాల్లో ప్రైవేటు కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అలాగే.. అడ్మిషన్ల కోసం పెద్దఎత్తున ప్రచారాలు నిర్వహిస్తూ.. కొన్ని ఏరియాల్లో ఏకంగా ఏజెంట్లను సైతం నియమించుకుంటున్నారు. ఆకర్షణీయమైన బ్రోచర్లను ముద్రించి ప్రచారాలు నిర్వహిస్తున్నారు.

Colleges: అడ్మిషన్‌ ఇక్కడ.. అటెండెన్స్‌ మరోచోట

- స్పెషల్‌ డిస్కౌంట్‌తో ప్రైవేట్‌ ఇంటర్‌ కాలేజీల ప్రచారం

- తమ వద్ద చేర్పించుకుని మరోచోట నుంచి నామినల్‌ రోల్స్‌

- విద్యార్థులను మోసం చేస్తున్న పలు యాజమాన్యాలు

- ఏటా ఇదే తంతు..

- పట్టించుకోని అధికారులు

- అన్నీ తెలుసుకోవాలంటున్న విద్యార్థి సంఘాలు

హైదరాబాద్‌ సిటీ: పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కావడంతో గ్రేటర్‌లో ప్రైవేట్‌ ఇంటర్‌ కాలేజీల్లో అడ్మిషన్లు జోరందుకున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని యాజమాన్యాలు షెడ్యూల్‌ రాకముందే విద్యార్థులను చేర్చుకుంటున్నపపటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రధానంగా అనుమతి లేని కళాశాలలు డిస్కౌంట్‌ పేరుతో విద్యార్థులను మోసగిస్తూ అందినకాడికి దోచుకుంటున్నప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Buses: లింగంపల్లి నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బస్సులు


హైదరాబాద్‌(Hyderabad) జిల్లాలో 285, రంగారెడ్డి జిల్లాలో 180, మేడ్చల్‌లో 126 ప్రైవేట్‌ విద్యాసంస్థలు నడుస్తున్నాయి. మూడు జిల్లాల్లో కలిపి పేరొందిన రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీలు 320 వరకు ఉన్నాయి. మొత్తం 591 ప్రైవేట్‌ కాలేజీల్లో 350 అనధికారికంగానే కొనసాగుతున్నాయి. అపార్ట్‌మెంట్లు, రోడ్డు పక్కన కాంప్లెక్స్‌ల్లో చిన్నపాటి గదులను అద్దెకు తీసుకుని తరగతులను నిర్వహిస్తున్నా.. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకున్నా.. అడిగే వారు లేరు.


పుట్టగొడుగుల్లా..

గ్రేటర్‌లో ఏటా ఇంటర్మీడియట్‌ కాలేజీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. పది మంది లెక్చరర్లు కలిసి చిన్నపాటి గదులను కిరాయుకి తీసుకుని తరగతులను ప్రారంభిస్తున్నారు. తమ వద్ద నాణ్యమైన విద్యనందిస్తామని అడ్మిషన్ల సమయంలో ఫ్లెక్సీలు, కరపత్రాలతో పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. పేరొందిన కాలేజీల కంటే తాము 30-40 శాతం వరకు తక్కువ ఫీజుతో బోధన అందిస్తామని, ఐఐటీ, జేఈఈ, నీట్‌ క్లాసులను ప్రత్యేకంగా నిర్వహిస్తామని తల్లిదండ్రులను నమ్మిస్తున్నారు. ఆ కాలేజీల్లో చేరుతున్న విద్యార్థుల నామినల్‌ రోల్స్‌ను ఇతర కళాశాలల ద్వారా ఇంటర్‌బోర్డుకు పంపించడం, పాసైన తర్వాత టీసీలు, బోనఫైడ్‌ సర్టిఫికెట్లను అక్కడి నుంచి ఇప్పిస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తక్కువ ఫీజు అని చెబితే చేర్పించిన పాపానికి పిల్లలను మోసం చేస్తున్నారని, పరీక్షల్లో ఆశించిన మార్కులు కూడా రావడంలేదని వారు వాపోతున్నారు.


అనుమతి లేని కాలేజీలను మూసివేయాలి

విద్యార్థి జీవితంలో ఇంటరీడ్మియట్‌ విద్య కీలకమని, అడ్మిషన్లు తీసుకునే సమయంలో మంచి కాలేజీలను ఎంచుకుని పిల్లలను చేర్పించాలని, లేకపోతే వారి భవిష్యత్‌ ఆగమవుతోందని విద్యార్థి సంఘాల నాయకులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. తక్కువ ఫీజుతో ఇంటర్‌ కోర్సులు చెబుతామని ప్రచారం చేసే యాజమాన్యాల మాటలను విని మోసపోవద్దని, కాలేజీలకు ఇంటర్‌బోర్డు నుంచి అనుమతి ఉందా, లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటున్నారు. ఇతర కళాశాలల నుంచి నామినల్‌ రోల్స్‌ను పంపించే వాటికి దూరంగా ఉండాలని పేర్కొంటున్నారు. అనుమతి లేని కాలేజీలపై అధికారులు చర్యలు తీసుకుని మూసివేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.


- హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఇంటర్‌ కాలేజీ మరో రాష్ట్రంలో పేరొందిన కళాశాలకు అనుబంధంగా కొనసాగుతోంది. దీనికి ఇంటర్మీడియట్‌ బోర్డు నుంచి అనుమతిలేదు. హిమాయత్‌నగర్‌తోపాటు దిల్‌సుఖ్‌నగర్‌, హబ్సిగూడ, మాదాపూర్‌, మియాపూర్‌లో మొత్తం 5 బ్రాంచీలుండగా.. హబ్సిగూడ, మియాపూర్‌ కాలేజీలకు మాత్రమే గుర్తింపు ఉంది. మిగతా మూడింటికి పర్మిషన్‌ లేదు. అనుమతి లేకున్నా నిర్వాహకులు ఐదేళ్ల నుంచి అడ్మిషన్లు స్వీకరిస్తున్నారు. ఆయా కాలేజీల్లో చేరుతున్న విద్యార్థుల నామినల్‌ రోల్స్‌ను తమకు సంబంధించిన ఇతర కళాశాలల ద్వారా ఇంటర్‌బోర్డుకు పంపిస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు.


- మాదాపూర్‌లోని మరో కాలేజీకి కూడా గుర్తింపు లేదు. ఇది నగరంలోని ఓ పేరొందిన విద్యాసంస్థ పేరును వాడుకుంటూ సదరు యాజమా న్యానికి ఏటా కొంత మొత్తాన్ని చెల్లిస్తోంది. కాలేజీలో చేరుతున్న పిల్లలను అక్కడ చదువుతున్నట్లుగా చూపిస్తూ పరీక్షలు రాయిస్తోంది. ఫస్టియర్‌, సెకండియర్‌కు కలిపి రూ.2 లక్షల ఫీజు తీసుకుంటామని అడ్మిషన్ల సమయంలో తల్లిదండ్రులను నమ్మిస్తున్నారు. పరీక్షలప్పుడు అదనంగా మరో లక్ష రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. డిస్కౌంట్‌ పేరుతో ఏటా మోసానికి పాల్పడుతున్న యాజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Rates Today: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్..ఎంతకు చేరాయంటే..

Financial Aid: పుస్తకాల ముద్రణకు తెలుగు వర్సిటీ ఆర్థిక సహాయం

డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం

Gold Smuggling: శంషాబాద్‌ విమానాశ్రయంలో 3.5 కిలోల బంగారం పట్టివేత

Read Latest Telangana News and National News

Updated Date - May 06 , 2025 | 07:04 AM