Kurnool News: ఆ విధానానికి స్వస్తి.. పరీక్షలకు ఇక బుక్‌లెట్
ABN , Publish Date - Dec 05 , 2025 | 10:28 AM
విద్యా శాఖ ఓ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. విడి పేపర్లపై పరీక్షలు రాసే విధానానికి స్వస్తి పలికారు. సబ్జెక్టుల వారీగా అన్ని పరీక్షలకు కలిపి వేర్వేరు బుక్‌లెట్లను అందించి పరీక్షలు రాయిస్తున్నారు. ఈ విధానం ఎలా అమలవుతుందన్న దానిపై ఓ ప్రత్యేక కథనం.
- విడి పేపర్లపై పరీక్షలు రాసే విధానానికి స్వస్తి
- సమ్మెటివ్ పరీక్షల్లో అమలు
చాగలమర్రి(కర్నూలు): ప్రభుత్వ పాఠశాలల్లో(Govt Schools) చదివే విద్యార్థులు పరీక్షలు రాసేందుకు బుక్‌లెట్ అందిస్తున్నారు. విడి పేపర్లపై పరీక్షలు రాసే విధానానికి స్వస్తి పలికారు. సబ్జెక్టుల వారీగా అన్ని పరీక్షలకు కలిపి వేర్వేరు బుక్‌లెట్లను అందించి పరీక్షలు రాయిస్తున్నారు. ప్రతి విద్యార్థి ప్రగతిని బట్టే ఉపాధ్యాయులు అవగాహన చేసుకునే వీలు ఏర్పడుతుంది. పరీక్షల మార్కులను ఆన్‌లైన్‌లో చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యారంగంలో వస్తున్న సంస్కర ణలో భాగంగా ఇప్పటికే పాఠ్యపుస్తకాలను సమూలంగా మార్పుచేశారు.

సెమిస్టర్ విధానాన్ని అమలు చేస్తున్నారు. 1 నుంచి 10వ తరగతి వరకు ప్రతి విద్యాసంవత్సరంలో ఫార్మటివ్ అసెస్‌మెంట్ (యూనిట్) పరీక్షలు 4 జరుగుతాయి. క్వాటర్లీ, హాఫియర్లీ, ఫైనల్ ఎగ్జామ్ స్థానంలో సమ్మెటివ్ అసెస్‌మెంట్ 1, 2 పరీక్షలను నిర్వహిస్తున్నారు. కొత్త విధానంలో మొదటి, రెండోవ సెమిస్టర్లలో రెండు ఫార్మటివ్, ఒక సమ్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు వంతున జరుగుతాయి. ఇప్పటికే రెండు ఫార్మటివ్ పరీక్షలు ముగియగా ప్రస్తుతం సమ్మెటివ్ అసెస్‌మెంట్-1 పరీక్షలు జరుగుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా 1.34 లక్షల..
నంద్యాల జిల్లా పరిధిలో 1 నుంచి 5 ప్రాథమిక పాఠశాలలు 996 ఉండగా 45,558 మంది విద్యార్థులు, 21 యూపీ పాఠశాలలో 1,275 మంది విద్యార్థులు, 6 నుంచి 10వ తరగతి వరకు 86,492 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎయిడెడ్ పాఠశాలల్లో 5,577 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికి 1.34 లక్షల అసెస్‌మెంట్ బుక్‌లెట్‌లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ బుక్‌లెట్‌లలోనే పరీక్షల నిర్వహణ జరుగుతోంది.

అందంగా తీర్చిదిద్దారు
ఆకర్షణీయంగా ఉన్న పుస్తకాలపై పరీక్షలు రాసేలా నిర్ణయించిన ప్రభుత్వం, నిపుణుల సలహాలతో అసెస్‌మెంట్ బుక్‌లెట్‌లను రూపొందించారు. 1 నుంచి 10వ తరగతి వరకు చదివే ప్రతి విద్యార్థికి వారు చదువుతున్న తరగతులకు అనుగుణంగా ప్రతి సబ్జెక్టుకు ఒక బుక్‌లెట్ తయారు చేశారు.
విద్యాప్రమాణాలు పెంచేందుకే..
పేపర్లపై పరీక్షలు రాసే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యాప్రమాణాలు పెంచేందుకే అసెస్‌మెంట్ బుక్‌లెట్‌లు సబ్జెక్టుల వారీగా ఒకే బుక్‌లెట్‌లు పంపిణీ చేసింది.
- జీవయ్య, హెచ్‌ఎం, చాగలమర్రి
విద్యార్థుల ప్రగతికి దిక్సూచి..
ప్రభుత్వం చేపట్టిన అసెస్‌మెంట్ బుక్‌లెట్‌లు విద్యార్థుల ప్రగతికి దిక్సూచి. పరీక్షలు రాసే విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చారు. విద్యార్థులపై ఒత్తిడిలేని రీతిలో పరీక్షలు పేప ర్లపై కాకుండా ఆకర్షిణీయంగా ఉన్న పుస్తకాలపై రాసేలా ప్రభుత్వం నిర్ణయించింది.
- న్యామతుల్ల, ఎంఈవో, చాగలమర్రి
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు.. 15లోగా డిజైన్ కన్సల్టెంట్లతో ఒప్పందం
Read Latest Telangana News and National News