JNTU: పీహెచ్‌డీ ఆశలపై నీళ్లు.. సీట్ల సంఖ్య పెంపు లేనట్లే..
ABN , Publish Date - Oct 22 , 2025 | 08:23 AM
జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ సీట్ల సంఖ్యను పెంచే అంశం వైస్‌చాన్స్‌లర్ కిషన్‌కుమార్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తోందా అంటే.. విద్యార్థి సంఘాల నుంచి అవుననే జవాబు వినిపిస్తోంది. 213 సీట్ల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ జారీచేయగా, విద్యార్థి సంఘాల వినతి మేరకు సీట్ల పెంపు ప్రతిపాదనపై వైస్‌చాన్స్‌లర్ సమాలోచనలు చేశారు.
- అంగీకరించని జేఎన్‌టీయూ ఉన్నతాధికారులు
హైదరాబాద్ సిటీ: జేఎన్‌టీయూ(JNTU)లో పీహెచ్‌డీ సీట్ల సంఖ్యను పెంచే అంశం వైస్‌చాన్స్‌లర్ కిషన్‌కుమార్ రెడ్డి(Vice Chancellor Kishan Kumar Reddy)ని ఉక్కిరిబిక్కిరి చేస్తోందా అంటే.. విద్యార్థి సంఘాల నుంచి అవుననే జవాబు వినిపిస్తోంది. 213 సీట్ల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ జారీచేయగా, విద్యార్థి సంఘాల వినతి మేరకు సీట్ల పెంపు ప్రతిపాదనపై వైస్‌చాన్స్‌లర్ సమాలోచనలు చేశారు. పరిశ్రమలు, పరిశోధన సంస్థల నుంచి మరింతమంది పీహెచ్‌డీ చేసేందుకు అవకాశాలపై కసరత్తు చేశారు.
ప్రైవేటు కళాశాలల్లో యూనివర్సిటీ అనుమతితో ఏర్పాటు చేసిన సుమారు 60కి పైగా రీసెర్చ్ సెంటర్లకు అభ్యర్థులను కేటాయించే అంశంపైనా దృష్టి సారించారు. ఈ క్రమంలో మొత్తం 400నుంచి 500 వరకు సీట్లను పెంచే అవకాశం ఉన్నట్లు విద్యార్థి సంఘాల ప్రతినిధులు భావించారు. పీహెచ్‌డీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందునే ఇటీవల జారీచేసిన వెరిఫికేషన్ ప్రక్రియను కూడా వాయిదా వేశారని చెబుతున్నారు. మంగళవారం వివిధ విభాగాల డైరెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో సీట్ల పెంపునకు కొందరు ఉన్నతాధికారులు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది.

నెలాఖరులోగా వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం
పీహెచ్‌డీ సీట్ల సంఖ్య పెంపునకు కొందరు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లేకపోవడంతో, గతంలో ప్రకటించిన 213 సీట్లకు మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఈ మేరకు వెరిఫికేషన్ ప్రక్రియను నెలాఖరులోగా ప్రారంభించాలని వీసీ కిషన్‌కుమార్ రెడ్డి నిర్ణయించారు. వాస్తవానికి గత నెల 12 నుంచి 14 వరకు నిర్వహించిన ప్రవేశపరీక్షలో సుమారు 650మంది అభ్యర్థులు అర్హత సాధించారు. సీట్ల సంఖ్య పెరిగితే ఎక్కువమంది అభ్యర్థులకు పరిశోధనలు చేసేందుకు వీలుండేది.
వీసీ తాజా నిర్ణయం వందలాదిమంది అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లయిందని విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ అనుమతి పొందిన ప్రైవేటు కాలేజీల్లోని రీసెర్చ్ కేంద్రాలకు అభ్యర్థులను కేటాయించకపోవడంపై రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావును వివరణ కోరగా.. రీసెర్చ్‌కు అనుమతులు ఇచ్చినంత మాత్రాన అభ్యర్థులను కేటాయించాలన్న నియమం ఏమీ లేదన్నారు. ఆయా కేంద్రాల్లో రీసెర్చ్‌కు అవకాశాలపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికి సీట్ల సంఖ్య పెరిగే అవకాశం లేదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్ప తగ్గుదల.. మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News