Heavy Rains: ఆ జిల్లాలో స్కూళ్లకు సెలవు..!
ABN , Publish Date - Oct 22 , 2025 | 07:16 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా బుధవారం స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
నెల్లూరు, అక్టోబర్ 22: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా బుధవారం స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. అలాగే కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా.. ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైనా కంట్రోల్ రూమ్‌లోని 0861- 2331261, 7995576699 నెంబర్లుకు కాల్ చేయాలని సూచించారు.
ఎందుకంటే..?
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం తెల్లవారుజామున అల్పపీడనం బలపడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. అది క్రమంగా నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల సమీపంలో బుధవారం ఉదయం వాయుగుండంగా బలపడుతుందని చెబుతొంది. అనంతరం 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశముందని పేర్కొంది. అంతేకాదు.. ఇది తుపానుగా బలపడే అవకాశముందని అంచనా వేస్తోంది.
అలాగే దక్షిణ బంగాళాఖాతంలో శుక్ర, శనివారాల్లో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని వెల్లడించింది. మరోవైపు అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ బుధవారానికి వాయుగుండంగా బలపడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇంకోవైపు రానున్న ఐదు రోజులూ రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురవొచ్చని చెప్పింది. ఇక బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురస్తాయని.. శుక్రవారం నుంచి ఆదివారం వరకు అక్కడక్కడ భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది.
బుధవారం అంటే.. ఈ రోజు నెల్లూరు, తిరుపతి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అలాగే బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది. వర్ష ప్రభావిత జిల్లాల్లో ఉన్నతాధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రజల అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దీపావళి అమ్మకాలు రూ 6 లక్షల కోట్లు
For More AP News And Telugu News