Share News

JNTU: జేఎన్‌టీయూ స్నాతకోత్సవం వాయిదా..

ABN , Publish Date - Mar 12 , 2025 | 07:13 AM

జేఎన్‌టీయూ స్నాతకోత్సవం ఎట్టకేలకు వాయిదా పడింది. ఈ నెల రెండోవారం లోగా స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తామని రెండు నెలల కిందట నోటిఫికేషన్‌ విడుదల చేసిన వర్సిటీ ఉన్నతాధికారులు తీరా గడువు సమీపించే సరికి తూచ్‌.. ఇప్పుడు కాదంటూ చేతులెత్తేశారు.

JNTU: జేఎన్‌టీయూ స్నాతకోత్సవం వాయిదా..

- సమీపిస్తున్న గడువు.. ఖరారు కాని తేదీలు

- ఓడీల కోసం లక్షమంది విద్యార్థుల పడిగాపులు

- ప్రి-కాన్వొకేషన్‌ దరఖాస్తుకు ఫీజు భారం

హైదరాబాద్‌ సిటీ: జేఎన్‌టీయూ(JNTU) 13వ స్నాతకోత్సవం నిరవధికంగా వాయిదా పడింది. ఈ నెల రెండోవారం లోగా స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తామని రెండు నెలల కిందట నోటిఫికేషన్‌ విడుదల చేసిన వర్సిటీ ఉన్నతాధికారులు తీరా గడువు సమీపించే సరికి తూచ్‌.. ఇప్పుడు కాదంటూ చేతులెత్తేశారు. ఎప్పుడు నిర్వహించేదీ స్పష్టంగా చెప్పలేని పరిస్థితుల్లో వర్సిటీ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జేఎన్‌టీయూ నుంచి యూజీ, పీజీ, పీహెచ్‌డీ.. వంటి కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు తమ డిగ్రీ పట్టాల కోసం గగ్గోలు పెడుతున్నారు. వర్సిటీ పరిధిలో అనుబంధ, అఫిలియేటెడ్‌ కళాశాలల నుంచి సుమారు లక్షమంది విద్యార్థులు ప్రతియేటా బీటెక్‌, ఎంటెక్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులు పూర్తి చేస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: బుద్ధుడు చూపిన శాంతిమార్గంలో నడవాలి


గతేడాది పరీక్షలు పాసైన వారికి మార్కుల జాబితాతో పాటు ప్రొవిజనల్‌ సర్టిఫికెట్ల (పీసీ)ను జారీచేశారు. పీసీలు అందుకున్న విద్యార్థులకు ఆరునెలల్లోగా స్నాతకోత్సవం నిర్వహించి ఒరిజినల్‌ డిగ్రీలను ప్రదానం చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి యూనివర్సిటీ జారీచేసిన ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌(పీసీ) ఆర్నెళ్లపాటే చెల్లుబాటు అవుతుంది. నవంబర్‌ నాటికే వీటి గడువు ముగియడంతో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. అలాగే, పీహెచ్‌డీ పూర్తిచేసిన అభ్యర్థులు సైతం తమ ఒరిజినల్‌ డిగ్రీ చేతికి ఎప్పుడు అందుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.


మోయలేని భారంగా ప్రి-కాన్వొకేషన్‌ ఫీజు

ఉత్తీర్ణులైన అభ్యర్థులంతా తమ ఒరిజినల్‌ డిగ్రీలను పొందేందుకు ఫిబ్రవరి 25లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. సుమారు 50వేలమంది స్నాతకోత్సవంలో డిగ్రీలను పొందేందుకు రూ.600 చొప్పున ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, స్నాతకోత్సవం గడువులోగా నిర్వహిస్తారా లేక వాయిదా వేస్తారా అన్న సందేహాలతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఒరిజినల్‌ డిగ్రీలు అత్యవసరంగా కావాల్సిన విద్యార్థులు ప్రి-కాన్వొకేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. రూ.3500చొప్పున ఫీజు చెల్లించాల్సి రావడం వారికి మోయలేని భారంగా తయారైంది.


లక్షమంది విద్యార్థుల పడిగాపులు

జేఎన్‌టీయూ స్నాతకోత్సవాన్ని వర్సిటీ యాజమాన్యం సకాలంలో నిర్వహించలేని పక్షంలో ప్రికాన్వొకేషన్‌ కింద తక్కువ ఫీజుతో విద్యార్థులకు ఓడీలు అందజేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అలాకాకుండా ఓడీ కోసం అభ్యర్థుల నుంచి రూ.3,500 వసూలు చేయడం వారిని నిలువుదోపిడీ చేయడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మొత్తంగా సుమారు లక్షమంది విద్యార్థులు ఎదురుచూస్తున్న స్నాతకోత్సవాన్ని వీలైనంత త్వరగా నిర్వహించాలని లేదా ప్రి-కాన్వొకేషన్‌ ఫీజు తగ్గించి ఓడీలను జారీ చేయాలని కొత్త వీసీ కిషన్‌కుమార్‌రెడ్డిని విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు.

city1.2.jpg


స్నాతకోత్సవం ఇప్పట్లో లేనట్టే: రిజిస్ట్రార్‌

జనవరి 15న ఇచ్చిన నోటిఫికేషన్‌ మేరకు మార్చి రెండవ వారంలో స్నాతకోత్సవం నిర్వహించే పరిస్థితి లేదని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. 20రోజుల కిందట వర్సిటీకి కొత్త వీసీగా వచ్చినందున, స్నాతకోత్సవ ఏర్పాట్లపై తాము దృష్టి సారించలేదని పేర్కొన్నారు. అయితే, 13వ స్నాతకోత్సవాన్ని తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే తెలియజేస్తామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

లంచాలు మరిగి.. వలకు దొరికి.. !

అమెరికాలోనే పేపాల్‌ డాటా లీకేజీ!

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లోకి రోబోలు

నిఘా నీడలో ఇంటర్‌ పరీక్షలు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 12 , 2025 | 07:13 AM