Share News

లంచాలు మరిగి.. వలకు దొరికి.. !

ABN , Publish Date - Mar 12 , 2025 | 05:15 AM

భవన నిర్మాణ బిల్లు చెల్లింపునకు, ప్లాట్‌ మ్యుటేషన్‌ చేయడానికి, బార్‌ లైసెన్స్‌ జిరాక్సు కాపీలు ఇవ్వడానికి లంచాలు తీసుకుంటూ ఇద్దరు అధికారులు, ఓ ఉద్యోగి ఏసీబీ అధికారులకు దొరికిపోయారు.

లంచాలు మరిగి.. వలకు దొరికి.. !

  • మ్యుటేషన్‌కు 12 వేలు తీసుకుంటూ మెదక్‌ ఆర్‌ఐ

  • లైసెన్స్‌ జిరాక్స్‌కు 1500 లంచంతో ఎక్సైజ్‌ ఉద్యోగి

  • రూ.50 వేలతో పట్టుబడ్డ ఈడబ్ల్యూఐడీసీ డీఈఈ

  • మెదక్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌లలో ఘటనలు

ఆదిలాబాద్‌ రూరల్‌, మెదక్‌, ఖమ్మం సంక్షేమ విభాగం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణ బిల్లు చెల్లింపునకు, ప్లాట్‌ మ్యుటేషన్‌ చేయడానికి, బార్‌ లైసెన్స్‌ జిరాక్సు కాపీలు ఇవ్వడానికి లంచాలు తీసుకుంటూ ఇద్దరు అధికారులు, ఓ ఉద్యోగి ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఆదిలాబాద్‌లో మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ భవనాన్ని రూ. 14.36 కోట్లతో నిర్మించారు. సబ్‌ కాంట్రాక్టర్‌ పీవీ నారాయణకు ఈ నిర్మాణానికి ఇటీవలే రూ.2కోట్ల బిల్లు మంజూరయ్యాయి. ఈ బిల్లు కోసం విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఈడబ్ల్యూఐడీసీ) డీఈఈ శంకర్‌.. సదరు సబ్‌ కాంట్రాక్టర్‌ను రూ.2 లక్షల కమీషన్‌ ఇవ్వాలని అడిగారు. ఇద్దరి మధ్య చివరికి రూ.లక్షకు ఒప్పందం కుదిరింది. అనంతరం నారాయణ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. సోమవారం డీఈఈ శంకర్‌కు నారాయణ రూ.50 వేలు ఇస్తుండగా అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అలాగే, మెదక్‌లోని శ్రీనివాస్‌ చెందిన ఓపెన్‌ ప్లాట్‌కు మ్యుటేషన్‌ కోసం విచారణ జరిపి నివేదిక ఇచ్చేందుకు మున్సిపల్‌ రెవెన్యూ అధికారి (ఆర్‌ఐ) జానయ్య రూ.20 వేలు డిమాండ్‌ చేశారు.


చివరకు రూ.12 వేలకు ఒప్పుకున్నారు. ఆ తర్వాత శ్రీనివాస్‌ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు మంగళవారం శ్రీనివాస్‌.. ఆర్‌ఐ జానయ్యకు రూ.12వేలు ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు. మరో ఘటనలో.. లైసెన్సుల రెన్యువల్‌కు సంబంధించి ఎక్సైజ్‌ అధికారులు ముందుస్తు నోటీసులు ఇవ్వకుండానే, షోకాజ్‌ నోటీసులు జారీచేశారని ఖమ్మంలోని సాయికృష్ణ, డెలీషియస్‌ బార్‌ల నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా లైసెన్స్‌ జిరాక్స్‌ కాపీలు సమర్పించాలని కోర్టు నిర్వాహకులకు సూచించింది. దాంతో బార్‌ల నిర్వాహకులు జిల్లా ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలోని సీనియర్‌ అసిస్టెంట్‌ భూక్య సోమ్లానాయక్‌ను సంప్రదించారు. రూ.2వేలు లంచం ఇస్తేనే జిరాక్స్‌ కాపీలు ఇస్తానని చెప్పాడు. దీంతో బార్‌ల నిర్వాహకులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మంగళవారం సోమ్లానాయక్‌ రూ.1,500 లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Updated Date - Mar 12 , 2025 | 05:15 AM