అమెరికాలోనే పేపాల్ డాటా లీకేజీ!
ABN , Publish Date - Mar 12 , 2025 | 05:08 AM
దిగ్గజ పేమెంట్ గేట్‌వే పేపాల్ వినియోగదారుల డాటా లీకేజీ అమెరికాలోనే జరిగినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) గుర్తించింది. దుబాయ్‌లో ఉంటున్న కైవన్ పటేల్ రూపేశ్‌కుమార్ అలియాస్ జాదూభాయ్.

గుజరాత్ కేసుకు మాదాపూర్‌తో లింకుందా?
అమెరికన్ల సమాచారాన్ని ఎలా సేకరించారు?
అమెరికన్ ఎంబసీకి సీఎ్‌సబీ సమాచారం
మనస్విని కస్టడీ కోసం కోర్టులో పిటిషన్
హైదరాబాద్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): దిగ్గజ పేమెంట్ గేట్‌వే పేపాల్ వినియోగదారుల డాటా లీకేజీ అమెరికాలోనే జరిగినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) గుర్తించింది. దుబాయ్‌లో ఉంటున్న కైవన్ పటేల్ రూపేశ్‌కుమార్ అలియాస్ జాదూభాయ్. అతని సోదరుడు విక్కీకి ఈ సమాచారం అమెరికా నుంచే చేరిందని నిర్ధారించింది. జాదూభాయ్ ద్వారా ఆ సమాచారాన్ని సేకరించిన గుజరాత్‌కు చెందిన ఆజాద్ అనే కేటుగాడు.. మాదాపూర్‌లో కాల్‌సెంటర్ నిర్వహించే మనస్వినికి ఆ వివరాలను అందించినట్లు తేల్చారు. సీఎ్‌సబీ ఈ మేరకు అమెరికా ఎంబసీకి వివరాలను అందజేసింది. డాటా ఫ్రాడ్ ద్వారా సైబర్ నేరగాళ్లు అమెరికాకు చెందిన పేపాల్ ఖాతాదారుల సమాచారాన్ని కొల్లగొట్టినట్లు వివరించింది.
అయితే.. గత ఏడాది గుజరాత్‌లో కూడా ఈ తరహా మోసం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఆ కేసులో ఆజాద్ నిందితుడిగా ఉన్నాడు. ఇప్పుడు మాదాపూర్ కేసులో కూడా.. మనస్వినికి సమాచారం అందజేసింది ఆజాదే. దీంతో.. గుజరాత్-మాదాపూర్ కేసులకు లింకులున్నాయా? అనే కోణంలో సీఎ్‌సబీ దర్యాప్తు చేస్తోంది. మాదాపూర్‌లోని పత్రికానగర్‌లో ఎగ్జిటో సొల్యూషన్స్ పేరుతో మనస్విని కాల్‌సెంటర్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే..! ఈ కేసులో సీఎ్‌సబీ పోలీసులు మనస్వినితోపాటు.. 62 మంది కాల్‌సెంటర్ ఉద్యోగులను అరెస్టు చేశారు. కాగా.. ఈ కేసులో మరింత సమాచారాన్ని రాబట్టేందుకు మనస్వినితోపాటు.. 10 మంది కాల్‌సెంటర్ టీమ్‌లీడర్లను కస్టడీలోకి తీసుకుని, విచారించాలని సీఎ్‌సబీ నిర్ణయించింది. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.