Share News

నిఘా నీడలో ఇంటర్‌ పరీక్షలు

ABN , Publish Date - Mar 04 , 2025 | 12:07 AM

ఉన్నత విద్యకు మార్గం వేసే ఇంటర్‌ పరీక్షలు సమీపించాయి. బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలు నిఘా నీడన జరగనున్నాయి.

నిఘా నీడలో ఇంటర్‌ పరీక్షలు

- ప్రతీ పరీక్ష కేంద్రంలో ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు

- మాస్‌ కాపియింగ్‌కు తావులేకుండా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ల ఏర్పాటు

- రేపటి నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు

వాంకిడి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యకు మార్గం వేసే ఇంటర్‌ పరీక్షలు సమీపించాయి. బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలు నిఘా నీడన జరగనున్నాయి. మాల్‌ ప్రాక్టీస్‌, చూచిరాతలు, ఒకరికి మరొకరు పరీక్ష రాయడం, ఇన్విజిలేటర్లు విధుల దుర్వినియోగం తదితర వాటికి తావులేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయోగ పరీక్షల్లో ఈ విధానాన్ని అమలు చేయగా వార్షిక పరీక్షల్లో సైతం దీన్ని కొనసాగించనున్నారు. ఇందుకు అనుగుణంగా సీసీ కెమెరాలను బిగించే ప్రక్రియ చేపట్టారు.

- ప్రత్యేక బృందాల ఏర్పాటు...

పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైపవర్‌, డీఈసీ, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. హైపవర్‌ కమిటీకి అధ్యక్షుడిగా కలెక్టర్‌, కన్వీనర్‌గా జిల్లా ఇంటర్‌ నోడల్‌ అధికారి, డీఈసీ కమిటీ సభ్యులుగా సీనియర్‌ ప్రిన్సిపాల్‌, సీనియర్‌ అధ్యాపకుడు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందంలో ఆయా కళాశాలలకు చెందిన అధ్యాపకులు సభ్యులుగా ఉంటారు. ముగ్గురు సభ్యులతో కూడిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందంతో పాటు ఇద్దరు సభ్యులతో ఒక్కో బృందం చొప్పున రెండు సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు.

- విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా..

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు. ప్రతీ కేంద్రంలో ప్రశ్నపత్రాలు తీసే ప్రాంతంలో, ప్రవేశ ద్వారం వద్ద, తరగతి గది, తదితర ప్రాంతాల్లో మొత్తం ఐదు సీసీ కెమెరాలు బిగించాలని ఇంటర్‌ బోర్డు అధికారులను ఆదేశించారు. పరీక్ష జరిగే తీరు మొత్తం రికార్డు చేస్తారు. ఇతరులెవరూ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇన్విజిలేటర్లను ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులతో పాటు అవసము న్న కేంద్రాల్లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను నియమించే ప్రక్రియ సాగుతోంది. అన్ని పరీక్ష కేంద్రాల్లో బుధవారం నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

- జిల్లాలో 19 పరీక్ష కేంద్రాలు..

కుమరం భీం ఆసిపాబాద్‌ జిల్లాల్లో మొత్తం 48 జూనియర్‌ కళాశాలలు ఉండగా వీరి కోసం 19 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 11 ప్రభుత్వ, రెండు ప్రైవేటు, రెండు ఆదర్శ పాఠశాలలు, రెండు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 19 పరీక్షా కేంద్రాల్లో 10,043 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 4,756 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం, 5,287 మంది ద్వితీయ సంవత్సరంలో విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

- ఉన్నతాధికారుల ఆదేశాలతో...

కల్యాణి - జిల్లా ఇంటర్‌ నోడల్‌ అధికారి

ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. జిల్లా వ్యాప్తంగా 19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రతీ పరీక్షా కేంద్రంలో ఐదు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాము. మాస్‌ కాపీయింగ్‌ తావులేకుండా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలతో పాటు సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాము.

Updated Date - Mar 04 , 2025 | 12:07 AM