Diwali celebrations in Ongole: చీకటిని తరిమిన సత్యభామ – వెలుగులు నింపిన దీపావళి
ABN , Publish Date - Oct 19 , 2025 | 09:15 AM
ఓంగోలు నగరంలోని తూర్పుపాలెంలో ఈ నరకాసురవధ కార్యక్రమం 1902వ సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పట్లో తూర్పుపాలెం నివాసి సింగరాజు సుబ్బయ్య అనే వ్యక్తి ఈ నరకాసురవధ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పెద్దలు చెబుతారు. ఆ ఆచారం తరాలు మారినా నేటికీ కొనసాగుతూనే ఉంది.
నేడు నరకచతుర్దశి
కనులవిందుగా జరిగే
నరకాసురవధ పౌరాణిక ఘట్టం
రాష్ట్రంలో ఒంగోలుకే ప్రత్యేకం
వివిధ వేషధారణలు,
డప్పువాద్యాలతో కోలాహలం
టపాసులతో సందడి చేయనున్న పిల్లలు, పెద్దలు
దీపావళి (Deepavali) పండుగను ప్రజలు జరుపుకోవటం వెనుక ఒక పౌరాణిక ప్రాశస్త్యం ఉంది. లోకకంఠకుడైన నరకాసురుడిని శ్రీకృష్ణుని (Sri Krishna) సతీమణి సత్యభామ (Satyabhama) వధించటం వలన తమ కష్టాలు తొలిగిపోయాయన్న ఆనందంలో ప్రజలందరూ ఊరంతా దీపాలను వెలిగించి పండుగ జరుపుకుంటారు.అందుకే దీన్ని ‘దీపావళి’ అంటారు. ఆశ్వయుజమాసంలో అమావాస్యని దీపావళి పండుగ్గా జరుపుకుంటే ఆ ముందు రోజైన చతుర్దశి రోజున సత్యభామ నరకాసురుడిని వధించిందని పురాణాలు చెబుతున్నాయి. దేశమంతా దీపావళిని ఆనందంగా జరుపుకుంటూ, నరకచతుర్దశి (Naraka chaturdashi) రోజున చిన్నపాటి నరకాసుర బొమ్మను తయారు చేసి దహనం చేస్తాయి. కానీ ఒంగోలు ప్రజలు మాత్రం నరకచతుర్దశిని సైతం ఎంతో విభిన్నంగా జరుపుకుంటారు. 1902వ సంవత్సరంలో అంటే 123 సంవత్సరాల కిందట నగరంలో ప్రారంభమైన ఈ ‘నరకాసురవధ’ రాష్ట్రంలో కేవలం ఒంగోలుకు మాత్రమే ప్రత్యేకం.
ఒంగోలు కల్చరల్, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): దీపావళి పండుగ వచ్చిందంటేనే ఊరుఊరంతా సందడిగా మారుతుంది. టపాకాయల మోతలు, చిచ్చుబుడ్ల వెలుగులతో చిన్నాపెద్దా తేడాలేకుండా అందరికీ ఆనందకాంతులను పంచిఇచ్చే ఏకైక పండుగ దీపావళి. దీపావళి పండుగను ఆశ్వయుజ అమావాస్య రోజు జరుపుకుంటారు.
నగరంలోని తూర్పుపాలెంలో ఈ నరకాసురవధ కార్యక్రమం 1902వ సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పట్లో తూర్పుపాలెం నివాసి సింగరాజు సుబ్బయ్య అనేవ్యక్తి ఈ నరకాసురవధ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పెద్దలు చెబుతారు. ఆ ఆచారం తరాలు మారినా నేటికీ కొనసాగుతూనే ఉంది. సహజంగా గడ్డితో నరకాసురుని బొమ్మను తయారుచేసి నరక చతుర్దశి రోజు తెల్లవారుజామునే పిల్లలు తమ ఇంటిముందు ఆ బొమ్మను తగులబెట్టటం అనాదిగా వస్తున్న ఆచారం.
అనేక చోట్ల ఈ గడ్డిబొమ్మను తయారుచేసేటప్పుడు అందులో ఉప్పును వేస్తారు. దీంతో బొమ్మ తగులబడే సమయంలో చిటపట శబ్దాలు చేస్తూ సందడి చేస్తుంది. అయితే ప్రస్తుతం చాలామంది ఆ బొమ్మలో చిన్నచిన్న టపాసులను ఉంచుతున్నారు. నరకాసురుని బొమ్మ తగులబడే సమయంలో అవి పేలి శబ్దాలు చేస్తుంటే చిన్నా పెద్దా అందరూ ఎంతో హుషారుగా చూస్తుంటారు. అయితే నరకాసుర వధను ప్రజలకు కళ్లముందు సాక్షాత్కరింపజేయాలనే ఉద్దేశంతో 123 సంవత్సరాల కిందట ఒంగోలు (Ongole)లో ఈ నరకాసురవధ ఘట్టం ప్రారంభించినట్లు చెబుతారు.
నరకచతుర్దశి రోజు రాత్రి దాదాపు 12 గంటల సమయంలో ఈ నరకాసురవధ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వేలాదిగా ప్రజలు పాల్గొనే ఈ కార్యక్రమం దాదాపు 5 గంటలపాటు కొనసాగుతుంది. ఇందులో కొంతమంది శ్రీకృష్ణుడు, సత్యభామ, నరకాసురుడు వేషధారణలను చేసుకుని పాల్గొంటారు. తూర్పుపాలెం శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం కూడలి వద్ద నుంచి ముందుగా శ్రీకృష్ణుడు, సత్యభామ వేషధారులు ఎక్కిన వాహనం ప్రారంభమవుతుంది.ఈ సందర్భంగా ఏర్పాటుచేసే డప్పువాయిద్యాలు, మేళతాళాలతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంటుంది.
ఆ వాయిద్యాలకు తగిన విధంగా ఎంతో ఉత్సాహంతో ప్రజలు నృత్యాలు చేస్తూ సందడి చేయటం చూసితీరాల్సిందే. తూర్పుపాలెం వద్దనుంచి శ్రీకృష్ణుడు, సత్యభామల రథం ప్రారంభమైన కొంతసేపటి తర్వాత నరకాసురుని వాహనం బయల్దేరుతుంది. ఇక అక్కడి నుంచి ఈ వాహనాలు నగరంలోని బి.వి.ఎస్ థియేటర్, ట్రంకురోడ్డు, అంబేడ్కర్ విగ్రహం, రాజాపానగల్ రోడ్డు, లాయర్‌పేట, కొత్తపేట తదితర ప్రధాన రహదారులగుండా కొనసాగి దీపావళి రోజు తెల్లవారుజామున పప్పుబజారులోని గాంధీవిగ్రహం వద్దకు ముందుగా శ్రీకృష్ణుని వాహనం, ఆ తర్వాత నరకాసురుని వాహనం చేరుకుంటాయి.
ఇక ఇటీవల కొన్ని సంవత్సరాలుగా ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో భారీ నరకాసుర బొమ్మను తయారుచేసి స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్‌లో నరకాసుర దహనం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసే పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను హుషారెత్తాస్తాయి. ఈ విధంగా ఒంగోలు నగరప్రజలకు కేవలం దీపావళి పండుగ మాత్రమే కాకుండా, నరక చతుర్దశి సైతం ఎన్నో మధురానుభూతులను మిగులుస్తుంది.
ఈ నరకాసురవధ కార్యక్రమంలో శ్రీకృష్ణునికి నరకాసురునికి మధ్య జరిగిన సంవాదానికి సంబంధించిన పలు పౌరాణిక పద్యాలను కళాకారులు రాగయుక్తంగా ఆలపిస్తారు. అదేవిధంగా పదిచేతులతో, పొడవైన ఎర్రని నాలుకతో, పదునైన కోరలతో నరకాసురుని వేషధారి అచ్చం రాక్షసరాజులాగా చేసే సందడి ప్రజలను ఉల్లాసపరుస్తుంది. దాదాపు 3 నుంచి 4 లక్షల రూపాయల ఖర్చుతో నిర్వహించే ఈ నరకాసురవధ కార్యక్రమం ఎన్నో సంవత్సరాలుగా పలువురు యువకులు నిర్వహిస్తున్నారు. తమ పూర్వీకులనుంచి ఈ ఆచారం వస్తున్నదని, దీనిని తాము కొనసాగిస్తున్నామని, పండుగల విశిష్టతను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన ఇటువంటి కార్యక్రమాలు మన పౌరాణిక సంపదను, సంస్కృతిని కాపాడటానికి ఎంతో ఉపయోగపడతాయని వారు చెబుతారు.
ఇవి కూడా చదవండి..
ఉద్యోగులకు దీపావళి ధమాకా.. ఒక డీఏ కానుక
శ్రీవారి దర్శనం పేరుతో మోసపోకండి
Read Latest AP News And Telugu News