AP Govt Announces Diwali Bonus: ఉద్యోగులకు దీపావళి ధమాకా.. ఒక డీఏ కానుక
ABN , Publish Date - Oct 19 , 2025 | 03:33 AM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ఉద్యోగులకు ఒక విడత డీఏ కరువు భత్యం విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు...
ఆర్థిక వెసులుబాటు రాగానే పీఆర్సీ: సీఎం
జగన్ పాలనలో భవిష్యత్తులో తాగబోయే మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి రూ.26,000 కోట్లు అప్పు తెచ్చారు. ప్రజలు, రాష్ట్రమే కాదు ఉద్యోగులు కూడా వైసీపీ ప్రభుత్వ బాధితులే. కనీసం సకాలంలో జీతాలు, పెన్షన్లు కూడా ఇవ్వలేదు. సమావేశాలు కూడా పెట్టుకోనివ్వలేదు.
కూటమి ప్రభుత్వం ఉద్యోగులతో ఉంటుంది. కలిసి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. మీ గౌరవాన్ని పెంచేలా నిర్ణయాలు తీసుకుంటాం. ఉద్యోగులు కొన్ని చోట్ల అద్భుతంగా పనిచేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఔట్‌సోర్సింగ్‌తో కూడా పనిచేయించుకోలేకపోతున్నారు. ఉత్సాహంగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలి.
- సీఎం చంద్రబాబు
నవంబరు నుంచి సొమ్ము జమ
‘ఆర్టీసీ’ ప్రమోషన్లకు పరిష్కారం
రిటైరయ్యేలోగా ఎప్పుడైనా వాడుకునేలా చైల్డ్‌కేర్ లీవ్
పోలీసులకు నవంబరు, జనవరిలో ఈఎల్స్ సొమ్ము
ఉద్యోగ సంఘ భవనాలకు ఆస్తి పన్ను బకాయిలు మాఫీ
60 రోజుల్లో ఈహెచ్‌ఎస్ సేవలు మెరుగుపరుస్తాం
ఓపీఎస్ వర్తింపుపై ఉపసంఘం
అమరావతి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ఉద్యోగులకు ఒక విడత డీఏ (కరువు భత్యం) విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నవంబరు నుంచి ఉద్యోగుల ఖాతాల్లో డీఏ సొమ్ము జమ అవుతుందని తెలిపారు. దీనికిగాను నెలవారీగా రూ.160 కోట్లు వెచ్చించనున్నట్టు వెల్లడించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శనివారం మంత్రివర్గ ఉప సంఘ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత రాత్రి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వారితో భేటీ అయ్యారు. ఒక విడత డీఏతో సహా అనేక నిర్ణయాలను స్వయంగా ప్రకటించారు. ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు రాగానే పీఆర్సీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా పోలీసులకు ఒక విడత ఈఎల్స్(ఆర్జిత సెలవులు) ఇస్తామని, దీన్ని రెండుసార్లుగా నవంబరులో రూ.105 కోట్లు, జనవరిలో రూ.105 కోట్లు చెల్లిస్తామని సీఎం చెప్పారు. ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న హెల్త్‌కార్డు సేవలను 60 రోజుల్లో వారి అవసరాలకు తగినట్టుగా మెరుగుపరుస్తామని తెలిపారు. అలాగే, 180 రోజుల చిన్నారుల సంక్షరణ సెలవుల(చైల్డ్‌కేర్ లీవు)ను వారు రిటైర్ అయ్యేలోగా ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడించారు.
ఉద్యోగ సంఘాల కార్యాలయాలకు ఒకప్పుడు ఆస్తిపన్నుకి మినహాయింపు ఇచ్చామని, తర్వాత మునిసిపాలిటీల్లో ఆస్తి పన్ను కట్టాలంటూ వారికి జరిమానాల మీద జరిమానాలు వేశారని చెప్పారు. ఇప్పుడు వాటన్నింటినీ రద్దు చేస్తున్నామని, ఇకపై ఆస్తిపన్ను కట్టాల్సిన అవసరం లేకుండా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్యూన్, వాచ్‌మెన్, అటెండర్, జూనియర్ అసిస్టెంట్, ప్లంబర్ విధులు నిర్వహించే ఉద్యోగాల పేర్లు గౌరవప్రదంగా మార్చుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 2004కి ముందు ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయి, ఉద్యోగాల్లోకి వచ్చిన వారికి ఓపీఎస్ వర్తించేలా సుప్రీంకోర్టు వెలువరించిన నిర్ణయం అమలుచేసేందుకు మంత్రి వర్గ ఉపసంఘం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఉద్యోగుల ఇతర సమస్యలపై కూడా ఈ కమిటీ ఎప్పటికప్పుడు చర్చించి సరైన నిర్ణయాలు తీసుకుంటుందని వెల్లడించారు. కాగా, పోలీసులకు 4 విడతల సరెండర్ లీవుల సొమ్ము చెల్లించాలి. ఒక్కొక్క విడతకు దాదాపు రూ.210 కోట్ల చొప్పున మొత్తం రూ.835 కోట్లు ఉంటుందని ముఖ్యమంత్రి వివరించారు.
ఇతర రాష్ట్రాల్లో తగ్గిస్తున్నారు!
దక్షిణాది రాష్ట్రాలన్నీ తమ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఇతర నిర్వహణ ఖర్చులు తగ్గించుకుంటూ, వాటిని మూలధనంగా ఖర్చు చేస్తూ ఆదాయం స ంపాదిస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. కానీ, రాష్ట్రంలో పరిస్థితులు భిన్నంగా ఉనాయన్నారు. ఈ విషయం ప్రతి ఉద్యోగికీ, ప్రజలకు అర్థం కావాలన్నారు. ‘‘దాపరికం లేదు. ప్రజల పక్షాన ట్రస్టీగా పనిచేస్తున్నాం. ఎక్కడా ఎవరినీ కించపరచడం లేదు. 2024-25లో మనరాష్ట్రం సొంత ఆదాయంలో జీతాలు, పెన్షన్లు, ఇతర నిర్వహణ ఖర్చులు 93 శాతానికి చేరా యి. 2025-26లో 93.5 శాతం ఉన్నాయి. 2024-2 5లో రూ.51,462 కోట్లు, 2025-26లో రూ.51,202 కోట్లు మానవ వనరుల(హెచ్‌ఆర్)కు ఖర్చు పెడుతున్నాం. కానీ, 2020-21లో తమిళనాడు 63 శాతం ఉన్న హెచ్‌ఆర్ ఖర్చును ఇప్పుడు 42 శాతానికి, కేరళ 106 శాతం నుంచి 68 శాతానికి, కర్ణాటక 49 శాతం నుంచి 38 శాతానికి, తెలంగాణ 58 శాతం నుంచి 38 శాతానికి తగ్గించుకున్నాయి. ఏపీలో మాత్రం పరిస్థితులు రివర్స్‌లో ఉన్నాయి. జీఎ్‌సడబ్ల్యూఎస్ వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు. ఆప్కాస్, ఆర్టీసీ అన్ని కలిపి రూ. 10,0 00 కోట్ల అదనపు ఖర్చు వచ్చి చేరింది. ఆ స్థాయిలో ఆదాయం మాత్రం పెరగలేదు. 94 కేంద్ర ప్రాయోజిత పథకాలకు వైసీపీ హయాంలో డబ్బులివ్వలేదు. మేం అధికారంలోకి వచ్చాక రూ.9,371 కోట్లు ఖర్చు చేసి వాటిని పునరుద్ధరించాం. జల్‌జీవన్ మిషన్‌పై కేంద్రం రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రంల ో కేవలం రూ.2,000 కోట్లు కూడా జరగలేదు.’’ అని సీఎం అన్నారు.
తప్పులు సరిచేస్తున్నాం..
16 నెలలుగా రూ.15,920 కోట్ల పెండింగ్ సొమ్మును చెల్లించామని సీఎం చంద్రబాబు చెప్పారు. పాత బిల్లులన్నీ రూ.23,556 కోట్లు సిస్టమ్‌లో అప్‌లోడ్ చేశామన్నారు. పునరుద్ధరించిన కేంద్ర ప్రాయోజిత పథకాలకు రూ.9,371 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలిపారు. ఆర్థిక సంఘం గ్రాంట్లు రూ.2,793 కోట్లు చెల్లించామన్నారు. ‘‘సంక్షేమ కార్యక్రమాలు ‘సూపర్-6’ అమలు చేశాం. ఉద్యోగుల బాధ్యత కూడా మాదే. మనసుంది కానీ మార్గం లేదు. ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు. కారణాలు ఏవైనా కావచ్చు దక్షిణాదిలో వెనుకబడిపోతున్నాం. ఆదాయం పెరగాలి. అభివృద్ధి కూడా ముందుకెళ్లాలి. ఒకప్పుడు రోడ్లన్నీ గుంతలే. అవి వేరే రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కానీ, ఆ సమస్యను మనం అధిగమించాం. ఇది ప్రారంభం మాత్రమే.’’ అని చంద్రబాబు తెలిపారు.