Boddemma Festival: తెలంగాణలో బొడ్డెమ్మ పండుగ సంబరాలు
ABN , Publish Date - Sep 15 , 2025 | 10:27 AM
తీరొక్క పూలతో తొమ్మిది రోజుల పాటు ప్రకృతితో మమేకమై.. పూల జాతరగా మారే తెలంగాణ సంప్రాదాయిక బతుకమ్మ పండుగ కోసం ఆడపడుచులందరూ ఎదురుచూస్తారు. ఎంతో ఉత్సాహంగా సాగే బతుకమ్మ సంబురాల కంటే ముందు బొడ్డెమ్మ ముందుకు వస్తోంది.
నేటి నుంచి బొడ్డెమ్మ సంబురాలు
21నుంచి ఎంగిలి పూల బతుకమ్మ
ఆడ పడుచులు పుట్టింటికి వచ్చే వేళ
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల): తీరొక్క పూలతో తొమ్మిది రోజుల పాటు ప్రకృతితో మమేకమై.. పూల జాతరగా మారే తెలంగాణ సంప్రాదాయిక బతుకమ్మ (Bathukamma) పండుగ కోసం ఆడపడుచులందరూ ఎదురుచూస్తారు. ఎంతో ఉత్సాహంగా సాగే బతుకమ్మ సంబురాల కంటే ముందు బొడ్డెమ్మ (Boddemma) ముందుకు వస్తోంది. పెత్రమాస నుంచి ఎంగిలిపూల బతుకమ్మ మొదలవుతే అంతకంటే ముందు ఇళ్లవద్దే పిల్లలు, యువుతులు ఆడుకునే బొడ్డెమ్మ ఆటపాట సోమవారం నుంచి వినిపించనుంది.
ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజుల ముందు, ఎక్కువ ప్రాంతాల్లో ఏడు, ఐదు రోజుల నుంచి బొడ్డెమ్మ పండుగ మొదలవుతుంది. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను గుర్తించి ఈనెల 21 నుంచి 30 తేది వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇదే క్రమంలో బొడ్డెమ్మను గుర్తించకపోవడంతో చిన్నబోతోంది. ఈ నేపథ్యంలోనే బొడ్డెమ్మ సంస్కృతి కనుమరుగయ్యే ప్రమాదంలో పడింది. సోమవారం నుంచి బొడ్డెమ్మ పండుగ ప్రారంభం కానుంది. ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో బొడ్డెమ్మ సంస్కృతి పదిలంగానే ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వేములవాడ, ఇతర మండలాల్లో బొడ్డెమ్మను ఆడుకుంటున్నారు.
బొడ్డెమ్మా... బొడ్డెమ్మా బిడ్డలు ఎందరే...
బొడ్డెమ్మ బొడ్డెమ్మా కోల్... బిడ్డలు ఎందరే.. అంటూ చిన్నారులు ప్రధానంగా బొడ్డెమ్మా ఆటలు ఆడుకుంటారు. బొడ్డెమ్మ అనే పదాన్ని అమ్మవారి నామాలతో ఒక నామంగా గుర్తించి బొడ్డెమ్మను పుట్టమన్నుతో చిన్నపిల్లలు, కన్నెపిల్లలు కలిసి ఒక పీటపైన ఎర్రమట్టితో అంతస్తు లుగా, గుండ్రంగా బొడ్డెమ్మను తయారు చేస్తారు. పీట మీద తయారుచేసి మట్టిపైనా శిఖరంగా బీర, కట్ట, గన్నేరు, నందివర్ధనం వంటి పూలతో బొడ్డెమ్మ ప్రతిరోజు అలికి అలంకరించి రోజూ ఆటలాడి తొమ్మిది రోజుల పాటు ఇళ్లలోనే ఉంచి చివరి రోజు చెరువులు, వాగుల్లో నిమజ్జనం చేస్తారు.
ప్రతి రోజు సాయంత్రం అలం కరించి.. దూపదీప నైవేద్యాలతో అర్చిస్తూ... బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ కోలాటం ఆడుతారు. బొడ్డెమ్మ పాటల్లో చందమా మను కలుపుతూ... పాడుకోవడం ప్రధానంగా కనిపిస్తుంది. బొడ్డెమ్మ తరువాత వచ్చే అమావాస్య నుంచి మహిళలు బతుకమ్మ సంబరాలను ప్రారంభి స్తారు. బొడ్డెమ్మ సంబురాల తరువాత మరుసటి రోజు పెత్ర అమావాస్య నుంచి చిన్న బతుకమ్మ సంబరాలు మొదలై పెద్ద బతుకమ్మతో ముగుస్తాయి. ఈసారి ఈనెల 21వ తేదిన అమవాస్య వస్తుండడంతో ఎంగిలిపూల బతుకమ్మ మొదలు కానుంది. పెద్ద బతుకమ్మ ఈనెల 30న జరుపుకోనున్నారు.
ఆడపడుచులు ఎదురుచూసే సంబరం
తంగేడు పువ్వు ముచ్చట్లు.. గునుగు పువ్వు సంబరాల.. మధ్య ఆడపడుచులు పుట్టింటికి తరలివచ్చే అనందోత్సాహంం. తెలంగాణ జిల్లాల్లో ఆడపడుచులందరూ బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తారు. బతుకమ్మ పండుగ అంటే మహిళలే కాదు ప్రకృతి కూడా పుకలరిస్తుంది. ఆడపడుచులు పుట్టింటికి వచ్చి సందడి చేసే బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది. బతుకమ్మ పండుగ రోజులు పల్లెబాటలకు ఇరువైపులా.. పసుపు పారబోయిసినట్లుగా తంగేడు.. ఏ దిక్కున చూసినా పలకరించే కట్ల పూలు, ప్రతి ఇంటి గడప ముందు కనిపించే మందారాలు, తలుపు సందుల్లో తొంగి చూసే గన్నేరు.. నేలంతా పరుచుకునే గుమ్మడి... ఇలా తీరొక్క రంగుల పూలతో పడుచుల్లో ఆనందాన్ని నింపుతాయి.
బతుకమ్మను ఆదిశక్తిగా పల్లెపల్లెలో ఏ తారతమ్యాలు లేకుండా ఆడపడుచులు జరుపుకుంటారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బతుకమ్మను మహిళలు తొమ్మిది రోజులపాటు జరుపుకుంటే.. మగవారంతా తంగేడు, గునుగు పూలను పచ్చిక బయల్లలోంచి సేకరించి తీసుకొస్తారు. ఇంటిల్లిపాది ఎంతో ఉత్సాహంగా బతుకమ్మను పేరుస్తారు. ఇలా చివరి రోజున పెద్ద బతుకమ్మ పేర్చి కొత్త బట్టలు ధరించి గౌరిదేవిని కీర్తిస్తూ ప్రధాన కూడలి వద్ద ఆడపడుచులు బతుకమ్మ ఆటపాట ఆడుతారు. చీకటనిదురబో బొడ్డెమ్మ నిద్రబోవమ్మా... నిద్రకు నూరేళ్లు... నీకు వెయ్యేళ్లు... పాలిచ్చే తల్లికి వెయ్యేళ్లు... నినుగన్న తల్లికి నిండా వెయ్యేళ్లు అంటూ... పెద్ద బతుకమ్మకు వీడ్కోలు పలుకుతారు. రకరకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆడపడుచులు పల్లెంలో తెచ్చిన నీటితో వాయినమమ్మా వాయినం.. అంటూ వాయినాలు ఇచ్చుకుంటారు.
బొడ్డెమ్మ పాట...
బొడ్డెమ్మ బొడ్డెమ్మా కోల్.. నీ బిడ్డ పేరేమీ కోల్..
నీ బిడ్డ పేరు నీలగౌరు కోల్..నిచ్చమల్ల చెట్టేసి కోల్..
నిచ్చమల్ల చెట్టుకు కోల్..రోజు నీళ్లు పోసి కోల్..
కాయళ్లు పిందె ళ్లు కోల్..ఘనమైన కాతకాసే కోల్..
కాయలన్ని తెంపి కోల్..కడవల్లో పోసి కోల్..
పిందెలన్ని తెంపి కోల్..బిందెల్లో పోసి కోల్..
పండ్లన్ని తె ంపి కోల్.. బండ్లల్లో పోసి కోల్..
అందులోని పండు తీసి కోల్.. ఢిల్లీకి పంపించి కోల్..
ఢిల్లీ డీప రాజు కోల్..మేడొకటి కట్టించే కోల్..
మేడలో ఉన్నది కోల్.. మేలు శ్రీగౌరి కోల్..
మేలుశ్రీశ్రీగౌరికి కోల్.. ఏమేమీ నగలు కోల్..
పెసర కాయ బెబ్బర్లు కోల్.. ఒంటి నిండా సొమ్ము కోల్..
కందికాయ బెబ్బర్లు కోల్..కాళ్లకు కడియాలు కోల్..
అన్ని సొమ్ములు పెట్టి కోల్..అద్దంలో చూసే కోల్..
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ
టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్
For TG News And Telugu News