Share News

Boddemma in Telangana: బొడ్డెమ్మ.. తెలంగాణ సాంప్రదాయానికి ప్రాణం

ABN , Publish Date - Sep 12 , 2025 | 09:06 AM

తెలంగాణ ప్రాంతానికే తలమానికంగా బాసిల్లుతూ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న సాంస్కృతిక పర్వం బతుకమ్మ. ఆ బతుకమ్మ పర్వానికి కచ్చితంగా తొమ్మిది రోజుల ముందు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమయ్యే వేడుకే బొడ్డెమ్మల పర్వం.

Boddemma in Telangana: బొడ్డెమ్మ.. తెలంగాణ సాంప్రదాయానికి ప్రాణం
Boddemma in Telangana

  • ఓరుగల్లు పల్లెల్లో మొదలైన బొడ్డెమ్మల సందడి

  • బతుకమ్మకు ముందు తొమ్మిది రోజుల వేడుక

  • బొడ్డెమ్మ పర్వంతో బతుకమ్మ సీజన్‌కు శ్రీకారం

  • బొడ్డెమ్మ వేడుకలకు పట్టణాల్లోనూ పురోగమనం

  • బతుకమ్మకు ముంగిట బొడ్డెమ్మల సందడి ప్రారంభం

  • తెలంగాణ పల్లెల్లో ప్రారంభమైన బొడ్డెమ్మ వేడుకలు

  • ధాన్యపు దేవత 'బొడ్డెమ్మ'కి గ్రామీణ తెలంగాణ ఘన స్వాగతం

హనుమకొండ కల్చరల్/వరంగల్ కల్చరల్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రాంతానికే తలమానికంగా బాసిల్లుతూ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న సాంస్కృతిక పర్వం బతుకమ్మ. ఆ బతుకమ్మ (Bathukamma) పర్వానికి కచ్చితంగా తొమ్మిది రోజుల ముందు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమయ్యే వేడుకే బొడ్డెమ్మల (Boddemma) పర్వం. భాద్రపద బహుళ పంచమి అయిన గురువారం నుంచి బొడ్డెమ్మల పర్వానికి శ్రీకారం చుట్టారు.


ఆధునికత ఎంత పెరిగినా పట్టణ ప్రాంతాలతో సహా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తుండటం విశేషం. బొడ్డెమ్మలు మహాలయ అమావాస్య వరకు అంటే బతుకమ్మ పండగ తొలినాటి వరకు జరుపుకొని బొడ్డెమ్మలను నిమజ్జనం చేసి బతుకమ్మలకు శ్రీకారం చుడుతారు. పెళ్లిగాని యువతులు, పిల్లలు వారితో పాటు ముత్తయిదువులు బతుకమ్మ పర్వానికి ఎంతో ప్రాధాన్యమిస్తారో ఈ బొడ్డెమ్మకు కూడా అదే ప్రాధాన్యంతో ఆడుకోవడం విశేషం.


బొడ్డెమ్మ అంటే..

బొడ్డెమ్మ అంటే ధాన్యరాశి, ధాన్యపు కుప్ప అని వాడుకలో ఉంది. బొడ్డెమ్మను పుట్ట మట్టితో అందంగా పేర్చి చెక్కపీటపై చతురస్రాకారంగా ఐదు దొంతరలుగా పేర్చి ఒకదానిపై ఒకటి త్రిభుజాకారంగా పేరుస్తారు. బొడ్డెమ్మను ఉద్రాక్ష, కాకర, కట్ల, బీర, మళ్లి, జాజిపూలతో అలంకరిస్తారు. ఆ తర్వాత శిఖర ప్రదేశాన బియ్యంతో నిండిన చిన్న కలశం, కొత్త వస్త్రం పెడతారు. తమలపాకు, పసుపు గౌరమ్మను ఉంచుతారు.

bathukamma2.jpg


సాయంకాలం ఇంటి ముందు అలికి ముగ్గులు పెట్టి ఒక్కోవాడకు ఒక్కరి చొప్పున అన్నట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో బొడ్డెమ్మను నిలుపుతారు. ఇరుగు పొరుగు వారు, కన్నెపిల్లలు వచ్చి చప్పట్లు కొడుతూ బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు. బతుకమ్మ పాటల మాదిరిగా బొడ్డెమ్మా.. బొడ్డెమ్మా వలలో.. బిడ్డాలెందరో వలలో అంటూ పాటలు కూడా ప్రత్యేకంగా పాడుకుంటారు. తొమ్మిది రోజులపాటు బొడ్డెమ్మను ఆడుకొని అమావాస్యకు ముందురోజు నీటిలో నిద్రబుచ్చి నిమజ్జనం చేయడం ఆనవాయితీ.


తొమ్మిది రోజులు.. ఆటపాటలు

తొమ్మిది రోజులు ఆటపాటల అనంతరం బొడ్డెమ్మను అందంగా అలంకరించి రాగి చెంబులో పోసిన బియ్యం, పప్పు, బెల్లం దినుసులను నైవేద్యంగా తయారు చేసి అందరికి ప్రసాదంగా పంచి చెరువులు, కుంటలు, బావుల్లో గాని బొడ్డెమ్మను నిమజ్జనం చేస్తారు. బొడ్డెమ్మ నిమజ్జనం ముగిసిన మరుసటి రోజు నుంచి బతుకమ్మ ప్రారంభమవుతుంది.

bathukamma.jpg


ఉమ్మడి జిల్లాలో..

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని గ్రామీణ ప్రాంతాల్లో బొడ్డెమ్మల సాంస్కృతిక పర్వం ప్రారంభమైంది. హనుమకొండ రాగన్న దర్వాజలో కూడా ప్రతియేటా ఆనవాయితీగా మాదిరిగా రజక సంఘం ఆధ్వర్యంలో బొడ్డెమ్మల వేడుకకు శ్రీకారం చుట్టారు. నగరాల్లోనూ అనేక చోట్ల బొడ్డెమ్మలకు శ్రీకారం చుట్టారు. ప్రాచీన సంస్కృతికి నిదర్శనంగా ఈ వేడుకలు జరుపుకోవడం తెలంగాణ ప్రాంతానికే ప్రత్యేకం. అందునా ప్రత్యేకించి వరంగల్ జిల్లా బతుకమ్మ, బొడ్డెమ్మ ఆటలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండడం విశేషం.

bathukamma-.jpg


ప్రాచీన పండుగకు ప్రభుత్వ ఆదరణేది?

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రాచీన పండుగలకు గుర్తింపు ఇచ్చిన ప్రభుత్వం బొడ్డెమ్మ పండుగను గుర్తించకపోవడం వలన పల్లెల్లో పండుగ ప్రాబల్యం తగ్గిపోతోంది. శాస్త్రీయంగా సైన్స్ పరంగా జరుపుకునే వేడుకల్లో బొడ్డెమ్మ ఒకటి. బొడ్డెమ్మ పండుగను ప్రభుత్వం గుర్తించి గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రోత్సహించాలని ప్రజలు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఉపాధ్యాయ దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటామో తెలుసా?

మహా నిమజ్జనం.. సర్వం సిద్ధం

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Sep 12 , 2025 | 09:18 AM