Maha Nimajjanam: మహా నిమజ్జనం.. సర్వం సిద్ధం
ABN , Publish Date - Sep 05 , 2025 | 07:21 AM
రేపు మహా నిమజ్జనం. హుస్సేన్‌సాగర్‌తో పాటు ఇతర చోట్ల వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాగర తీరంలోని ఎన్‌టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, సంజీవయ్య పార్కు వైపు ఇప్పటికే క్రేన్లు అందుబాటులో ఉన్నాయి. గురువారం ట్యాంక్‌బండ్‌పై పది క్రేన్లు ఏర్పాటు చేశారు.
- ఆయా కేంద్రాల వద్ద పూర్తయిన ఏర్పాట్లు
- ట్యాంక్‌బండ్‌పై అందుబాటులోకి క్రేన్లు
- సాగర తీరంలో 30 వరకు ఏర్పాటు
- ఆపరేషన్ ఖైరతాబాద్ మహా గణపతి..
- మధ్యాహ్నం 1.30కు పూర్తయ్యేలా ప్లాన్
- 30 వేల మంది సిబ్బందితో బందోబస్తు
- రేపు, ఎల్లుండి మద్యం విక్రయాలు బంద్
హైదరాబాద్ సిటీ: రేపు మహా నిమజ్జనం. హుస్సేన్‌సాగర్(Hussain Sagar)తో పాటు ఇతర చోట్ల వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాగర తీరంలోని ఎన్‌టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, సంజీవయ్య పార్కు వైపు ఇప్పటికే క్రేన్లు అందుబాటులో ఉన్నాయి. గురువారం ట్యాంక్‌బండ్‌పై పది క్రేన్లు ఏర్పాటు చేశారు. నిమజ్జన ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి, భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ తదితర సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేసిన మర్నాడే ప్రభుత్వ విభాగాలు రంగంలోకి దిగాయి. క్రేన్లు, కంట్రోల్ రూమ్‌లు, మెడికల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్లు, తదితర సదుపాయాలు ఏర్పాటు చేశాయి. సరూర్‌నగర్, ఐడీఎల్, సఫిల్‌గూడ, సున్నం చెరువుతోపాటు 20 ప్రాంతాల్లో భారీ విగ్రహాల నిమజ్జనం జరగనుంది. మొత్తంగా 134 మొబైల్, 259 స్టాటిక్‌తో కలిపి 403 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఇందులో సాగర తీరం చుట్టూ 30 వరకు క్రేన్లు ఉన్నాయని ఓ అధికారి చెప్పారు. ఇప్పటికే 1.25 లక్షల విగ్రహాలు (చిన్నవి, పెద్దవి) నిమజ్జనమైనట్టు జీహెచ్‌ఎంసీ పేర్కొంది.
303 కి.మీల శోభాయాత్ర
బాలాపూర్(Balapur) నుంచి హుస్సేన్‌సాగర్ వరకు 19 కి.మీల ప్రధాన మార్గంతో పాటు.. గ్రేటర్ వ్యాప్తంగా 303 కి.మీల మేర శోభాయాత్ర జరగనుంది. ఈ మార్గాల్లో ఇప్పటికే 11,442 గుంతలు పూడ్చామని బల్దియా ప్రకటించింది. పారిశుధ్య నిర్వహణ కోసం 160 గణేశ్ యాక్షన్ టీంలు అందుబాటులో ఉండనున్నాయి. 14,486 మంది పారిశుధ్య కార్మికులు నిమజ్జనం రోజున విధుల్లో ఉంటారు. శోభాయాత్ర మార్గాల్లో అదనపు విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. సాగర్‌లో తొమ్మిది బోట్లు, ఇతర ప్రాంతాల్లోనూ బోట్లతోపాటు గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారు.
ఆపరేషన్ ఖైరతాబాద్
ఖైరతాబాద్(Khairatabad)లోని విశ్వశాంతి మహాశక్తి గణపతి నిమజ్జనంపై ప్రభుత్వ విభాగాలు ప్రత్యేక దృష్టి సారించాయి. నిమజ్జన ఘట్టంలో కీలకమైన ఈ ఏకదంతున్ని గంగ ఒడికి తరలించేందుకు కొన్నేళ్లుగా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో రేపు కూడా మధ్యాహ్న 1.30 గంటల వరకు మహా గణపతి నిమజ్జనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతోపాటు బాలాపూర్ గణపతి కూడా సాయంత్రం లోపు సాగర తీరానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు.

25 అడుగుల లోతు పూడికతీత
మహా గణపతి నిమజ్జనం సందర్భంగా హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో హుస్సేన్‌సాగర్‌లో 25 అడుగుల లోతు వరకు పూడిక తీశారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి నుంచి గణనాథుడి ఎత్తు, వెడల్పు ఇలా కొలతలు తీసుకొని ఆ మేరకు పూడిక తీత ప్రక్రియను పూర్తి చేశారు. గురువారం వరకు 2వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించారు.
శోభాయాత్రకు పుష్కలంగా నీళ్లు
మహా నిమజ్జనం రోజున భక్తులకు తాగునీటికి ఢోకా లేకుండా వాటర్‌బోర్డు చర్యలు చేపట్టింది. అధికారులు నగరవ్యాప్తంగా 123 వాటర్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. 35 లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నారు. శోభయాత్ర కొనసాగే ప్రాంతాల్లో మ్యాన్‌హోల్ మూతలు పరిశీలించి అవసరమైన చోట్ల మరమ్మతు పనులు పూర్తి చేశారు. వాటర్ లీకేజీలు, సీవరేజీ ఓవర్‌ఫ్లోలు లేకుండా తగు చర్యలు చేపడుతున్నారు.
.
విద్యుత్‌శాఖ కంట్రోల్ రూమ్
హుస్సేన్ సాగర్ వద్ద దక్షిణ తెలంగాణ విద్యుత్ సంస్థ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమును గురువారం సంస్థ డైరెక్టర్‌లు నర్సింహులు, చక్రపాణి, కృష్ణారెడ్డి ప్రారంభించారు. దాదాపు 9 వేల మంది సిబ్బంది, అధికారులు నిమజ్జనం ముగిసేవరకు విధుల్లో ఉంటారని తెలిపారు.
44 వైద్య ఆరోగ్య శిబిరాలు
నిమజ్జనం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వెంకటి తెలిపారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు పరిసరాల అన్ని మార్గాల్లో దాదాపు 44 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అత్యవసర పరిస్థితులో రోగులను ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు తరలించడానికి అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
30 వేల మంది సిబ్బందితో బందోబస్తు
నిమజ్జనం రోజున 30 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలీసు విభాగాల సిబ్బంది. పారామిలిటరీ, రిజర్వ్ ఫోర్స్‌తో పాటు జిల్లాల నుంచి పోలీసు సిబ్బంది, అధికారులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నిమజ్జనాల మధ్యలో ప్రవక్త పుట్టిన రోజు (మిలాద్‌ఉల్‌నబీ) రావడంతో పాటు నిమజ్జనానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పర్యటన సందర్భంగా బలగాలను అప్రమత్తం చేశారు.
దాదాపు 40 గంటల
పాటు జరిగే నిమజ్జనాన్ని ఉన్నతాధికారులు కమాండ్ కంట్రోల్ రూము ద్వారా పర్యవేక్షిస్తారు. కాగా, సెప్టెంబరు 6 ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నగరంలో మద్యం, కల్లు, విక్రయాలు నిలిపి వేయాలని సీపీలు ఆదేశించారు
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించాలి
‘గే’ యాప్ ‘గ్రైండర్’ ద్వారా డ్రగ్స్ విక్రయం
Read Latest Telangana News and National News