Share News

Ananthapur News: ప్రాణాలు తీసిన పొగమంచు..

ABN , Publish Date - Dec 03 , 2025 | 01:50 PM

పొగమంచు... నిండు ప్రాణాలను బలిగొన్నది. కారులో వెళ్తున్న వారికి పొగమంచు కారణంగా రోడ్డు కనబడకపోవడంతో ప్రమాదానికి గురయ్యారు. దీంతో భార్యాభర్తలిద్దరూ మృతిచెందారు. కాగా.. వారి మరణంతో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోగా చిన్నారులిద్దరూ అనాథలుగా మిగిలిపోయారు.

Ananthapur News: ప్రాణాలు తీసిన పొగమంచు..

- కర్ణాటకలో డివైడర్‌ను ఢీకొట్టిన కారు

- గుడ్డంపల్లికి చెందిన దంపతుల మృతి

మడకశిర(అనంతపురం): మండల పరిధిలోని గుడ్డంపల్లి గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి(41), జ్యోతి(35) దంపతులు కర్ణాటక(Karnataka)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వారి కుమారుడు మధుసూదన్‌ రెడ్డి, మరో వ్యక్తి చిదంబర రెడ్డి గాయపడ్డారు. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో హొసకేరి వద్ద కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణారెడ్డి రెండేళ్ల క్రితం బెంగళూరుకి వలస వెళ్లారు. అక్కడ కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.


pandu2.jpg

స్వగ్రామం గుడ్డంపల్లిలో బంధువుల పెళ్ళి ఉండంతో శనివారం తన భార్య, కుమారులు మధుసూదన్‌ రెడ్డి, విష్ణువర్ధన్‌ రెడ్డితో కలిసి వచ్చారు. పెద్ద కుమారుడు మధుసూదన్‌ రెడ్డికి బెంగళూరు(Bengaluru)లో పరీక్ష ఉండటంతో మరో వ్యక్తి చిదంబర రెడ్డితో కలసి సోమవారం తెల్లవారు జామున కారులో బెంగళూరుకు బయలుదేరారు. గుడ్డంపల్లి నుంచి 30 కి.మీ. ప్రయాణించాక ప్రమాదం జరిగింది. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు కుమారులు దిక్కులేనివారయ్యారు. మధు హాసన్‌లో ఇంటర్‌ చదువుతుండగా, విష్ణు బెంగళూరులో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రమాదంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్నికల నిర్వహణకు డబ్బులేవి?

పట్టుబట్టి.. మంజూరు చేయించి...

Read Latest Telangana News and National News

Updated Date - Dec 03 , 2025 | 01:50 PM