Election Funds Delay: ఎన్నికల నిర్వహణకు డబ్బులేవి?
ABN , Publish Date - Dec 03 , 2025 | 03:58 AM
గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ క్షేత్రస్థాయి అధికారులకు భారంగా మారింది. ఎస్‌ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా చేపడతామని...
ఉత్తర్వులిచ్చారు.. నిధులు విడుదల కాలేదు
ఎన్నికల ఖర్చుపై అధికారుల్లో ఆందోళన
పంచాయతీ కార్యదర్శులపైనే భారం!
తక్షణమే నిధులు విడుదల చేయాలి
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌కు ఎంపీడీవోల వినతి
హైదరాబాద్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ క్షేత్రస్థాయి అధికారులకు భారంగా మారింది. ఎస్‌ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా చేపడతామని, అయితే నిర్వహణకయ్యే ఖర్చులకోసం నిధులేవి? అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలసంఖ్య ఆధారంగా మండలానికి రూ.5 నుంచి 10లక్షల చొప్పున అవసరం అవుతున్నాయి. గ్రామ పంచాయతీలకు గత రెండేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రావడంలేదు. దీనికితోడు అధికశాతం మండల పరిషత్తులలో జనరల్ ఫండ్‌కూడా లేకపోవడంతో ఎన్నికల ఏర్పాట్లకు ప్రస్తుతం నిధుల కటకట నెలకొంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ.. ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికీ ఆ నిధులు విడుదల కాకపోవడంతో నిర్వహణ ఖర్చులను మండలస్థాయి అదికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులే భరించాల్సి వస్తోంది. సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికలకోసం ఓటరుజాబితా వెల్లడినుంచి.. పంచాయతీల వారీగా ఆయాస్థానాల్లో రిజర్వేషన్లు, అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితాల ప్రచురణ వంటివి చేపట్టారు. అదేవిధంగా నామినేషన్ల స్వీకరణ మొదలు పోలింగ్, ఫలితాల వెల్లడివరకు అయ్యే ఖర్చులకు నిధులు రాకపోవడంతో వాటిని ఎలా భరించాలో అర్థం కావడంలేదనే ఆందోళన కిందిస్థాయి అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. జిల్లాకేంద్రం నుంచి ఎన్నికలసామగ్రిని తీసుకొచ్చేందుకు వాహనాల అద్దెలు, పంచాయతీలకు ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణకోసం రవాణా చార్జీలు, పోలింగ్ కేంద్రాల నిర్వహణ, సిబ్బందికి భోజనాలు తదితర ఖర్చులకు డబ్బులు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పోటీలో ఉండే అభ్యర్థుల తుదిజాబితా వెల్లడివంటి వాటికోసం.. ఓటరు జాబితాల ప్రింటింగ్, స్టేషనరీ, జిరాక్సులు, ఇతర వస్తుసామగ్రి కొనుగోలు చేయాల్సిన తక్షణ అవసరాలకు ప్రభుత్వ అధికారులే సర్దుబాటు చేయాల్సి వస్తోంది. సర్పంచ్, వార్డుసభ్యుల స్థానాలకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు నాలుగైదు గ్రామాలకు ఒకటిచొప్పున క్లస్టర్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఒక్కో మండలంలో ఐదునుంచి పదివరకు కేంద్రాలు ఏర్పాటుచేసి నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. అక్కడ ఎన్నికల అధికారులు, గ్రామపంచాయతీల సిబ్బంది, పోలీసులు, ఇలా 20మంది వరకు పనిచేస్తుంటారు. వారికి భోజనం, వసతిసౌకర్యాల భారమంతా సంబంధిత పంచాయతీ కార్యదర్శులపైనే పడనుండటం గమనార్హం.
గ్రామపంచాయతీ, మండలపరిషత్తుల పరిధిలో నిధులలేమి, ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఎన్నికల నిర్వహణకోసం మంజూరైన నిధులను వంద శాతం ఒకేసారి విడుదలచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ సృజనకు ఎంపీడీవోలు విజ్ఞప్తిచేశారు. ఈమేరకు తెలంగాణ మండల పరిషత్తు అధికారులు, సెంట్రల్ అసోసియేషన్ ఫోరం అధ్యక్షురాలు జె.పద్మావతి, పలువురు ఎంపీడీవోలు సృజనను కలిసి వినతి పత్రం సమర్పించారు. నిధుల విడుదలలో ఏసీ/డీసీ (అడ్వాన్స్ కన్సాలిడేషన్/డైరెక్ట్ క్రెడిట్) నిబంధనలు అమలు చేయడంవల్ల క్షేత్రస్థాయిలో పలు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుందని, ఇందుకుగాను ఏకమొత్తంలో గ్రాంట్ ఇవ్వాలని వారు కోరారు. స్టేషనరీ, హ్యాండ్‌బుక్స్, ఎన్నికల సామగ్రి తరలించేందుకు వాహనాల అద్దె, సిబ్బందికి భోజన, వసతిసౌకర్యాలు వంటివి కల్పించేందుకు పాక్షికంగా గ్రాంటు విడుదలచేస్తే.. తక్కువ సమయంలో వనరులను సమీకరించుకోవడం కష్టమవుతుందని తెలిపారు.