Minister Tummala Nageswara Rao: పట్టుబట్టి.. మంజూరు చేయించి
ABN , Publish Date - Dec 03 , 2025 | 04:13 AM
యూనివర్సిటీ లేని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టుబట్టి మరీ ప్రభుత్వ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు...
ఎర్త్ వర్సిటీని ప్రారంభింపజేసిన మంత్రి తుమ్మల
ఫలించిన కృషి.. నెరవేరిన విశ్వ విద్యాలయ కల
ఖమ్మం/కొత్తగూడెం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీ లేని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టుబట్టి మరీ ప్రభుత్వ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కొత్తగూడెం మైనింగ్ కళాశాలను యూనివర్సిటీగా అభివృద్ధి చేయాలని రెండున్నర దశాబ్దాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. 1976లో సింగరేణి మైనింగ్ కళాశాలగా ఏర్పడిన ఈ కాలేజీని 1994లో మంత్రిగా ఉన్న తుమ్మల.. కాకతీయ వర్సిటీ పరిధిలోకి తీసుకువెళ్లి ఇంజనీరింగ్ కాలేజీగా అభివృద్ధి చేశారు. మైనింగ్ కోర్సుతో పాటు ఇతర టెక్నికల్ కోర్సులను బోధించేలా చర్యలు తీసుకున్నారు. సుమారు 300 ఎకరాలపైగా భూమి ఉన్న ఈ కాలేజీని వర్సిటీగా అభివృద్ధి చేయాలని తుమ్మల భావించారు. అప్పట్లో అది సాధ్యం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల బాధ్యతలు చేపట్టడంతో ఆయన ఆలోచన కార్యరూపం దాల్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని పలువురు విద్యావంతులతో ఆయన చర్చించారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌దృష్టికి తీసుకువెళ్లి.. వర్సిటీ ఏర్పాటుతో జరిగే ప్రయోజనాలను చర్చించారు. ఆ విద్యాలయానికి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ పేరును సూచించారు. వర్సిటీ ప్రతిపాదన, మంజూరు, ప్రారంభం కోసం తుమ్మల పట్టువదలని విక్రమార్కుడిలా కృషి చేశారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల కల నెరవేరింది. మంగళవారం జరిగిన ప్రారంభోత్సవ సభలో విశ్వవిద్యాలయ ఏర్పాటులో మంత్రి తుమ్మల చేసిన కృషిని సీఎం రేవంత్ ప్రశంసించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడు.. స్పందించిన సీఎం
బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. గాంధీ భవన్ వద్ద మోహరించిన పోలీసులు
For More TG News And Telugu News