Share News

Agricultural Dept : ఇంకా.. అదే విధేయత!

ABN , Publish Date - Jan 22 , 2025 | 04:42 AM

రాష్ట్రంలో వైసీపీ పాలన ముగిసి ఆరు నెలలు దాటినా.. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఇంకా ఆ పార్టీకి వీర విధేయత చూపుతూనే ఉన్నారు..!

Agricultural Dept : ఇంకా.. అదే విధేయత!

  • 674 కిసాన్‌ డ్రోన్లు వైసీపీ వాళ్లకే..

  • రూ.10 లక్షల పరికరానికి రూ.8 లక్షల సబ్సిడీ

  • ఏడాదిన్నర క్రితం జాబితాకే ప్రాధాన్యమివ్వండి

  • అవసరమైతే ఎమ్మెల్యేలకు సర్దిచెప్పి ఒప్పించండి

  • జేడీలకు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశం

  • భగ్గుమంటున్న ఎమ్మెల్యేలు.. విషయం మంత్రి దృష్టికి

  • లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా ఉండాలన్న అచ్చెన్న

(గుంటూరు సిటీ - ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో వైసీపీ పాలన ముగిసి ఆరు నెలలు దాటినా.. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఇంకా ఆ పార్టీకి వీర విధేయత చూపుతూనే ఉన్నారు..! కూటమి సర్కారు రైతులకు సబ్సిడీపై పంపిణీ చేయతలపెట్టిన కిసాన్‌ డ్రోన్లను పూర్తిగా వైసీపీ వారికే కట్టబెట్టాలని చూస్తున్నారు..! ఈ డ్రోన్ల పంపిణీ జాబితా సిద్ధం చేయడానికి సంబంధించి జిల్లాల వ్యవసాయ అధికారులతో ఏర్పాటు చేసిన జూమ్‌ మీటింగ్‌లో ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. డ్రోన్ల పంపిణీలో ఏడాదిన్నర క్రితం ఎంపిక చేసిన జాబితాకే తొలి ప్రాధాన్యతనివ్వాలని ఉన్నతాధికారులు జేడీలకు సూచించారు. ఆ విషయంలో అవసరమైతే స్థానిక ఎమ్మెల్యేలకు సర్దిచెప్పి ఒప్పించాలని కూడా ఆదేశించారు. ఈ ఆదేశాలతో జిల్లా, మండల స్థాయి వ్యవసాయ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

వైసీసీ హయాంలోనే గ్రూపుల ఎంపిక

జగన్‌ ప్రభుత్వం ఉన్నప్పుడే కిసాన్‌ డ్రోన్లు పంపిణీకి సంబంధించి మొత్తం జాబితాలను రూపొందించారు. మొత్తం 674 గ్రూపులను ఎంపిక చేశారు. ఐదుగురు రైతులను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి వారిలో ఒకరికి డ్రోన్‌ పైలెట్‌గా శిక్షణ కూడా ఇప్పించారు. ఆర్భాటంగా గ్రూపులను ఎంపిక చేశారు కానీ డ్రోన్ల కొనుగోలుకు నిధులు మాత్రం విడుదల చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో ఖర్చు తగ్గించేందుకు కిసాన్‌ డ్రోన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా గతంలో ఎంపిక చేసిన 674తోపాటు మరో 201 కలిపి తొలి విడతలో మొత్తం 875 డ్రోన్లు అందించేందుకు సిద్ధమైంది. డ్రోన్‌ ఏ కంపెనీది కొనుగోలు చేయాలి అన్న విషయం తేల్చేందుకు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీలో నెల రోజుల నుంచి పరిశీలనా కసరత్తు జరుగుతోంది.


ఈ పరిశీలన అనంతరం ఒక కంపెనీని ఎంపిక చేసి రైతులకు డ్రోన్లు సరఫరా చేసేందుకు రూ.70 కోట్లు ముందుగానే మంజూరు చేసింది. సుమారు రూ.10 లక్షల విలువ చేసే డ్రోన్‌ను రైతులకు కేవలం రూ.2 లక్షలకే అందజేస్తారు. మిగిలిన రూ.8 లక్షలు ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుంది. ఈ నేపథ్యంలో అర్హులైన రైతులను ఎంపిక చేయాలని ఆదేశించింది.

పాత జాబితాలో వైసీపీ వారికే అందలం

తాజాగా అర్హులను ఎంపిక చేయాల్సిన వ్యవసాయ శాఖ.. జగన్‌ ప్రభుత్వంలో రూపొంచిన 674 గ్రూపుల జాబితా ఆధారంగా ముందుకెళ్లేందుకు సిద్ధపడింది. పాత జాబితాలో ఉన్న వ్యక్తికి డ్రోన్‌ నిర్వహణపై 12 రోజులు శిక్షణ ఇచ్చామని, కాబట్టి వారికే వాటిని అందిస్తే బాగుంటుందని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అప్పట్లో వైసీపీకి అనుకూలంగా ఉన్న వారికే జాబితాలో ప్రాధాన్యత కల్పించారు. టీడీపీ, జనసేన, బీజేపీకి సానుభూతిపరులుగా ఉన్న రైతులను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో పాత జాబితాతో ముందుకెళ్లాలన్న వ్యవసాయశాఖ ఆదేశాలపై ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. డ్రోన్‌ నిర్వహణకు అవసరమైన శిక్షణ 12 రోజుల్లో ఇవ్వొచ్చు. కానీ.. శిక్షణ సాకుతో వైసీపీ వాళ్లకు లబ్ధి చేకూర్చాలని ఎందుకు చూస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన అధికాకాలను హెచ్చరించారు. లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా జరగాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత

Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..

CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 22 , 2025 | 04:42 AM