Share News

Flexi Controversy: వైసీపీకి మరో షాక్.. వివాదాస్పద ఫ్లెక్సీపై కేసు నమోదు

ABN , Publish Date - Dec 22 , 2025 | 10:29 AM

మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వ్యహహారానికి సంబంధించి ఏడుగురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Flexi Controversy: వైసీపీకి మరో షాక్.. వివాదాస్పద ఫ్లెక్సీపై కేసు నమోదు
YCP Flexi Controversy

ఏలూరు జిల్లా, డిసెంబర్ 22: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy) పుట్టిన రోజు సందర్భంగా జిల్లాలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీనిపై వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులు వైసీపీకి చెందిన పలువురు నేతలపై కేసు నమోదు చేశారు. ద్వారకాతిరుమల మండలం రామసింగవరంలో మాజీ సీఎం వైఎస్ జగన్ బర్త్‌డే సందర్భంగా వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.


ఫ్లెక్సీలో అభ్యంతరకర వ్యాఖ్యలు ఉండటంతో దాన్ని తీసివేయాలని స్థానికులు కోరారు. అయితే వైసీపీకి చెందిన నేతలు ఫ్లెక్సీని తీయకపోవడమే కాకుండా బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. స్థానికుల ఫిర్యాదుతో వైసీపీకి చెందిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్లెక్సీ వివాదంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. అంతేకాకుండా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.


కాగా.. తమ అధినేత పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు బీభత్సం సృష్టించారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పాటు, మూగజీవాలను బలి ఇచ్చి వాటి రక్తంతో జగన్‌ ఫ్లెక్సీలకు అభిషేకాలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2029లో రప్పా రప్పా అని.. మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే గంగమ్మ జాతరే అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రోడ్లపై అరపులు, కేకలతో భయానక వాతావరణం సృష్టించారు. అనంతపురం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడ్డారు.


అటు నరసారావుపేటలో వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. దీంతో కోపంతో ఊగిపోయిన వైసీపీ కార్యకర్తలు.. ఆ ఫ్లెక్సీలను టీడీపీ నేతలు తొలగించారంటూ వారిపై కర్రలతో దాడికి తెగబడ్డారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంతేకాకుండా సత్యసాయి జిల్లాలో మరో దారుణానికి పాల్పడ్డారు వైసీపీ నేతలు. జగన్ పుట్టిన రోజు సందర్భంగా టపాసులు కాలుస్తున్న ఆ పార్టీ శ్రేణులను ఓ గర్భిణి అడ్డుకుంది. పక్కకెళ్లి కాల్చుకోవాలని సూచించిన ఆమెపై ఓ వైసీపీ కార్యకర్త చేయిచేసుకున్నాడు. కింద పడిపోయిన గర్భిణిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఓ గర్భిణిపై వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో అక్రమార్కుల తిష్ఠ.. నిర్లక్ష్యం నీడలో నిఘా

శంషాబాద్ ఎయిర్‌పోర్టు‌కు మరోసారి బాంబు బెదిరింపులు..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 22 , 2025 | 11:16 AM