Share News

Hyderabad: హైదరాబాద్‌లో అక్రమార్కుల తిష్ఠ.. నిర్లక్ష్యం నీడలో నిఘా

ABN , Publish Date - Dec 22 , 2025 | 08:42 AM

ఎస్ఆర్ఆర్త్వో, డీఆర్ఎ, ఐబీ పోలీసుల నిఘా కొరవడడంతో విదేశాలకు చెందిన కొందరు అక్రమార్కులు నగరంలో తిష్ఠవేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది స్వదేశీ నేరగాళ్లతో కలిసి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఐడెంటిటీ మార్చుకుంటున్నారు.

Hyderabad: హైదరాబాద్‌లో అక్రమార్కుల తిష్ఠ.. నిర్లక్ష్యం నీడలో నిఘా
Hyderabad

  • 70 వేలమంది రోహింగ్యాలు

  • 700 మంది నైజీరియన్స్

  • సైబర్ నేరాలకు పాల్పడుతున్న వైనం

  • నిఘా వ్యవస్థల మధ్య సమన్వయలోపమే కారణమా?

హైదరాబాద్, డిసెంబరు 22: దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యాకలాపాలు వెలుగులోకి వచ్చినా, పేలుళ్లు, కాల్పుల ఘటనలు జరిగినా నగరం ఉలిక్కిపడాల్సి వస్తోంది. ఉగ్రవాద సానుభూతి పరులకు నగరంతో ఏదోలా లింకు ఉన్నట్లు వెలుగులోకి వస్తుండడమే అందుకు కారణం. ఆస్ట్రేలియాలో జరిగిన ఉగ్ర కాల్పుల ఘటనకు సంబంధించిన నిందితుడికి హైదరాబాద్ సంబంధం ఉందని తేలింది. ఈ క్రమంలో ఆక్రమార్కులు నగరంలోకి ఎలా ప్రవేశిస్తున్నారు..? నిఘా వ్యవస్థల మధ్య సమన్వయ లోపాలే వారికి వరంగా మారాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


వీసా గడువు ముగిసినా..

విజిటింగ్, స్టూడెంట్, మెడికల్, బిజినెస్ వీసాలతో భారత్‌కు వస్తున్న నైజీరియన్స్. వీసా గడువు ముగిసినా ఇక్కడే అక్రమంగా ఉంటూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. నైజీరియా, ఉగాండా, కజకిస్థాన్ దేశాలకు చెందిన వారు సుమారు 700 మంది నగరంలో అక్రమంగా ఉంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పలు కేసుల్లో అరెస్టయిన నైజీరియన్స్‌ను పోలీసులు ఎస్ఆర్ఆర్వో సహకారంతో తిరిగి వారి దేశానికి డిపోటేషన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ట్రై కమిషనరేట్స్ పోలీసులు 30 మంది నైజీరియన్ నేరస్థు లను దేశం నుంచి బహిష్కరించారు.


స్థానికత కోసం అడ్డదారులు

హైదరాబాద్‌లో అక్రమంగా ఉంటున్న విదేశీయుల్లో రోహింగ్యాలు సుమారు 70 వేలమంది ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. పదేళ్లలో వీరి సంఖ్య విపరీతంగా పెరిగిపోయినట్లు తెలిసింది. వారు బాలాపూర్, పహాడిషరీఫ్, మీర్‌పేట, ఓల్డ్ సిటీలో ఉంటున్నట్లు తెలుస్తోంది. స్థానికత కోసం అడ్డదారిలో దళారులను పట్టుకొని ఆధార్, ఓటర్ ఐడీ కార్డులు సంపాదిస్తున్నారు.


ప్రత్యేక నిఘా ఉందా?

ఆపరేషన్ సిందూరు సమయంలో విదేశీ అక్రమార్కుల కోసం పోలీసులు జల్లెడ పట్టారు. నగరంలో 208 మంది పాకిస్థానీలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. విదేశీయులు ఎవరైనా నగరానికి వచ్చినప్పుడు ఫారిన్ రీజినల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వివరాలు నమోదు చేస్తారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కు చెందిన వారు నగరానికి వచ్చినప్పుడు పురానీ హవేలీలో ఉన్న స్పెషల్ పోలీస్ విభాగంలో వివరాలు నమోదు చేసుకుంటారు. దాంతో నగరంలో వారి కదలికలపై పోలీసుల ప్రత్యేక నిఘా ఉంటుంది.

స్పెషల్ విభాగంలోని సమాచారం మేరకు నగరంలో 208 మంది పాకిస్థానీలు ఉండగా.. లాంగ్ టర్మ్ వీసా కలిగిన వారు 156, షార్ట్ టర్మ్ వీసా ఉన్న వారు 13 మంది, విజిటింగ్, మెడికల్, బిజినెస్ వీసాల పై ఉన్నవారు 39 మంది ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. నగరాన్ని సేఫ్, షెల్టర్ జోన్‌గా వాడుకుంటున్న విదేశీ అక్రమార్కులు, ఉగ్రవాద సానుభూతి పరులు ఇక్కడ నెలల తరబడి తలదాచుకుంటున్నట్లు అధికారులే చెబుతున్నారు. ఇటీవల పదుల సంఖ్యలో బంగ్లాదేశ్ ముఠాలను పోలీసులు పట్టుకున్నారు.


శాఖల మధ్య సమన్వయ లోపం

ఎస్ఆర్ఆర్త్వో, డీఆర్ఎ, ఐబీ పోలీసుల నిఘా కొరవడడంతో విదేశాలకు చెందిన కొందరు అక్రమార్కులు నగరంలో తిష్ఠవేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది స్వదేశీ నేరగాళ్లతో కలిసి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఐడెంటిటీ మార్చుకుంటున్నారు. తరచూ వివిధ నగరాలకు మకాం మార్చుతూ నేరాలకు ప్పాలడుతున్నారు. పట్టుబడుతున్న విదేశీయుల్లో పాకిస్థాన్, బంగ్లాదేశ్, నైజీరియా, గినియా, కజకిస్థాన్, ఆఫ్రికా దేశాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది.


టోలీచౌకి, లంగర్ హౌస్, సన్ సిటీ, గోల్కొండ, బండ్లగూడ తదిర ప్రాంతాల్లో వీరు ఎక్కువగా ఉంటున్నట్లు సమాచారం. ఒక దేశానికి చెందిన వ్యక్తి మరో దేశానికి వెళ్లడానికి అన్ని అనుమతులు తీసుకోగానే మొదట డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఎ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), ఫారిన్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎస్ఆర్ఆర్వో)కు సమాచారం వెళ్తుంది. తర్వాత వారు ఎక్కడున్నారు.? ఏం చేస్తున్నారు..? వీసా గడువు ఎప్పటితో ముగుస్తుంది..? ఇంకా దేశం విడిచి వెళ్లకుండా ఏం చేస్తున్నారు.? అనేది నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ శాఖల మధ్య సమన్వయలోపంతో విదేశీ అక్రమార్కుల గుర్తించి పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమలలో ఉన్నతస్థాయి సమీక్ష.. హాజరు కానున్న మంత్రులు

పెరుగు అన్నం మంచిదా..? మజ్జిగ అన్నం మంచిదా..?

For More TG News And Telugu News

Updated Date - Dec 22 , 2025 | 08:48 AM