Share News

TTD: తిరుమలలో ఉన్నతస్థాయి సమీక్ష.. హాజరు కానున్న మంత్రులు

ABN , Publish Date - Dec 22 , 2025 | 07:50 AM

తిరుమలలో ఉన్నతస్థాయి సమీక్ష జరగనుంది. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు వంగలపూడి అనిత, ఆనం రామనారాయణ రెడ్డి హాజరుకానున్నారు.

TTD: తిరుమలలో ఉన్నతస్థాయి సమీక్ష.. హాజరు కానున్న మంత్రులు

తిరుమల, డిసెంబర్ 22: తిరుమలలో కొలువుదీరిన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఆయనను దర్శించుకునేందుకు నిత్యం తిరుమలకు భక్తులు పోటెత్తుతారు. ఇక ముక్కోటి ఏకాదశి వస్తే వైకుంఠ ద్వార దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తారు. ముక్కోటి ఏకాదశి సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో వైకుంఠద్వార దర్శనాలపై సోమవారం తిరుమలలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితతోపాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరుకానున్నారు. టీటీడీ ఉన్నతాధికారులతోపాటు జిల్లా యంత్రాంగంతో ఈ ఏర్పాట్లపై మంత్రులు సమీక్షించనున్నారు.


డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే మొదటి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులకు టీటీడీ టోకెన్లు కేటాయించింది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ 164 గంటల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని ఇప్పటికే టీటీడీ నిర్ణయించింది. ఈ - డిప్‌లో టోకెన్లు పొందిన భక్తులకు తొలి 3 రోజులు స్వామి వారి దర్శనాలను టీటీడీ కల్పించనుంది.


మిగిలిన ఏడు రోజుల్లో ఎటువంటి టోకెన్స్ లేకుండానే భక్తులకు వైకుంఠద్వార దర్శనాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ వైకుంఠ ద్వార దర్శనాలు 10 రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో తిరుమలకు తరలి వచ్చే భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు.. అన్నప్రసాద వితరణతోపాటు పారిశుద్ధ్యంపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ పకడ్బందీ ఏర్పాట్లు సైతం చేస్తోంది.


గతేడాది ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుపతిలో టోకెన్ల తీసుకునేందుకు భారీగా భక్తులు క్యూ లైన్‌లో నిలిచి ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందుకోసం టీటీడీ ఉన్నతాధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

దామరవంచలో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు

పెరుగు అన్నం మంచిదా..? మజ్జిగ అన్నం మంచిదా..?

For More AP News And Telugu News

Updated Date - Dec 22 , 2025 | 07:58 AM