Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ABN , Publish Date - Dec 22 , 2025 | 09:35 AM
మంచిర్యాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మహారాష్ట్ర నుంచి కూలీలతో వస్తున్న బొలేరో వాహనాన్ని లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
మంచిర్యాల, డిసెంబర్ 22: రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. అధిక వేగం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్ కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి వచ్చే వరకు నమ్మకం లేకుండాపోతున్న పరిస్థితి. అసలు ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో తెలియడం లేదు. పెద్ద ప్రమాదాలు జరిగి ప్రాణాలతో బయటపడి మృత్యుంజయులుగా ఉన్న వారు ఎందరో ఉండగా.. చిన్న ప్రమాదాలకు ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా కూడా ఎక్కడో చోట ప్రమాదాలు జరిగి అనేక మంది మరణిస్తున్నారు. తాజాగా తెలంగాణ జిల్లా మంచిర్యాలలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే...
జిల్లాలోని ఇందారం క్రాస్ రోడ్డు వద్ద ఈరోజు (సోమవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బొలెరోను వేగంగా దూసుకొచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వరి నాట్లు వేసేందుకు మహారాష్ట్ర నుంచి కరీంనగర్ జిల్లాకు 23 మంది కూలీలు బొలెరోలు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇందారం క్రాస్ వద్ద బొలెరో వాహనం కొద్దిసేపు ఆగింది. ఇంతలో అనుకోని ప్రమాదం వారిని వెంటాడింది. ఓ లారీ అతి వేగంగా దూసుకొచ్చి బొలెరోను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో అక్రమార్కుల తిష్ఠ.. నిర్లక్ష్యం నీడలో నిఘా
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు..
Read Latest Telangana News And Telugu News