Share News

Nara Lokesh: విశాఖకు 5 లక్షల ఐటీ ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి లోకేష్

ABN , Publish Date - Dec 12 , 2025 | 03:00 PM

విశాఖకు 5 లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. కాగ్నిజెంట్‌లో పనిచేసే ఉద్యోగులంతా విశాఖ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని సూచించారు.

Nara Lokesh: విశాఖకు 5 లక్షల ఐటీ ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి లోకేష్
Minister Nara Lokesh

విశాఖపట్నం, డిసెంబర్ 12: అంతర్జాతీయ స్థాయి దిగ్గజ ఐటీ కంపెనీ విశాఖలో అడుగుపెట్టడం చారిత్రాత్మక మైలురాయి అని ఐటీ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అన్నారు. శుక్రవారం నాడు విశాఖలో కాగ్నిజెంట్ సహా 9 ఐటీ కంపెనీల శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. విజన్ వాస్తవ రూపం దాలిస్తే కాగ్నిజెంట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలుగా మారతాయన్నారు. 2025 దావోస్‌లో కలిసి కాగ్నిజెంట్‌ను విశాఖకు ఆహ్వానించామని.. ఇప్పుడు మళ్లీ దావోస్‌కు వెళ్లకముందే ఆ సంస్థ ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించిందని తెలిపారు. నూతన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసిందని అన్నారు.


lokesh-visakha-cognizant.jpg

ప్రోత్సాహకంగా ఎకరా భూమిని 99 పైసలకు ఇస్తామని వారికి హామీ ఇచ్చామని.. ఆ మేరకే వారికి భూమి ఇచ్చామని వెల్లడించారు. సీఎం చంద్రబాబుకు 11 నెలలు అంటే సుదీర్ఘ కాలం అని.. ఆయనకు రియల్ టైమ్‌లో నిర్ణయాలు జరగాలని ఆశిస్తారని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు కేబినెట్‌లో మంత్రులందరం స్వేచ్ఛగా రాష్ట్ర అభివృద్ధికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. విశాఖపట్నం ఐటీ, జీసీసీ కేంద్రంగా మారుతుందని.. విశాఖ ఎకనామిక్ రీజియన్ కూడా ఈ ప్రాంత అభివృద్ధిని మారుస్తుందని పేర్కొన్నారు. వై నాట్ వైజాగ్ అనే ప్రశ్న ఉదయించేలా ఐటీ కంపెనీలు, పరిశ్రమల్ని ఈ ప్రాంతానికి ఆహ్వానిస్తున్నామన్నారు.


lokesh-visakha-cognizant3.jpg

ఆర్సెలార్ మిట్టల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఈ ప్రాంతానికి వస్తోందని మంత్రి తెలిపారు. గతంలో హైదరాబాద్‌లో ఊరు చివరగా జూబ్లిహిల్స్ చెక్ పోస్టు ఉండేదని... ఇప్పుడు అక్కడ చెక్ పోస్టు కాదు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలకు ప్రతీకగా మెట్రో స్టేషన్ ఉందన్నారు. తమ ముఖ్యమంత్రి ఓ జీపీఎస్ అని.. నిరంతరం అందరినీ అభివృద్ధి వెంట పరుగులు పెట్టిస్తారని అన్నారు. రాష్ట్రంలో పెట్టిన ప్రతీ ప్రాజెక్టునూ ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి చేయూత అందిస్తామని చెప్పామని... ఇప్పుడు కాగ్నిజెంట్‌కు కూడా అదే స్థాయి ప్రోత్సాహం అందిస్తామని స్పష్టం చేశారు.


lokesh-visakha-cognizant-1.jpg

కాగ్నిజెంట్‌లో పనిచేసే ఉద్యోగులంతా విశాఖ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని సూచించారు. 5 లక్షల ఐటీ ఉద్యోగాలు ఈ ప్రాంతానికి వచ్చేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌ను అభివృద్ధిబాటలో నడుపుతుంటే ఏపీని సీఎం చంద్రబాబు నాయుడు పురోగతి బాట పట్టిస్తున్నారని అన్నారు. వారిరువురూ 25 ఏళ్ల వయస్సున్న యువకుల్లా దేశ, రాష్ట్రాభివృద్ధికి పనిచేస్తున్నారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి: లోకేష్

టెక్ హబ్‌గా దూసుకెళ్తున్న విశాఖ.. కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌కు సీఎం శంకుస్థాపన

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 12 , 2025 | 03:10 PM