Share News

Visakhapatnam: టెక్ హబ్‌గా దూసుకెళ్తున్న విశాఖ.. కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌కు సీఎం శంకుస్థాపన

ABN , Publish Date - Dec 12 , 2025 | 01:24 PM

విశాఖలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్‌తో పాటు మరో 8 ఐటీ సంస్థలకు కూడా విశాఖలో క్యాంపస్‌ల ఏర్పాటుకు భూమిపూజ జరిగింది.

Visakhapatnam: టెక్ హబ్‌గా దూసుకెళ్తున్న విశాఖ.. కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌కు సీఎం శంకుస్థాపన
Visakhapatnam

అమరావతి, డిసెంబర్ 12: విశాఖలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఈరోజు (శుక్రవారం) శంకుస్థాపన చేశారు. దాదాపు 8,000 మంది ఉద్యోగులు పనిచేసేలా అత్యాధునిక వసతులతో క్యాంపస్ నిర్మాణం జరుగనుంది. మొత్తం రూ.1,583 కోట్ల పెట్టుబడితో 2033 నాటికి 3 దశల్లో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ క్యాంపస్ పూర్తి కానుంది. 2026 నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తి చేసుకోనుంది కాగ్నిజెంట్. అప్పటి వరకు అద్దె కార్యాలయంలో కార్యకాలపాలను ఆ సంస్థ కొనసాగించనుంది.


visakha-cognizent1.jpg

ప్రధానంగా ఏఐ, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై కాగ్నిజెంట్ దృష్టి సారించింది. కాగ్నిజెంట్‌తో పాటు మరో 8 ఐటీ సంస్థలకు కూడా విశాఖలో క్యాంపస్‌ల ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్, విశాఖ ఎంపీ భరత్, కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ పాల్గొన్నారు. త్వరలోనే విశాఖ నుంచి టెక్ తమ్మిన, సత్వ డెవలపర్స్, ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ ఇండియా, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్, ఏసీఎన్ హెల్త్ కేర్ ఆర్సీఎం సర్వీసెస్, నాన్రెల్ టెక్నాలజీస్ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి.

visakha-cognizent.jpg


ఈ సంస్థల ద్వారా రాష్ట్రానికి రూ. 3,740 కోట్ల పెట్టుబడులు, దాదాపు 41,700 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. గూగుల్ రాకతో ఇప్పటికే డేటా సిటీగా విశాఖ ఎదుగుతోంది. కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి సంస్థలు ప్రారంభించడంతో విశాఖ వైపు ప్రముఖ ఐటీ కంపెనీల చూపు పడింది. ప్రస్తుతం విశాఖలో 150కి పైగా టెక్ కంపెనీల కార్యకలాపాలు సాగుతున్నాయి. రాష్ట్రంలో ఐటీ నిపుణులకు విస్తృతంగా అవకాశాలు పెరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 18 నెలల్లో ఒక్క విశాఖలోనే రూ.1.34 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు వచ్చాయి.


ఇవి కూడా చదవండి...

దువ్వాడ మాధురి శ్రీనివాస్‌‌‌కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..

డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి: లోకేష్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 12 , 2025 | 02:38 PM