High Court Shock To Vijay Sai Reddy Daughter: విజయసాయిరెడ్డి కుమార్తెకు హైకోర్టు ఝలక్
ABN , Publish Date - Oct 09 , 2025 | 08:31 PM
విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం పరిధిలో సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా సముద్రానికి అతి సమీపంలో నిర్మించిన కాంక్రీట్ గోడను కూల్చేందుకు అయిన ఖర్చు రూ. 48.21 లక్షలను జీవీఎంసీ వద్ద జమ చేయాలని విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డిని హైకోర్టు ఆదేశించింది.
అమరావతి, అక్టోబర్ 09: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డితోపాటు ఆమె కంపెనీ అవ్యాన్ రియల్టర్స్ ఎల్ఎల్‌పీకి ఏపీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. విశాఖపట్నం జిల్లాలోని భీమునిపట్నం పరిధిలో సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా సముద్రానికి అతి సమీపంలో నిర్మించిన కాంక్రీట్ గోడను కూల్చేందుకు ఖర్చు అయిన రూ. 48.21 లక్షలను జీవీఎంసీ వద్ద జమ చేయాలని విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణలోగా ఈ నగదు మొత్తాన్ని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) వద్ద జమ చేయాలని సూచించింది. అలాగే కాంక్రీట్ నిర్మాణం కారణంగా ప్రకృతికి నష్టం జరిగిందని సంబంధిత కంపెనీ నుంచి రూ 17. 46 కోట్ల నష్ట పరిహారం రాబట్టాలని కేంద్ర అటవీ - పర్యావరణ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికపై సైతం స్పందన తెలియజేయాలని అవ్యాన్ రియల్టర్స్ ఎల్ఎల్‌పీకి స్పష్టం చేసింది.
ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ అక్టోబర్ 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్నంలోని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ వేసిన పిటీషన్‌పై గురువారం ఏపీ హైకోర్ట్‌లో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు భీమునిపట్నం సమీపంలో సీఆర్‌జెడ్ నిబంధనలు ఉల్లంఘించి రెస్ట్రోబార్లు నిర్మాణం చేశారంటూ ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ ఆథారిటీ (ఏపీసీజెడిఎంఏ) మెంబర్ సెక్రెటరీ, జీవీఎంసీ కమిషనర్, విశాఖ జిల్లా కలెక్టర్‌తో కూడిన కమిటీ నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందన తెలపాలని రెస్ట్రోబార్ యాజమాన్యాలకు సైతం ఈ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
అలాగే సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నాలుగు రెస్ట్రోబార్లను తొలగించడంతో పాటు సహజ ఆవాసాలను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ గ్రామాభివృద్ధి సేవా సంఘం అధ్యక్షుడు గంటా నూకరాజు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పెనక నేహారెడ్డి కంపెనీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ ఏపీ కోస్టల్ మేనేజ్‌మెంట్ ఆథారిటీ (ఏపీసీజెడ్ంఏ) మెంబర్ సెక్రెటరీని ఆదేశించిన విషయం విదితమే.
కాంక్రీట్ గోడ కూల్చివేతకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ఆ కంపెనీ నుంచే వసూలు చేయాలని జీవీఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. అక్రమ కాంక్రీట్ నిర్మాణాలతో ప్రకృతికి జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు నిపుణులతో కూడిన కమిటీ వేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖకు సైతం ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తొలి జాబితా విడుదల.. అభ్యర్థుల ఎంపికలో పీకే మార్క్
రైతులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.5000 పెన్షన్..
మరిన్ని ఏపీ, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి