Prashant Kishor Releases First Candidate List: తొలి జాబితా విడుదల.. అభ్యర్థుల ఎంపికలో పీకే మార్క్
ABN , Publish Date - Oct 09 , 2025 | 07:39 PM
ఎన్నికల వ్యూహాకర్తగా తనదైన శైలిలో వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్.. పార్టీ అధినేతగా సైతం అదే పంధాను అనుసరించారు. తాజాగా ఆయన పార్టీ తొలి జాబితాను గురువారం పార్టీలో ప్రశాంత్ కిషోర్ విడుదల చేశారు.
పాట్నా, అక్టోబర్ 09: బిహార్ అసెంబ్లీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో.. ఆ రాష్ట్రంలో ఎన్నికల వేడి బాగా పెరిగింది. ఇప్పటికే ప్రజలను లక్ష్యంగా చేసుకుని వివిధ పార్టీల నేతలు, అధినేతలు వరుసగా హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. మరోవైపు 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై ఆ యా పార్టీల అధినేతలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఆ క్రమంలో జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ తన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను గురువారం పాట్నాలో ప్రకటించారు. 51 మంది అభ్యర్థుల జాబితాను ఆయన విడుదల చేశారు.
అయితే ఈ తొలి జాబితాలో మాజీ ఉన్నతాధికారులు, రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారులు, వైద్యులతోపాటు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు రాసిన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ చోటు దక్కించుకు వారిలో ఉన్నారు. దీంతో తొలి జాబితాలో అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రశాంత్ కిషోర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. ఈ తొలి జాబితాలో 16 శాతం మంది ముస్లిం అభ్యర్థులు ఉండగా.. అత్యంత వెనుకబడిన వర్గాల వారు 17 శాతం మంది ఉన్నారు.
ఎన్నికల వ్యూహాకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్.. రాజకీయాల్లోని అవినీతిపై వివిధ వేదికల సాక్షిగా తనదైన శైలిలో విమర్శల గళం విప్పుతున్న విషయం విదితమే. దీంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తులను ప్రశాంత్ కిషోర్ ఎంపిక చేసుకున్నట్లు తాజాగా విడుదల చేసిన తొలి జాబితా పరిశీలిస్తే స్పష్టమవుతుంది. ఇదే విషయన్ని ప్రజల్లోకి ఆయన పంపారనే వాదన వినిపిస్తోంది. ప్రశాంత్ కిషోర్ విడుదల చేయనున్న అభ్యర్థుల జాబితాలో మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉండే ఛాన్స్ ఉందనే చర్చ సైతం సాగుతోంది.
ఇది ఇలా ఉంటే.. ఈ సారి జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు గత ఎన్నికల కంటే భిన్నంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) తిరిగి ఎన్డీఏ శిబిరంలోకి చేరడం.. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ ఎన్నికల అరంగేట్రం చేయడం.. ఏంఐఏం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రభావం తదితర అంశాలు ఈ మొత్తం బిహార్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో నవంబర్ 6, 11 తేదీల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14వ తేదీన వెలువడనున్నాయి. దీంతో బిహార్ ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టారనేది ఆ రోజు స్పష్టం కానుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అసెంబ్లీ ఎన్నికల వేళ.. తేజస్వీ కీలక ప్రకటన
రైతులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.5000 పెన్షన్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి